రంగంలోకి అమిత్ షా | Amit Shah entry in Tamil Assembly | Sakshi
Sakshi News home page

రంగంలోకి అమిత్ షా

Published Thu, Apr 7 2016 1:44 AM | Last Updated on Fri, Mar 29 2019 8:34 PM

Amit Shah entry  in Tamil Assembly

సాక్షి, చెన్నై : తమిళ అసెంబ్లీలో తమ ప్రతినిధులు అడుగు పెట్టడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సిద్ధమయ్యారు. ఈ నెల పదమూడు నుంచి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఆ రోజున తిరుచ్చి వేదికగా జరిగే బహిరంగ సభలో తమ అభ్యర్థులను పరిచయం చేయబోతున్నారు.
 
 డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు చతికిలబడ్డ విషయం తెలిసిందే. చిన్న పార్టీలను కలుపుకుని అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలి విడత జాబితా విడుదల కాగా, మలి విడత జాబితా, మిత్రులకు సీట్ల పంపకాల మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్ర కసరత్తుల్లో ఉన్నారు. ఈ సారి ఎలాగైనా తమ ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో బీజేపీ వర్గాలు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నాయి.
 
 ఇందుకు తగ్గ వ్యూహాల్ని రచించే పనిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిమగ్నమయ్యారు. తన వ్యూహాల్ని అమలు పరిచేందుకు రాష్ట్రంలో పర్యటించాలని అమిత్ షా నిర్ణయించి ఉన్నారు. ఇందుకు తగ్గ సమాచారం ఢిల్లీ నుంచి చెన్నైకు చేరడంతో కమలనాథులు అమిత్ షా పర్యటన ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. ఈనెల పదమూడో తేదీన తిరుచ్చి వేదికగా భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేపట్టారు. ఆ వేదిక నుంచి అమిత్‌షా తన ప్రచార పర్యటనను శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ వేదికపై మలి విడత జాబితా ప్రకటనతో పాటుగా, పార్టీ, మిత్ర పక్షాల అభ్యర్థుల్ని ఆయన పరిచయం చేయబోతున్నారు.
 
 తదుపరి పలుమార్లు రాష్ట్రంలో పర్యటించేందుకు అమిత్‌షా నిర్ణయించి ఉండడంతో, ప్రధానంగా గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్ని కలుపుతూ అమిత్‌షా బహిరంగ సభలకు రాష్ట్ర బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టి ఉన్నాయి. అదే సమయంలో డిఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు. డీఎండీకేలో చీలిక అనివార్యం అవుతుండడంతో, ఇక తమ బలాన్ని చాటుకునేందుకు ప్రత్యామ్నాయం తామేనన్న నినాదాన్ని బిజేపీ వర్గాలు అందుకునే పనిలో పడ్డాయి.
 
 ఈ విషయంగా బుధవారం కమలాలయంలో మీడియాతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా మాట్లాడుతూ డీఎండీకే ఇక నిర్వీర్యమైనట్టేనని పేర్కొన్నారు. ప్రజా కూటమిలోకి చేరినప్పుడు విజయకాంత్ భవిష్యత్తు ఇక ముగిసిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు  ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇక ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీల మధ్యమాత్రమేనని పేర్కొన్నారు. ముందుగా కమలాలయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరరావు నేతృత్వంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ జెండాను ఎగురవేసిన మురళీధరరావు, అందరికీ స్వీట్లు పంచి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement