Telugu voters
-
తెలుగు ఓటర్ల ప్రభావమెంత?
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నాలుగో విడత, ఆఖరి దశ పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ముంబైలోని ఆరు స్థానాలతోపాటు 17 స్థానాలకు సోమవారం ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముంబై, థాణేతోపాటు భివండీలో నివసించే తెలుగు ప్రజలు అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేశాయి. తెలుగు రాజకీయ నేతలతో ప్రచారం చేయించాయి. బీజేపీ తరఫున రాపోలు ఆనంద్ భాస్కర్, బాబూ మోహన్, కాంగ్రెస్ తరఫున విజయ శాంతి, నేరెళ్ల శారద తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మహానగరి ముంబైలో.. దక్షిణ ముంబై ఎంపీ స్థానంలోని వర్లీ, కమాటిపురా, కొలాబా, సాత్‌రాస్తా తదితర ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది తెలుగు ఓటర్లున్నారు. దక్షిణమధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలోని ధారావి, వాడాలా, చెంబూర్, సైన్ కొలివాడా తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు సుమారు 45 వేల మంది ఉంటారు. మరోవైపు ఉత్తర ముంబైలోని బోరివలి, దహిసర్, కాందివలి తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఓటర్లుండగా ఉత్తర పశ్చిమ ముంబైలో సుమారు 30 వేల వరకు ఓటర్లుంటారని అంచనా. అదేవిధంగా ఉత్తర తూర్పు ముంబై, ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ములూండ్, విక్రోలి, ఘాట్కోపర్, విలేపార్ల, కుర్లా, బాంద్రా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టిపెట్టారు. భివండీలో మనవాళ్లే కీలకం.! భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. భివండీ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమైన తూర్పు భివండీ, పశ్చిమ భివండీ, పశ్చిమ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో తెలుగు వారున్నారు. ఈ మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 1.50 లక్షల మంది తెలుగు ఓటర్లుంటారు. వీరిలో తెలంగాణ వాసులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. దీంతో భివండీ లోక్‌సభ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములపై తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ధాణేలో కొంతమేర.. థాణే లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. థాణేలోని కిసన్‌నగర్, సిపి తలావ్, హజూరి, కల్వా, లోకమాన్యనగర్, బాల్కుమ్, గాంధీనగర్, సుభాష్‌నగర్, మీరా–భయిందర్, ఐరోలి, బేలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలున్నారు. భివండీలో బాబూమోహన్ ప్రచారం భివండీలోని తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ పేర్కొన్నారు. ముంబైతోపాటు భివండీలో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఇక్కడికి చేరుకున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలుగు భవన్, ముంౖ»ñ వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటుతో పాటు తెలుగు ప్రజల ఇతర సమస్యలపై స్థానిక నేతలతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. -
కర్ణాటకలో తెలుగువాళ్లు మాకే అండగా నిలిచారు!
సాక్షి, విజయవాడ : కర్నాటకలో తెలుగువాళ్లు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ నేత రమేశ్‌నాయుడు తెలిపారు. బెంగళూరు నగరంలోని పద్మనాభ నగర్లో తెలుగువారు అధికంగా ఉంటారని, అక్కడ బీజేపీ అభ్యర్థి అశోశ్ను ఓటర్లు గెలిపించారని తెలిపారు. బీజేవైఎం ఈసీ సభ్యుడిగా ఉన్న రమేశ్ నాయుడు ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మహాదేవపూర్లోనూ బీజేపీ గెలిచిందని, కానీ టీడీపీ నేతలు తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూసిన చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీకి ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టారని, అయినా, మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో వాజపేయి తరహాలో విలువలకు నిలబడి.. యడ్యూరప్ప గౌరవంగా రాజీనామా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా.. నైతిక విలువలను బీజేపీ కట్టుబడిందని అన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం చంద్రబాబు ఇక్కడ నుంచి డబ్బు తరలించారని ఆరోపించారు. అయినా బీజేపీనే గెలిచిందని, నైతిక విజయం తమ పార్టీదేనని చెప్పారు. -
ఏ ప్రాంతంలో ఏ అంశం?
