విజయ్‌, విజయకాంత్లకు బీజేపీ గాలం | BJP focus to vijay ilayathalapathy, support Vijayakanth for tamilnadu Assembly elections | Sakshi
Sakshi News home page

విజయ్‌, విజయకాంత్లకు బీజేపీ గాలం

Published Thu, Oct 16 2014 8:00 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

విజయ్‌, విజయకాంత్లకు బీజేపీ గాలం - Sakshi

విజయ్‌, విజయకాంత్లకు బీజేపీ గాలం

 ‘ఇన్నాళ్లు సూపర్ స్టార్ రజనీకాంత్ నినాదాన్ని పఠించిన కమలనాథులు ఇక, ఇళయదళపతి విజయ్, డీఎండీకే అధినేత విజయకాంత్ పేర్లను జపించేందుకు సిద్ధమయ్యారు.’ విజయ్‌కు గాలం వేయడంతో పాటుగా విజయకాంత్‌కు అండగా నిలబడేందుకు బీజేపీ అధిష్టాన ం కసరత్తుల్లో మునిగింది.
 
 సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాల్లో మునిగింది. పీఎం మోదీచరిష్మాను, రాష్ట్రంలోని ఇన్నాళ్లు సాగిన ద్రవిడ పార్టీల అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న బలమైన శక్తుల మద్దతును కూడగట్టుకునే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యూరు. సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దించడం లక్ష్యంగా తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఇన్నాళ్లు రజనీ నినాద మంత్రాన్ని పఠించిన కమలనాథులు, ఇక విజయకాంత్, విజయ్ పల్లవి అందుకునేందుకు సిద్ధం అయ్యారు.  ఇళయ దళపతిగా పేరున్న విజయ్‌కు రాష్ట్రంలో అశేష అభిమాన లోకం ఉంది.  అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు విజయ్ తన మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో అన్నాడీఎంకే సర్కారు రూపంలో విజయ్‌కు చిక్కులు తప్పలేదు.
 
 దీంతో లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు వేదికగా నరేంద్ర మోదీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. విజయ్ ఎలాంటి సంకేతం ఇవ్వకున్నా, ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా ఆయన అభిమానులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో విజయ్ మద్దతను పూర్తి స్థాయిలో దక్కించుకోవడం లక్ష్యంగా కమలనాథులు ప్రయత్నాల్లో పడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలతో విజయ్‌కు గాలం వేసే పనిలో కొందరు నాయకులు పడ్డారు. సేవా కార్యక్రమాలకు వేదికగా విజయ్ నేతృత్వంలో ఉన్న మక్కల్ ఇయక్కం మద్దతును కూడగట్టుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. తమకు మద్దతుగా నిలిచిన పక్షంలో విజయ్‌కు లేదా, ఆయన సూచించే వ్యక్తికి రాజ్య సభ సీటును ఎరగా వేయడానికి కమలనాథులు రెడీ అవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 డీఎండీకేకు అండ: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ మనసు మారకుండా, తమతో కలసి ఉండే విధంగా కొత్త  వ్యూహాన్ని రచించారు. విజయకాంత్‌కు రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం, ఆ పార్టీకి, ఆ పార్టీ నేతృత్వంలోని కెప్టెన్ టీవీకి అండగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. పదేళ్లుగా పార్టీని ఒంటరిగా విజయకాంత్ ముందుకు తీసుకె ళుతున్నారు. అన్నీ తానై  ముందుకు సాగుతున్న విజయకాంత్‌కు కెప్టెన్ టీవీ, న్యూస్ చానెళ్లు ఉన్నాయి. ఈ చానెళ్లు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. పార్టీని ముందుకు తీసుకెళ్లడం విజయకాంత్‌కు భారంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అధిష్టానం, ఆయనకు అండగా నిలబడేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
 
 తమతో మిత్రత్వం కొనసాగిస్తే, ఈ సారి విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్‌లలో ఒకరికి రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటుగా, టీవీ చానెళ్ల అభివృద్ధికి ఆర్థిక సహకారాన్ని ఇచ్చి, పూర్తి స్థాయిలో కూటమి పార్టీ, మద్దతు నేతల కార్యక్రమాల ప్రచారం లక్ష్యంగా ఉపయోగించుకునేందుకు కమలనాథులు వ్యూహ రచన చేశారు. విజయకాంత్ సీఎం సీటు లక్ష్యంగా రాజకీయ పయనం సాగిస్తున్న  దృష్ట్యా, ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు ‘సీఎం’ సీటు నిర్ణయం తెరపైకి తెచ్చే విధంగా కమలనాథులు కసరత్తుల్లో దిగారు.
 
 రంగంలోకి అమిత్ షా: మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో ఇక తమిళనాడులో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అమిత్ షా సిద్ధమవుతున్నారు. త్వరలో  తన వ్యూహాల అమలు లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగనున్నట్టు కమలాలయంలో ప్రచారం ఊపందుకుంటోంది. అమిత్ షా రంగంలోకి దిగబోతున్నందునే ఈనెల 26న పార్టీ సర్వ సభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పిలుపు నిచ్చారని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం ప్రకటనతో అమిత్ షా వ్యూహాల అమలు లక్ష్యంగా నేతలు పరుగులు తీయనున్నారు. దీంతో కొద్ది రోజుల నుంచి కమలనాథుల నోట ‘వీ’ నినాద జపం మార్మోగనుంది. ఇక, రజనీకి సీఎం సీటు ఆఫర్, విజయ్ గాలం, విజయకాంత్‌కు ఆర్థిక అండ ఇచ్చే రీతిలో అమిత్ రచించిన వ్యూహాలు ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయోనన్నది వేచి చూడక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement