కాంగ్రెస్ తో పొత్తుకు రెడీ
రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌లో ఒకే వేదికగా పయనం సాగించడం దాదాపు ఖరారైనట్టే. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆ రెండు పార్టీల నాయకులు మనదంటే, మనది కూటమే అని వ్యాఖ్యానించడం విశేషం. ఇక, అన్నాడీఎంకే పతనం కోసం డబుల్ బ్యారెల్ గన్స్‌గా పనిచేయడానికి రెడీ అయ్యారు.
సాక్షి, చెన్నై :2004 నుంచి యూపీఏ కూటమి వేదికగా డీఎంకే, కాంగ్రెస్ కలసి పనిచేసిన విషయం తెలిసిందే. తమ బంధం విడదీయరానిదంటూ ఏళ్ల తరబడి రెండు పక్షాల నాయకులు భుజం రాసుకుంటూ ముందుకు సాగారు. ఈ పరిస్థితుల్లో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం డీఎంకే మంత్రుల మెడకు చుట్టుకోవడం బంధం బెడిసి కొట్టేందుకు కారణం అయింది.యూపీఏకు టాటా చెప్పిన డీఎంకే ఇటీవలి లోక్ సభ ఎన్నికల్ని చిన్నా చితక పార్టీలతో కలసి ఎదుర్కొని డిపాజిట్లను గల్లంతు చేసుకుంది. ఇక ఒంటరిగా రాష్ట్రంలో బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు అదే పరిస్థితి. తాజాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకుని కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు రెండు పార్టీలు కుస్తీలు పడుతున్నాయి.అదే సమయంలో మెగా కూటమి ఏర్పా టు ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలన్న కాంక్షతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ముందుకు సాగుతున్నారు.
పాత మిత్రుల్ని మళ్లీ ఏకం చేయడంతో పాటుగా కాంగ్రెస్‌తో మళ్లీ బంధానికి సిద్ధం అవుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే, కాం గ్రెస్ అధినాయకులు ఒకే వేదిక మీదకు రావడం పాత బంధాన్ని గుర్తు చేసుకుంటూ, మనదంటే, మనదీ కూటమి అంటూ, అన్నాడీఎంకే పాలనకు మంగళం పాడేందుకు డబుల్ బేరెల్ గన్‌గా మారతామని మన కూట్టమి : ఆది ద్రావిడ పేరవై నేతృత్వంలో సమాజ హితాన్ని కాంక్షించే మహానాడు కామరాజర్ అరంగం వేదికగా జరిగింది. ఇందులో డిఎంకే తరపున ఆ పార్టీ కోశాధికారి ఎంకేస్టాలిన్, టీఎన్‌సీసీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవికేఎస్ ఇళంగోవన్ హాజరు అయ్యారు. డీఎంకేను గతంలో పదే పదే విమర్శిస్తూ, ఆరోపణలతో ఇరకాటంలో పెట్టిన ఈవీకేఎస్ ప్రస్తుతం తన ధోరణిని మార్చుకుని ఆ పార్టీకి దగ్గరయ్యేందుకురెడీ అయ్యారు.
ఇందుకు అద్దంపట్టే రీతిలో స్టాలిన్‌తో కలసి ఆ మహానాడు వేదికగా ఈవీకేఎస్ చేతులు కలపడమే కాదా, స్నేహం అంటే మనదేరా ... అన్నట్టుగా వ్యవహరించి అందర్నీ విస్మయంలో పడేశారు. ముందుగా ప్రసంగాన్ని అందుకున్న ఈవీకేఎస్ కాంగ్రెస్, డీఎంకేలు కూట్టమిగానే పనిచేస్తూ వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల కూటమి అన్నది ఆ సమయానికి తగ్గట్టుగా ఉంటుందని, ప్రజా సమస్యలపై ఒకే బాటలో కూటమిగానే పయనిస్తున్నామని వివరించారు. అన్నాడీఎంకే సర్కారును ఇంటికి సాగనంపడం లక్ష్యంగా డబుల్ బ్యారెల్ గన్స్‌గా తామిద్దరం పనిచేయడానికి సిద్ధం అని వ్యాఖ్యానించడం,ఆ మహానాడు వేదికలో కరతాళ ధ్వనుల్ని మర్మోగించింది.
ఇక, స్టాలిన్ తన ప్రసంగంలో ఈవీకేఎస్ కొంతే చెప్పారంటూ, మిగిలింది తాను చెబుతానని గతాన్ని అందుకున్నారు. తాను, ఇళంగోవన్ ఒకే కూటమి అని, తామిద్దరూ ఒకే బాణిలో స్పందిస్తామని, ప్రజా సమస్యలపై తమ గళం ఒక్కటేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం , అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడం కోసం తామిద్దరం బలమైన కూటమిగా ఎదగడానికి వెనుకాడబోమని వ్యాఖ్యానించడం బట్టి చూస్తే, ఇక కాంగ్రెస్, డీఎంకేల బంధం మళ్లీ చిగురించినట్టేనని, త్వరలో అధికార పూర్వకంగా వీరి బంధం కలవబోవడం ఖాయం అంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.