వివిధ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయనున్న అంశాలు.. హైదరాబాద్ కర్ణాటక... తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారి, రాయ్‌చూర్, కొప్పళ్, బీదర్, యాద్గిర్, కలబురిగి (గుల్బర్గా) జిల్లాలు ఈ ప్రాంతం కిందకు వస్తాయి. సామాజిక, ఆర్థిక వెనకబాటుదనంతో పాటు నీటివనరులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలనే నాలుగుదశాబ్దాల డిమాండ్ 2012లో యూపీఏ హయాంలో నెరవేరింది. వ్యవసాయానికి నీటివనరులు, అభివృద్ది, మౌలికసదుపాయాలు, ఉపాధి ఇక్కడి స్థానాల్లోని ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. బాంబే కర్ణాటక... భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మరాఠీ ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ ఓ సంస్థ ఉద్యమం కూడా సాగిస్తోంది. కళసా బండూరి నాలా ప్రాజెక్టు ద్వారా బెళగావి, హుబ్బళ్ళి (హుబ్లీ)–ధార్వాడ్, గదగ్ ప్రాంతాలకు మహదాయీ నది నీటి పంపిణీపై మహారాష్ట్ర, గోవాలతో కర్ణాటకకు వివాదం తలెత్తింది. పాత మైసూరు ప్రాంతం... ఇక్కడ కావేరి జలాల వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. ఇక్కడి రైతుల జీవనోపాధికి, వ్యవసాయానికి ఈ నీరే కీలకం. కొడగు జిల్లా మీదుగా పశ్చిమ కనుమల్లో కాఫీ, నారింజ తోటల పెంపకం పెరగడంతో పర్యావరణ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ ప్రాంతంలో చేపట్టనున్న రైల్వేలైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు సంస్థలు ఉద్యమం నిర్వహిస్తున్నాయి. ఈ అంశాలు ఇక్కడ ఎన్నికల్లో ప్రభావితం చూపనుండగా జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. కోస్తా, మల్నాడు ప్రాంతాలు... దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. గోరక్షక దళాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మోరల్ పోలీసింగ్ హిందుత్వ అనుకూల శక్తుల ప్రమేయంతో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళూరు నగరంలో ఉగ్రవాద జాడలను పోలీసులు కనుక్కున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా హిందు, ముస్లింల మధ్య బాబాబుడన్‌గిరి ప్రార్థనా స్థలంపై వివాదం సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. ఇవేకాక ప్రముఖ హేతువాది, చరిత్రకారుడు ఎంఎం కలబురిగీ, విలేకరి గౌరీ లంకేష్‌ల హత్యలు కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శిరహట్టిలో గెలిస్తే..! బాంబే కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న ఓ నియోజవర్గం శిరహట్టి. 1972 నుంచి 2013 వరకు జరిగిన అన్ని విధానసభ ఎన్నికల్లోనూ ఈ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం. స్వతంత్ర అభ్యర్థి గెలిచినప్పటికీ, ఆ అభ్యర్థి ఓ పార్టీలో చేరిన తర్వాతనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు న్నాయి. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది ఓటర్లుంటారు. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వదిరాజ్ ఆచార్య గెలిచారు. 1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్ కొనసాగించి అధికారంలో ఉంది. 1983లో నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతిచ్చారు. ఆ తర్వాతే రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎం అయ్యారు. ఆ తర్వాతా ఈ స్థానంలో గెలిచిన పార్టీనే ఎప్పుడూ అధికారంలోకి వచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తెలుగు ఓటరు ఎటువైపు...?
ఓ వైపు పెద్ద ఎత్తున హంగ్ అసెంబ్లీ ఊహాగానాలు...జోస్యాలు... మరోవైపు అధికారపీఠం తమదేనంటూ ప్రధాన పక్షాలు కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) అధినేతల ప్రకటనలు...మరో నాలుగు రోజుల్లో పోలింగ్... ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర సామాజికవర్గాలు, ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం అక్కడ నెలకొన్న సంక్షిష్టమైన వాతావరణంలో గణనీయ సంఖ్యలో ఉన్న తెలుగు ఓటర్లు కూడా ముఖ్య భూమిక పోషించనున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేవలం ఒకటి లేదా రెండు శాతం ఓట్లే అభ్యర్థుల గెలుపోటములు నిర్దేశించనున్నాయి. కర్ణాటకలోని 15 శాతం వరకు జనాభా తెలుగు మాట్లాడేవారున్నారు. కన్నడ, ఉర్ధూల తర్వాత అత్యధికులు మాట్లాడేది తెలుగే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 40-50 స్థానాల్లో తెలుగు వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి. 