కొత్తకూటమికి సన్నాహాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యే ప్రయత్నాలు ప్రారంభమయ్యూయి. డీఎంకే నేతృత్వంలో కొత్తకూటమి ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ అప్పుడే కసరత్తులు మొదలెట్టాయి. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఏంకే చేతిలో అన్ని పార్టీలు చావుదెబ్బతిన్నాయి. బీజేపీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలన్నీ బలమైన కూటమిగా ఏర్పడినా ఒంటరిపోరుకు దిగిన అన్నాడీఎంకే జోరుకు అడ్డుకట్టవేయలేక పోయాయి. రెండు సార్లు కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ సైతం మట్టికరిచింది. మొత్తం 39 పార్లమెంటు స్థానాల్లో 37 స్థానాలను అన్నాడీఎంకే ఎగరేసుకుపోగా, బీజేపీ ఒక్క స్థానంతోనూ, బీజేపీ కూటమికి చెందిన పీఎంకే నేత అన్బుమణి రాందాస్ మరో స్థానంలోను గెలుపొందారు. రాష్ట్రంలో అన్నాడీఎంకేకు సమానంగా బలమైన ప్రాంతీయ పార్టీగా వెలుగొందుతున్న డీఎంకే సైతం పార్లమెంటు ఎన్నికల్లో చావుదెబ్బతినింది.
జయను ఒంటరి చేసే యత్నం: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే జోరుకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలనే విషయంలో ప్రతిపక్షాలన్నీ (బీజేపీ మినహా) సుముఖంగా ఉన్నాయి. ఇప్పటికే తెరవెనుక ఒక ఒప్పందం జరిగినట్లుగా పార్టీల సమావేశాల్లో ఒకేరకమైన నినాదాన్ని ఇవ్వడం ద్వారా కొత్తకూటమికి సంకేతాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఒకటి కావాలని కరుణానిధి, ప్రజావ్యతిరేకిని ఓడిం చేందుకు ఎవ్వరితోనై చేతులు కలిపేందుకు సిద్ధమంటూ ఎండీఎంకే అధినేత వైగో, ప్రజల మంచి కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్దమని డీఎండీకే అధినేత విజయకాంత్..ఇలా అన్ని పార్టీల వారు తమ సమావేశాల ద్వారా సుముఖత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తదితర పార్టీలు సైతం తమ కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో పడ్డాయి. డీఎంకే నేతృత్వంలో కూటమికి ఎండీఎంకే ఓకే అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అధికార పార్టీ దూకుడును అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలంటూ కాంగ్రెస్, డీఎండీకేల నేతలు చెబుతున్నారు. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికలు కరుణ నాయకత్వంలోనే సాగుతాయని ఆయన కుమారుడు, పార్టీ కోశాధికారి స్టాలిన్ ప్రకటించారు. అంటే పార్టీ పగ్గాలు స్టాలిన్ చేతుల్లోకి వస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కొన్ని పార్టీలు కూటమిలో చేరేందుకు వెనకడుగు వేసే ప్రమాదం ఉందని స్టాలిన్ గ్రహించే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే మినహా మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ కూటమిలోనే కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఏర్పడిన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని అడపాదడపా పార్టీలన్నీ ప్రకటిస్తున్నాయి. ఈ దశలో అసెంబ్లీ ఎన్నికల నాటికి కొత్తకూటమి సాధ్యమా అనే అంశంకోసం కొద్దికాలం వేచిచూడక తప్పదు.