మేడమ్.. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు
మేడమ్.. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదు
Published Fri, Mar 14 2014 1:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
పలాస, న్యూస్‌లైన్ : ‘నమ్ముకున్నవారు నట్టేట ముంచారు.. కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఉన్న కొద్దిమంది పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకురావడం లేదు. పార్టీ పరిస్థితి బాగోలేదు.. చాలా కష్టంగా ఉంది.. నామినేషన్లు వేయడానికి ఒక్కరోజే సమయముంది.. ఏం చేయమంటారు..’ అని కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న కేంద్ర మంత్రి సమావేశంలో కొద్దిసేపు మాత్రమే ఉండి.. కొన్ని సూచనలిచ్చి వెళ్లిపోయారు. కాశీబుగ్గలోని మున్సిపల్ మాజీ చైరపర్సన్ కోట్ని లక్ష్మి భర్త దుర్గాప్రసాద్ కార్యాలయంలో గురువారం ఉదయం, సాయంత్రం కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఉదయం జరిగిన సమావేశానికి హాజరైన మంత్రి కృపారాణి మాట్లాడుతూ మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు తీవ్ర నిస్సహాయత వ్యక్తం చేశారు. మొన్నటివరకు కేంద్రమంత్రి వెంట తిరిగిన పలువురు మాజీ కౌన్సిలర్లు ముఖం చాటేయ గా కర్రి మాధవరావు, అట్టాడ మాధవరావు, రేగి గవరయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృపారాణి మాట్లాడుతూ మూడవ వార్డులో రేగి గవరయ్యను పోటీకి పెడతామని, ఆయనకు మద్దతు ఇవ్వాలని కర్రి మాధవరావును కోరారు. అందుకు ఆయన ససేమిరా అనటంతో కంగుతిన్నారు. ఈసారి వార్డు రిజర్వేషన్ తనకు వర్తించకపోవడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మీసాల సురేష్‌కు మద్దతు ఇస్తానని మాధవరావు స్పష్టం చేశారు. గతంలో ఆయన తనకు మద్దతు ఇచ్చారని,
ఈసారి ఆయనకు మద్దతి స్తానని మాటిచ్చానని, ఇచ్చిన మాట తప్పలేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పోటీ చేయలేమని అట్టాడ మాధవరావు, రేగి గవరయ్య చెప్పినట్టు తెలిసింది. దీంతో అన్ని వార్డులకు పోటీ చేయాలని, పాతవారు లేకపోతే కొత్తవారిని ప్రోత్సహించి శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కృపారాణి నిష్ర్కమించారు. సమావేశం లో మాజీ ఎమ్మెల్సీ మజ్జి శారద, హనుమంతు వెంకట రావు, వంక నాగేశ్వరరావు, కోట్ని దుర్గాప్రసాద్, పుక్కళ్ల గురయ్యనాయుడు, తిమడాన కృష్ణారావు, ఉర్నాన అప్పలరాజు తదితరులు పాల్గొన్నా రు. సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు డోల జగన్ సమక్షంలో సమావేశమైన నేతలు పరిస్థితి ఆశాజనకంగా లేదన్న అంచనాకు వచ్చినట్టు తెలిసింది. కనీసం పార్టీ పరువు దక్కించుకోవటానికైనా అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
Advertisement