‘చెన్నై మహానగరం ఏడాదిలో ఆరునెలలు దాహార్తితో విలవిల్లాడుతుంది. మరో ఆరునెలలు జల దిగ్బంధంలో మృత్యువుకు చేరువవుతుంది’ అంటూ మద్రాస్ హైకోర్టు ఈమధ్య చేసిన వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం. ఊహించని విపత్తులు విరుచుకుపడితే, అందువల్ల ఇబ్బందులు తలెత్తితే నెపం ప్రకృతిపై నెట్టినా జనం సహిస్తారు. కానీ వైపరీత్యాలు రివాజైనప్పుడు, వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకెళ్లే ముందస్తు నియంత్రణ చర్యలు కొరవడినప్పుడు నిస్సందేహంగా పాలకు లదే పాపం అవుతుంది. ఏటా ఈ సీజన్‌లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌లోని రాయలసీమ, ఇతర తీర ప్రాంతాలకు ఈశాన్య రుతుపవనాలు 50 శాతం వర్షాలను మోసుకొస్తాయి. ఆ సమయంలో అల్పపీడనం, తుపానులు చోటు చేసుకుంటే ఇదింకా పెరుగు తుంది. చెన్నైను ఈస్థాయిలో వరదలు ముంచెత్తడం ఈమధ్యకాలంలో ఇది రెండోసారి. 2015లో ఆ మహానగరం రోజుల తరబడి వరదనీటిలో తేలియాడింది. జనజీవనం స్తంభించిపోయింది.
గడప దాటి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ ఎక్కడివారక్కడ చిక్కడిపోయారు. వందల ఇళ్లు కూలిపోగా వేలాది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నాయి. అంతక్రితం పదేళ్లకొక మారు వరదలు ముంచెత్తడం సాధారణం కాగా, ఆ తర్వాత ఇంచుమించు ఏటా ఏదో మేరకు ఆ బాధలు తప్పడం లేదు. చెన్నైలో కొన్ని ప్రాంతాలైనా ప్రతియేటా వరద నీటితో కష్టాలు పడుతున్నాయి. 2015 నాటి వరదల అనుభవం తర్వాత నిపుణుల్ని సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవాలని ఎందరో ప్రముఖులు పాలకుల్ని వేడుకున్నారు. కానీ స్తబ్దుగా ఉండిపోయిన అధికార యంత్రాంగం పుణ్యమా అని మళ్లీ అయిదేళ్ల నాటి దృశ్యాలు పునరావృత మయ్యాయి. చెన్నై నగర పాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి నాలుగేళ్లయింది. ఓటమి భయంతో గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో ఇంతవరకూ చెన్నైకి మేయర్, కార్పొరేటర్లు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా స్థానిక పాలన లేనప్పుడు విపత్తు నివారణ చర్యలు అరకొరగానే ఉంటాయి. అయిదారు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడిన భారీ వర్షాల పర్యవసానంగా 14 మంది చనిపోగా, ఎందరో గాయపడ్డారు. వేలాది ఇళ్లు వరదల్లో చిక్కుకు న్నాయి. నిత్యావసరాలు లభించక, కనీసం తాగడానికి నీరు సైతం కరువై జనం నరకాన్ని చవిచూశారు. నగరంలోని తిరువొట్రియూర్, పెరంబూర్, పట్టాళం వంటి ప్రాంతాల్లో ఆరడుగుల మేర నీరు నిలిచింది. మొన్న ఆరు, ఏడు తేదీల్లో 24 గంటల వ్యవధిలో చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరదనీరు ముంచెత్తడంతో నగరంలో ఏడు సబ్‌వేలు, 23 రోడ్లు మూసేయాల్సి వచ్చింది. ఆ నగరం శుక్రవారం కొద్దిగా తెరిపిన పడింది.
ఇది ఒక్క చెన్నై నగరానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. వర్షాకాలంలో దేశంలోని అనేక నగరాలు ఇంచుమించు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణకు అనుసరిం చాల్సిన శాస్త్రీయ విధానాలను బేఖాతరు చేయడం, జనసాంద్రత ఎక్కువైనప్పుడు తలెత్తగల ఇబ్బం దులపై ప్రభుత్వాలకు అంచనాలు లేకపోవడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనం పాలిట శాపాలవుతున్నాయి. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం, మరెక్కడా జీవనోపాధికి అవకాశాలు లేకుండా చేయడం వల్ల గ్రామాలనుంచీ, పట్టణాలనుంచీ నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతమందికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి.
ఈ క్రమంలో చెరువులు, సరస్సులుగా ఉన్న ప్రాంతాలు బస్తీలుగా మారుతున్నా చూసీచూడనట్టు వదిలే స్తున్నారు. కనీసం నిర్దేశించుకున్న నిబంధనలను పాటిద్దామన్న స్పృహ కూడా లేకుండా ఎడాపెడా నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. డబ్బూ, పలుకుబడి ఉంటే చాలు ఏవైనా సునాయాసంగా లభి స్తాయి. ప్రైవేటు వ్యక్తుల సంగతలావుంచి ప్రభుత్వాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అన్నిచోట్లా కనబడుతుంది. చెన్నైలో ఇప్పుడున్న విమానాశ్రయమైనా, బస్సు టెర్మినల్ అయినా, ఇత రత్రా నిర్మాణాలైనా చిత్తడి నేలల్లో నిర్మించినవేనన్నది నిపుణుల ఆరోపణ. కురిసిన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెరగడానికి తోడ్పడే పథకాలు అమల్లోకి తీసుకురావడం, ఎంత వరదనీరు ముంచెత్తినా క్షణాల్లో అది బయటకుపోయేందుకు అనువైన మార్గాల నిర్మాణం భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూస్తుంది. ఈ దిశగా అసలే చర్యలు తీసుకోలేదని చెప్పలేం. కానీ నిధుల కైంకర్యం తప్ప మరో యావలేని రాజకీయ నాయకుల తీరుతెన్నులవల్ల ఆ చర్యలన్నీ నిరర్థక మవుతున్నాయి. చెన్నై నగరానికి స్మార్ట్ సిటీ ప్రతిపత్తి వచ్చింది. ఆ పథకం కింద నిధులూ అందాయి. అందువల్లే వరద బెడద కాస్త తగ్గిందని మాజీ సీఎం పళనిస్వామి చెబుతున్నారు. కానీ ఖర్చయిన మొత్తంతో పోలిస్తే జరిగిన మేలెంత అన్నది ప్రశ్న. ఇప్పుటికైనా తగిన చర్యలు మొదలె డితే పదేళ్లకల్లా చెన్నై మెరుగుపడుతుందంటున్న పర్యావరణవేత్తల హితవచనం చెవికెక్కాలి.
ఇటీవలే విరుచుకుపడిన ఉత్తరాఖండ్ వరద బీభత్సాన్ని, ఇప్పుడు చెన్నై దుస్థితిని చూశాకైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలూ సమానంగా ఎదగడంతో పాటు మహానగరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రకృతిని సంరక్షించుకుంటే ఆపత్సమయాల్లో అది మనను అమ్మలా కాపాడుతుంది. విచ్చలవిడిగా వ్యవహరించి ధ్వంస రచనకు పూనుకుంటే నిర్దాక్షిణ్యంగా కాటేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment