అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలుపాలు కావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇటీవలి వరకు సాగిన జయ ప్రభంజనాన్ని తట్టుకోలేక చతికిల పడిన ప్రతిపక్షాలన్నీ ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఐదేళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు చెరొకసారి పీఠాన్ని పంచుకుంటాయి. ఒకటి, రెండుసార్లు మినహా దాదాపుగా ఇదే ఫలితాలను ప్రజలు సైతం ఎదురుచూస్తారు. అధికార పార్టీపై వ్యతిరేకతో లేదా పోనీలే పాపం అనే సానుభూతో తెలియదు కానీ జయ, కరుణలకు పట్టం కడుతుంటారు. రాష్ట్రం లోని కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష జాతీయ పార్టీలైనా, ఇతర ప్రాంతీయ పార్టీలైనా అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏదో ఒక పక్షాన నిలిచి ఉనికి చాటుకోవాల్సిందే. ఇటీవల జరిగిన పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిరిగా పోటీకి దిగిన అన్నాడీఎంకే విజయఢంకా మోగించగా, ఇతర పార్టీలన్నీ ఘోరంగా ఓడిపోయాయి.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే ఇదే జోరునుకొనసాగించే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా తల్లకిందులైంది. జయ జైలుపాలైంది. అన్నాడీఎంకేకు జనాకర్షణ నేత కరువయ్యూరు. ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. 2016లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జయను ఎలా ఎదుర్కోవాలంటూ తలలు పట్టుకుని కూర్చున్న పార్టీలన్నీ ఒక్కసారిగా జూలు విదిల్చే పనిలో పడ్డాయి. మరో ఏడాదిన్నర కాలంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం సీటు కోసం తెరవెనక వ్యూహాలు ప్రారంభించాయి. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఒక కూటమిగా మారాలనే ప్రతిపాదనను ఇప్పటికే అన్ని పార్టీలు ప్రస్తావించాయి. అన్నాడీఎంకేను మరింత అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని పార్టీలు గళం ఎత్తాయి.
అధికార పార్టీలో ఉంటూ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని పీఎంకే వ్యాఖ్యానించింది. జయ జైలు తరువాత రాష్ట్రంలో జరిగిన ఆస్తినష్టాలను అన్నాడీఎంకే నుంచి వసూలు చేయాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ సోమవారం డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన అగాధాన్ని పీఎంకే భర్తీ చేస్తుందని పీఎంకే యువజన సంఘం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. జయలలిత జైలు పాలు కావడంతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాయని, పెద్ద ఎత్తున అమాయక ప్రజల ఆస్తులను ధ్వంసం చేశాయని డీఎంకే అధినేత కరుణానిధి ఇప్పటికే గవర్నర్ కే రోశయ్యకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఇతర ప్రాంతీయ పార్టీలతో డీఎంకే ఒక కూటమిలా ఏర్పడేందుకు సన్నాహాలు ప్రారంభించింది. కాంగ్రెస్ సహా అనేక పార్టీలు ఇప్పటికే సానుకూలమైన సంకేతాలు ఇచ్చాయి.
ప్రత్యామ్నాయ దిశగా ప్రతిపక్షాలు
Published Mon, Sep 29 2014 11:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement