డీఎంకే వైపు కెప్టెన్ చూపు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ అకస్మాత్తుగా తన దిశను మార్చేశారు. డీఎంకేతో చెలిమికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే మిత్రపక్షం గా బరిలోకి దిగిన విజయకాంత్ పెద్ద సం ఖ్యలో స్థానాలను రాబట్టుకున్నారు. అకస్మాత్తుగా అమ్మ పార్టీతో విభేదించి పార్లమెంటు ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ కూటమిలో చేరిపోయారు. ఇది కూడా మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. శ్రీరంగం ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి తరఫున విజయకాంత్ ప్రచారం కాదుకదా, కనీసం మద్దతుగా ప్రకటన కూడా చేయలేదు.
పేరుకు ఎన్‌డీఏ కూటమిలో ఉన్నా బీజేపీతో దూరంగానే మెలుగుతున్నారు. ఇదిలా ఉండగా గడిచిన అసెంబ్లీ సమావేశాల సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటుపడింది. రెండు సమావేశాలకు హాజరుకాకుండా స్పీకర్ వేటు వేశారు. స్పీకర్ చర్య ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని డీఎండీకే ఎమ్మెల్యేలకు మద్దతుగా డీఎంకే అధినేత కరుణానిధి బహిరంగ ప్రకటన చేశారు. ఎవరి ప్రకటనలకూ అంతగా స్పందించే అలవాటులేని విజయకాంత్ కరుణానిధికి కృతజ్ఞతలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బహిష్కృత డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయంలో ధర్నా చేపట్టిన సమయంలో డీఎంకే సభ్యులు స్టాలిన్, దురైమురుగన్ తదితరుల మద్దతును కోరారు.
డీఎంకే నేతలు సైతం డీఎండీకే ఎమ్మెల్యేల బహిష్కరణ ప్రజాస్వామ్య విరుద్ధమంటూ సంఘీభావం ప్రకటించారు. డీఎండీకే డీఎంకే కూటమిలో చేరాలని ఇటీవల జరిగిన ఒక సమావేశంలో మరో పార్టీ నేత కోరగా సమయం వచ్చినపుడు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని విజయకాంత్ ప్రకటించారు. డీఎండీకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బీజేపీకి దూరమై డీఎంకేకు దగ్గరయ్యేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆ నాటికి ఈ రెండు పార్టీల మధ్య చెలిమి బలపడవచ్చని భావిస్తున్నారు.