సాక్షి, చెన్నై : రాష్ర్టంలో అన్నాడీఎంకే, డీఎంకేల నేతృత్వంలోనే ఇన్నాళ్లు కూటములు ఏర్పాటు అవుతూ వచ్చాయి. రాజకీయ పార్టీలు ఎన్నికలు సమీపిం చే క్షణంలో తమకు అనువుగా ఉండే డీఎంకే లేదా అన్నాడీఎంకే పక్షాన చేరడం జరుగుతూ వచ్చా యి. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పడడం కొత్త మార్గానికి నాంది పలికినట్టు అయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు లబ్ధిచేకూరినా, డీఎంకేకు చావు దెబ్బ తప్పలేదు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డాయి. ప్రజల్ని ఆకర్షించే రీతిలో గ్రామాల బాట, ప్రచార పయనాలకు నేతలు రెడీ అయ్యారు. ఈ పరిస్థితుల్లో లోక్ సభ ఎన్నికల్లో ఆవిర్భవించిన బీజేపీ కూటమి పటా పంచెలు కావడంతో కొత్త ప్రయత్నాల్లో కొన్ని పార్టీలు నిమగ్నం అయ్యాయి.
కొత్త ప్రయత్నం : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు దూరంగా ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, మనిద నేయ మక్కల్ కట్చిలు ఉన్నాయి. ఇక పీఎంకే తన నేతృత్వంలోనే కూటమి అన్నట్టుగా ముందుకు సాగుతూ వస్తున్నది. కాంగ్రెస్, డీఎంకేలు ఎన్నికల సమయంలో ఏకం అయ్యే అవకాశాలు ఉన్నా, వీరితో కలసి వచ్చే పార్టీలు ఏమైనా రాష్ట్రంలో ఉన్నాయా..? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది. డీఎంకే నేతృత్వంలో కూటమి సన్నాహాలు సాగుతున్నా, అందుకు ఆస్కారం ఇవ్వకుండా, కొత్త ప్రయత్నాల్లో కొన్ని పార్టీలు నిమగ్నం అయ్యాయి. ఇందుకు ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సదస్సును వేదికగా చేసుకున్నాయి. అప్పటి నుంచి ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లాలు ఒకే మార్గంలో తమ పయనం సాగిస్తున్నారు.
మద్యంకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని సైతం ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారన్నారు. తమది ప్రత్యేక కూటమి అంటూ, నేతృత్వం అన్నది పక్కన పెట్టి ముందుకు సాగుతున్నామని నేతలు స్పష్టం కూడా చేశారు. అదే సమయంలో తమతో తమిళ మానిల కాంగ్రెస్ నేత వాసన్‌ను కలుపుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వాసన్ ఎవరితో కలవకుండా ముందుకు సాగుతున్నా, ఇటీవల సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరితో భేటీ కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో డీఎండీకే నేత విజయకాంత్‌ను ఆహ్వానించే పనిలో ఈ పార్టీల నేతలు పడ్డట్టున్నారు. విజయకాంత్‌తో సన్నిహితంగా ఉండే సీపీఎం నేత జి రామకృష్ణన్ ఆ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ఉన్నారు.
ఆహ్వానం : డీఎండీకే, సీపీఎం, సీపీఐలు రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి కట్టుగా పోటీ చేసి కొన్ని చోట్ల తమ బలాన్ని చాటుకున్నారు. ఆ దిశగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేతృత్వం అన్నది పక్కన పెట్టి డీఎండీకే, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎంఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు తమకు పట్టున్న చోట్ల అభ్యర్థులను నిలబెట్టి కూటమి పాలన లక్ష్యంగా, అధికారంలో భాగస్వామ్యం ధ్యేయంగా ముందుకు సాగేందుకు వ్యూహ రచన చేసి ఉన్నట్టుగా ఆయా పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్, సీతారం ఏచూరిల మధ్య సంప్రదింపులు సాగి ఉన్న దృష్ట్యా, ఇక, విజయకాంత్‌కు ఆహ్వానం పలికే పనిలో పడ్డారు. ఇందులో భాగం మంగళవారం రాత్రి డీఎండీకే అధినేత విజయకాంత్‌ను విరుగ్గం బాక్కంలోని ఇంట్లో జి రామకృష్ణన్ కలుసుకుని ఉన్నారు. అదే రోజు విజయకాంత్ బర్త్‌డే కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా కొత్త ప్రయత్నాలను ఆయనకు వివరించి, కలసి కట్టుగా పయనం సాగించేందుకు గాను చర్చలు సాగించినట్టుగా సమాచారం. బీజేపీ కూటమి నుంచి తాను బయటకు వచ్చేశానంటూ విజయకాంత్ ప్రకటించిన దృష్ట్యా, ఈ కొత్త ప్రయత్నంలో కలసి పనిచేసే అవకాశాలు ఎక్కువే. ఈ కొత్త ప్రయత్నంలో ముందున్న ఎండీఎంకే నేత వైగోతో కలిసి లోక్ సభ ఎన్నికల్లో విజయకాంత్ పనిచేశారు. ఈ దృష్ట్యా, పార్టీ వర్గాలతో చర్చించి తదుపరి తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఈ కొత్త ప్రయత్నంలో ఏకం అయ్యే పార్టీలను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.
కొత్త ప్రయత్నం
Published Thu, Aug 27 2015 3:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement