► ఆకలి తీర్చని కరెన్సీ
► ఉప ఎన్నికల్లో కార్యకర్తల కష్టాలు
కరెన్సీ చెలామణిలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులు ఉప ఎన్నికల అభ్యర్థులను కష్టాల్లోక నెట్టివేశాయి. చేతి నిండా (పాత కరెన్సీ) డబ్బున్నా కడుపునింపుకునే అవకాశం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రస్తుతం రాష్ట్రం లోని తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగున్రం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీ, డీఎండీకే అభ్యర్థులు రంగంలో నిలవగా, అన్నాడీఎంకే, డీఎంకే ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొం ది. గత ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు డబ్బు, బహుమతులు పంచిపెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. తాజా ఎన్నికల్లో సైతం డబ్బు ప్రభావం ఉండే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈనెల 19వ తేదీన ఈ మూడు నియోజకవర్గాల్లో పోలింగ్
జరుగనుండగా ప్రచార గడువు ఇక వారం రోజుల్లో ముగుస్తుంది.
దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో అన్నాడీఎంకే, డీఎంకేలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అభ్యర్థుల వెంట అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఈ దశలో ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు అకస్మాత్తుగా రద్దు కావడంతో అభ్యర్థులు ఇరకాటంలో పడ్డారు. ప్రచారంలో పాలుపంచుకునే వారికి ఆహారాది సదుపాయాలను కల్పించేందుకు భారీ ఎత్తున నగదును ముందుగానే అప్పగించారు. ఉదయం, సాయంత్రం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనం, ప్రచారం ముగిసిన తరువాత మద్యం ప్రచారంలో పరిపాటిగా మారింది. పార్టీలన్నీ ప్రచారంలో మునిగి ఉండగా వారి వద్దనున్న కరెన్సీ చెల్లని నోటుగా మారడం నేతలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు కాళ్లరిగేలా ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు తమ వద్దనున్న డబ్బుతో కనీసం టిఫిన్ కూడా తినలేక పోతున్నారు.
కార్యకర్తల ఖర్చుకు ప్రతిరోజూ భారీ ఎత్తున డబ్బు అవసరం కావడంతో రద్దయిన నోట్లనే దగ్గర ఉంచుకున్నారు. దీంతో కట్టలు కట్టలు కరెన్సీ ఉన్నా కడుపు నిండా తినే అవకాశం లేదని వాపోతున్నారు. అంతేగాక ప్రచారాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలు తిరుగు ప్రయాణ ఖర్చులు కూడా లేక అల్లాడిపోయారు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు ఈ ఏడాది మేలో డబ్బులను వెదజల్లిన అభ్యర్థులు సైతం ఇరకాటంలో పడిపోయారు. ఓటుకు నోటు ఇవ్వాలంటే వారి వద్ద కొత్త కరెన్సీ లేక పోయింది. ప్రచారం ముగిసిన తరువాతనే ఓటర్లను నోట్లు పంచడం అభ్యర్థులకు అలవాటు. రూ.500, రూ.1000 పాత కరెన్సీ చెల్లదు, పాత నోట్లను చెల్లించి భారీ ఎత్తున కొత్త కరెన్సీ కోసం నేతలు బ్యాంకు వద్ద క్యూ కడితే ఎన్నికల కమిషన్ దృష్టిలో పడుతుంది. దీంతో ఉప ఎన్నికల్లోని అభ్యర్థులు, కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నోట్లు.. నేతల పాట్లు
Published Fri, Nov 11 2016 3:34 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
Advertisement
Advertisement