
కావూరికి సమైక్య కాక
ఎక్కడికక్కడ అడ్డుకున్న సమైక్యవాదులు
‘పిచ్చోళ్లు, వెధవలు’ అన్న కేంద్ర మంత్రి
కిల్లి కృపారాణిని అడ్డగించిన ఉద్యమకారులు
ఏలూరు/కైకలూరు/విశాఖపట్నం, న్యూస్‌లైన్:
కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య కాక గట్టిగా తాకింది. మంగళవారం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలుచోట్ల సమైక్యవాదులు ఆయనను అడ్డుకున్నారు. తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘పిచ్చోళ్లు, వెధవలు’ అంటూ తమను మంత్రి నిందించడంతో ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన క్యాంప్ కార్యాలయంలో విధ్వంసానికి దిగారు. వారిపై కావూరి అనుచరులు చేయి చేసుకున్నారు. మరో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డిలకు కూడా మంగళవారం సమైక్య సెగ బాగా తగిలింది.
రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన 49 రోజుల అనంతరం తొలిసారి కావూరి జిల్లాకు వచ్చారు. ద్వారకా తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాక ఏలూరు బయల్దేరారు. భీమడోలు జంక్షన్‌లో ఎన్జీవోలు ఆయన్ను అడ్డుకున్నారు. ‘కావూరి గో బ్యాక్’, ‘తక్షణం పదవికి రాజీనామా చేయాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాట్లాడేందుకు కావూరి విఫలయత్నం చేశారు. మంత్రి కాన్వాయ్‌ని కదలనీయకుండా నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో పోలీసు బలగాల సాయంతో సమీపంలోని సమైక్యవాదుల శిబిరం వద్దకు కావూరి నడిచి వెళ్లారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై కేంద్ర మంత్రిగా వైఖరి చెప్పాలని వారు పట్టుబట్టారు. శ్రీకృష్ణ కమిటీ, పోలవరం ప్రాజెక్టు తదితరాలపై ఆయన మాట్లాడటంతో విసుగుచెందిన సమైక్యవాదులు, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం మీరేం చేస్తున్నారంటూ నిలదీశారు. అసహనానికి గురైన కావూరి, ‘పిచ్చోళ్లలా మాట్లాడుతున్నారు. మీ అందరి దగ్గరకూ వచ్చి మాట్లాడుతున్నాను. నా ప్రసంగానికి అడ్డు తగలడమేమిటి? మీలో సమైక్యవాదులున్నారా? లేక వేరే వ్యక్తుల్ని తీసుకొచ్చారా?’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన సమైక్యవాదులు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘గో బ్యాక్ కావూరి’ అంటూ నినదించారు. దాంతో ఆయన అసహనానికి గురై న వెళ్లిపోయారు.
తర్వాత కావూరి ఏలూరు వస్తున్నారని తెలుసుకున్న ఎన్జీవోలు, విద్యార్థులు, సమైక్యవాదులు అశోక్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో వంతెన వద్దకు చేరుకుని రహదారిని స్తంభింపజేశారు. కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని తోసేసి మంత్రిని క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆగ్రహించిన ఎన్జీవోలు, విద్యార్థులు కార్యాలయూన్ని ముట్టడించారు. అక్కడ కావూరి అనుచరులు సమైక్యవాదులతో ఘర్షణకు దిగి రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో సమైక్యవాదులు క్యాంప్ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లి అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు. కాసేపటికి కావూరి బయటకొచ్చి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన రాజీనామా చేయాలని ఎన్జీవోలు డిమాండ్ చేశారు. తాను మనసా వాచా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ఆయనన్నారు.
‘నా రాజీనామాతో తెలంగాణ ప్రకటన ఆగిపోతుందంటే నా అంత అదృష్టవంతుడు మరొకరుండరు. 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో నిజాయితీ, కట్టుబాట్లతో పని చేస్తున్నాను. నడ్డిరోడ్డుపై ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడే సత్తా నాకుంది. అసమర్థుణ్ని కాను’ అన్నారు. ఉద్దేశపూర్వకంగా, స్వార్థంతో కొందరిని తనపైకి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ‘మీలో చాలా మంది సమైక్యవాదులు కాదు’ అన్నారు. దానికి విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ‘పదవిని పట్టుకుని వేలాడ్డానికి నేను వెధవను కాదు. మీలో ఎవరైనా వెధవలుంటే నేనేం చేయలేనం’టూ పరుష వ్యాఖ్యలు చేశారు. వాటిపై ఎన్జీవోలు, విద్యార్థులు తీవ్ర నిరసన తెలిపారు. ‘కావూరి డౌన్.. డౌన్.. కావూరి గో బ్యాక్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా కావూరికి సమైక్య సెగ తగిలింది. మండవల్లి మండలం భైరవపట్నంలో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణకు ఆయన హాజరైన విషయం తెలిసి జేఏసీలు, పార్టీల నేతలు ఉదయం నుంచే గ్రామ రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం కావూరి రాగానే, రాజీనామా చేయాలంటూ నినదించారు. కారు వెంట పరుగులు తీశారు. కాన్వాయ్‌కి అడ్డొచ్చిన వారిని పోలీసులు విచక్షణారహితంగా పక్కకు నెట్టేయడంతో ముగ్గురు జేఏసీ నేతలు గాయపడ్డారు. విగ్రహావిష్కరణ సభలోనూ కావూరి ఉన్నంతసేపూ నిరసన నినాదాలు మిన్నంటాయి.
విమానాశ్రయంలో మంత్రులకు ఎదురుగాలి
సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం ఉదయం విశాఖ విమానాశ్రయంలో కృపారాణిని అడ్డగించారు. పోలీసు బందోబస్తు మధ్య ఆమె వెళ్లిపోజూశారు. మీడియా వివరణ కోరగా, ‘సమైక్యాంధ్ర కోసం కచ్చితంగా పోరాడాలి. అయితే కేంద్రం విభజన నిర్ణయాన్ని ప్రకటించే పరిస్థితి ఉంటే అప్పుడు రాజీనామా చేస్తా’నన్నారు. తర్వాత శత్రుచర్లను కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బదులివ్వకుండా పోలీసుల సాయంతో వెళ్లిపోయారు. సుబ్బరామిరెడ్డిని కూడా సమైక్యవాదులు మరోసారి అడ్డుకున్నారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా కేజీహెచ్‌లో రోగులకు పండ్లు, దుప్పట్లు పంచడానికి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆస్పత్రి మెయిన్ గేటు వద్ద దీక్ష చేస్తున్న మెడికల్ జేఏసీ నేతలు, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు టీఎస్సార్‌ను అడ్డగించారు. స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయాలని నిలదీశారు. రాష్ట్ర విభజనపై మీ వైఖరి ఏమిటంటూ ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు కట్టుబడ్డానని ఆయన చెప్పారు. తాను రాజీనామా చేసిన లేఖ జిరాక్స్ కాపీని జేబులోంచి తీసి వారికి చూపించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు.