పీఠంపై గురి!
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన స్వార్వత్రిక పార్లమెంటు ఎన్నికలు అన్నాడీఎంకే, బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీలకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. కాంగ్రెస్, డీఎంకేలు చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఓటమిని మూటకట్టుకున్నాయి. బీజేపీతో పొత్తుపెట్టుకుని ఘోరపరాజయం పాలైన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ఇంగువ వాసన చీర చెంగుకు అంటుకున్నట్లుగా సంబరపడి పోతున్నాయి. తామే మోడీ.. కేంద్రంలో తమదే ప్రభుత్వమని చంకలు గుద్దుకుంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి పరిణాలు ఉండవని ఆయా పార్టీల నాయకులు తెలుసుకుంటున్నారు.
స్టాలిన్ సుడిగాలి పర్యటనలు
డీఎంకే రథసారథి కరుణానిధి వృద్ధాప్యం కారణంగా పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ కోశాధికారి, కరుణ కుమారుడు స్టాలిన్‌పై పడింది. ఆయన గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరుణ పెద్ద కుమారుడు అళగిరి అడ్డుకూడా లేకపోవడంతో అవసరమైన చోట్ల క్యాడర్‌లో మార్పులు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీన కన్యాకుమారిలో సమావేశాన్ని ముగించుకుని బుధవారం తూత్తుకూడిలో స్టాలిన్ సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషించుకుంటూ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
16న డీఎండీకే సమావేశం
ఇదిలాఉండగా బీజేపీ కూటమిలో మరో మిత్ర పక్షం డీఎండీకే కూడా తన బలాన్ని పెంచుకునే పనిలోపడింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకేల తరువాత అతిపెద్ద పార్టీగా ప్రచారం చేసుకుని బీజేపీతో జతకట్టేందుకు తెగబెట్టు చేసిన డీఎండీకే కు ఎన్నికల్లో శృంగభంగమే మిగిలింది. ఒకవైపు అమ్మవైపు వెళ్లిపోయిన రెబల్ ఎమ్మెల్యేలు, మరోవైపు ఉన్నవారు జారిపోకుండా కాపాడుకునే యత్నాలు చేస్తూనే రాబోయే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. అనారోగ్య కారణాలతో 13రోజుల పాటు విదేశాల్లో గడిపి వచ్చిన కెప్టెన్ ఈ నెల 16వ తేదీన కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరుపుతున్నారు. పార్టీ నేతల నుంచిసూచనలు, సలహాలను స్వీకరించనున్నారు.
17న పీఎంకే సమావేశం
బీజేపీతో జతకట్టిన పీఎంకే ధర్మగిరి స్థానం గెలుచుకుంది. బీజేపీ కూటమిలోని మరే పార్టీకి ఈ గౌరవం దక్కలేదు సరికదా, అనేకులు డిపాజిట్టు కోల్పోయారు. తమకు దక్కిన విజయం బీజేపీ బలమా లేక తమ బలమా అనే మీమాంశను పీఎంకే ఎదుర్కొంటోంది. రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకోవడమా లేక ఒంటరిగా పోటీకి దిగడమా అని ఆలోచిస్తోంది. ఈ అంశంపై అభిప్రాయ సేకరణకు ఈ నెల 17వ తేదీన పార్టీనేతల సమావేశమవుతోంది.
కమిటీలతో కాంగ్రెస్ కసరత్తు
జిల్లా స్థాయి కమిటీల నియమకానికి ఏళ్ల తరబడి జాప్యం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అదే పనిలోపడింది. కేంద్రంలో అధికారం కోల్పోయి, పార్టీ పతనమైపోగా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రతి చిన్ననేతనూ పలుకరిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏదో పదవిని కట్టబెట్టడం ద్వారా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడుగా జ్ఞానదేశికన్‌ను తొలగించాలన్న అంశం వెనక్కుపోవడంతో ఆయనే కమిటీ నియామక నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ప్రచారాస్త్రాలతో అన్నాడీఎంకే
అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేయడం ద్వారా రాబోవు అసెంబ్లీ ఎన్నికలను సులభంగా ఎదుర్కొన వచ్చని అన్నాడీఎంకే ధైర్యంగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రచారాలకే పరిమితమైన మొబైల్ వాహనాలకు డిజిటల్ తెరలను సిద్ధం చేసి డాక్యుమెంటరీ చిత్రాలను ప్రదర్శిస్తోంది. సాధారణ అంబులెన్స్ సైజులో ఉండే ఈ వాహనాలు నివాస కూడళ్లకు చేరుకుని చిత్రాలను ప్రదర్శిస్తుండగా ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
జాలర్ల సమస్యే బీజేపీ ప్రచారాస్త్రం
దశాబ్దాల తరబడి తమిళ మత్స్యకారులు ఎదుర్కొంటున్న శ్రీలంక సమస్యను పరిష్కరించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని భారతీయ జనతా పార్టీ అడుగులు కదుపుతోంది. రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యలున్నా అంతర్జాతీయ సమస్యను పరిష్కరిస్తే అన్ని సమస్యలను కొలిక్కితేగల సామర్థ్యం ఉన్నట్లుగా ప్రజలకు రుజువు చేయవచ్చని తహతహలాడుతోంది. ఈ ప్రయత్నానికి రాష్ట్ర, జాతీయ నేతలు సైతం సహకరిస్తున్నారు.