సాయంత్రానికి ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితం
ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం
రాణీమేరీ కళాశాల వద్ద భారీ బందోబస్తు
జయ మెజార్టీపైనే సర్వత్రా ఉత్కంఠ
చెన్నై, సాక్షి ప్రతినిధి:
చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికపై నెలరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మంగళవారం ఉదయం ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమై, సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. ఒక ఉప ఎన్నికకు సహజంగా ఇంత చర్చ అవసరం ఉండదు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలు కావడమే కాక మరో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను సైతం చేజార్చుకున్నారు. అయితే ఆ తీర్పుపై అప్పీలు చేసి నిర్దోషిగా బయటపడడం ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి పూర్వవైభవం పొందారు. అధిరోహించిన ముఖ్యమంత్రి పీఠాన్ని మరో ఏడాదిపాటు శాశ్వతం చేసేందుకు ఆర్కేనగర్ నుంచి ఆమె మళ్లీ పోటీ చేయక తప్పలేదు.
జయ నిర్దోషిగా బయటపడడాన్ని జీర్ణించుకోలే క కారాలు మిరియాలు నూరుతున్న పార్టీలు ఆశ్చర్యకరంగా ఉప ఎన్నికలో ఆమెపై పోటీ పెట్టలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే సహా కాంగ్రెస్, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, బీజేపీ తదితర పార్టీలన్నీ ఎన్నికలను బహిష్కరించాయి. ప్రధాన పార్టీల జాబితాలో సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ మాత్రమే పోటీ చేశారు. మరో 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ఈ నెల 27వ తేదీన 74.4 శాతంతో పోలింగ్ పూర్తయింది. పాత వన్నార్‌పేటలో ఓటర్ల సంఖ్య కంటే ఎక్కువ శాతం పోల్ కావడంతో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల నుంచి భారీ బందోబస్తుతో తరలించిన ఈవీఎంలను రాణీమేరీ కాలేజీలో భద్రం చేశారు.
గదికి సీలు వేసి మూడంచెల భ ద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. జయ గెలవడం ఖాయమని తేలిపోగా ఆమెకు లభించే మెజార్టీపైనే ఉత్కంఠ నెలకొంది. ఆర్కేనగర్ అన్నాడీఎంకే అభ్యర్థిగా తనకు అఖండ మెజార్టీని అందివ్వాలని ముఖ్యమంత్రి జయలలిత పోలింగ్‌కు ముందురోజునే ఓటర్లను అభ్యర్థించారు. ప్రధాన పార్టీలేవీ పోటీలో లేనందున దేశ చరిత్రలో నిలిచిపోయేలా అత్యధిక మెజార్టీ రావాలని అన్నాడీఎంకే ఆశిస్తోంది.
నేడే ఓట్ల లెక్కింపు
Published Tue, Jun 30 2015 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement