స్థానిక ఎన్నికల్లో ‘జయ’ కేతనం
రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అత్యధిక స్థానాలను కైవశం చేసుకోవడం ద్వారా అమ్మ హవాకు తిరుగులేదని సోమవారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు చాటాయి. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా పేల్చి, స్వీట్లు పంచిపెట్టి ఆనందాన్ని పంచుకున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి : ఇటీవలే పార్లమెంటు ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నింటి తో (అన్నాడీఎంకే, డీఎంకే మినహా) భారతీయ జనతా పార్టీ బలమైన కూటమిగా మారినా ఒంటరిగా బరిలోకి దిగిన అన్నాడీఎంకే దాటికి తట్టుకోలేక పోయింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్, అన్నాడీఎంకే కంటే సీనియారిటీ కలిగిన డీఎంకే సైతం జయ సాధించిన ఫలితాలతో బిక్కమొహం వేశాయి. అన్నాడీఎంకే అదే జోరును స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో కూడా కొనసాగించింది. ప్రతిపక్షాలు నామినేషన్ వేసేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్, డీఎంకే సహా 9 పార్టీలు ఎన్నికలను బహిష్కరించాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటం ద్వారా ఊపుమీద ఉన్న బీజేపీ అన్నాడీఎంకేతో తలపడగా, బహిష్కరించిన పార్టీలన్నీ తెరవెనుక మద్దతిచ్చాయి.
వామపక్షాలు నామమాత్రంగా ఎన్నికల్లో నిలిచాయి. తిరునెల్వేలీని ఏకగ్రీవంతోనూ, కోయంబత్తూరు, తూత్తుకూడిల్లో ఎన్నికల్లో ఢీకొనడం ద్వారానూ అన్నాడీఎంకే చేజిక్కించుకుంది. కడలూరు, విరుదాచలం, అరక్కోణం, రామనాధపురం మునిసిపాలిటీల్లో అన్నాడీఎంకే గెలుపొందింది. కోవై మేయర్ అభ్యర్థి గణపతి 12,792 ఓట్లు, తూత్తుకూడి మేయర్ అభ్యర్థి అంతోనీగ్రీస్ 84,885 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ తన శక్తిమేరకు అన్నాడీఎంకేకు పోటీనిచ్చినా ఫలితం దక్కలేదు. పొల్లాచ్చి తాలూకా గోమంగళం పుత్తూరు పంచాయతీ 6 వార్డు బీజేపీ అభ్యర్థి సెల్వకుమార్ 660 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కన్యాకుమారి జిల్లాలోని పంచాయితీల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు చెరి 3 స్థానాలను దక్కించుకున్నాయి. తిరునెల్వేలీ జిల్లా పాలై పంచాయతీ 1 వవార్డు స్వతంత్య్ర అభ్యర్థి పాల్‌రాజు 313 ఓట్లతో గెలుపొందారు.
తన ఓటుకూడా వేరేవారికి
ఎలాగూ ఓడిపోతున్నాం, తన ఓటు వృథా కావడం ఎందుకు అనుకున్నాడో ఏమో ఆ అభ్యర్థి, తన ఓటును కూడా వేరే వారికి వేసి చేతులు దులుపుకున్నాడు. ఫలితంగా నామక్కల్ జిల్లా ఏడైవీడు పంచాయతీ వార్డు స్వతంత్ర అభ్యర్థి పళనిస్వామికి సున్నా ఓటే దక్కింది. ఆయన కుటుంబ సభ్యులు సైతం మరో అభ్యర్థికి ఓటు వేయడం విచిత్రం. ఎన్నికల్లో ఒక్క ఓటేకదా అని తీసిపారేయకూడదని నిరూపించాడు ఓ అభ్యర్థి. తిరుచ్చి జిల్లా పుల్లంపాడి పంచాయతీ వార్డు స్వతంత్ర అభ్యర్థి 162 ఓట్లతో గెలుపొందగా అన్నాడీఎంకే అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో (161)ఓడిపోయాడు.