12 జిల్లాల్లో ప్రభావం... కర్ణాటకలోని 12 జిల్లాల్లో... తుమ్కూరు, చిత్రదుర్గ, బీదర్, బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్, బళ్లారి, కొప్పల్, రాయచూర్, కలబురిగీ, యద్గిర్, కోలార్, చిక్‌బళ్లాపూర్‌లలో తెలుగువారు అధికసంఖ్యలో ఉన్నారు. బీదర్, కలబురిగీ, కోలార్, బళ్లారిలలో నైతే దాదాపు 30 శాతం తెలుగు ఓటర్లే. బెంగళూరు రూరల్లోనైతే 65 శాతం, అర్భన్‌లో 49 శాతం తెలుగు మాట్లాడే వారే. కోలార్‌లో 76 శాతం, రాయచూర్‌లో 64 శాతం, బళ్లారిలో 63 శాతం ఉన్నారు. బెంగళూరులోని 28 సీట్లలో... రాష్ట్ర రాజధాని «బెంగళూరులోని 28 సీట్లలో దాదాపు 25 లక్షల మంది తెలుగు ఓటర్లున్నారు. పలువురు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు, అక్కడ పనిచేసే వారితో పాటు సాఫ్ట్వేర్రంగ నిపుణులు ఎంతో మంది అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సంబంధ బాంధవ్యాలు, ఇక్కడి రాజకీయ పరిణామాల ప్రభావం అక్కడి తెలుగు ఓటర్లపై పడే అవకాశాలు తక్కువే. 2013 నాటి ఫలితాలనే ఓసారి పరిశీలిస్తే...49 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజారిటీతోనే విజయం సొంతమైంది. అదే 2008లోనైతే 64 సీట్లు ఈ విధంగా గెలిచినవే. ఏ పార్టీ వైపు మొగ్గు లేని ప్రస్తుత ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం 224 నియోజకవర్గాల్లో 65-70 చోట్ల నువ్వా, నేనా అన్నట్టుగా గట్టి పోటీ నెలకొంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాల్లోని తెలుగు ఓటర్లకు ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక అంశాలు, సమస్యలు, అక్కడున్న ట్రెండ్‌కు అనుగుణంగానే వారు వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘కర్ణాటకలో తెలుగు ఓట్లు మావే’
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకుగానూ కర్ణాటక ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావులు స్పందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకే పడుతాయని మధుయాష్కీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి తీరుతుందని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తారన్నారు. 2019లో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరగనున్న ఎన్నికలపై కర్ణాటక ఫలితాలు ప్రభావం చూపుతాయని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకమని పేర్కొన్నారు. 'కర్ణాటక రాష్ట్ర జనాభా దాదాపు ఆరు కోట్లు, వీరిలో తెలుగు ప్రజలు కోటికి పైగా ఉన్నారు. తెలుగువారి ఓట్లు మా పార్టీకి కలిసొచ్చే అంశం, వారు కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని' పేర్కొన్నారు. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ విధానాల చాలా నష్టపోయారు: మురళీధర్ రావు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఎన్నికలపై స్పందిస్తూ... కర్ణాటకలో తెలుగు ప్రజలు బీజేపీపై నమ్ముతారని, వారి ఓట్లు తమ పార్టీకే వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ కన్నడ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయింది. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను పూర్తిగా విస్మరించారు. కాంగ్రెస్ విధానాల వల్ల కన్నడ ప్రజలు చాలా నష్టపోయారు. వారి చర్యల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది’ అని వివరించారు. -
కర్నాటక ఎన్నికలపై తెలుగు ఓటర్ల ప్రభావం
-
తెలుగువారి దీవెనలే గెలుపుబాట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కన్నడేతరుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. కర్ణాటకలో తెలుగువారితో పాటు తమిళులు, మలయాళీలు అధిక సంఖ్యలో నివాసముంటున్నారు. బెంగళూరు మహానగరంతోపాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కన్నడేతరులు అధికంగా ఉన్నారు. దీంతో ఆయా భాషలు మాట్లాడే ప్రజల ఓట్లు కీలకమని రాజకీయ పార్టీలు భావించి వారిని ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక తెలుగువారి విషయానికొస్తే రియల్ ఎస్టేట్, విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బెంగళూరుతో మన వారికి తరతరాల నుంచీ విడదీయలేని బంధముంది. లక్షలాది మంది తెలుగువారు బెంగళూరు వ్యాప్తంగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం నగర పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 నుంచి 10 స్థానాల్లో తెలుగువారు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. హెబ్బాళ, కేఆర్ పురం, బొమ్మనహళ్లి, మహదేవపుర, బీటీఎం లేఔట్, అనేకల్, యలహంక, జయనగర, హొసకోటే, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల సంఖ్య అధికం. అలాగే ప్రస్తుత శాసనసభ్యుల్లో దాదాపు 10 శాతం మంది తెలుగు మాట్లాడేవారు ఉండడం గమనార్హం. కర్ణాటకతో సరిహద్దు బంధం కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దులున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు, వ్యాపార, ఉద్యోగ అవకాశాల దృష్ట్యా చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కర్ణాటకకు తరలివచ్చారు. బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు, చిక్కబళ్లాపుర, మైసూరు, కొప్పళ, చిత్రదుర్గ, దావణగెరె, యాదగిరి, హుబ్లీ–ధార్వాడ తదితర ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం దాదాపు కోటి మందికిపైగా తెలుగు మాట్లాడే ప్రజలు రాష్ట్రంలో ఉంటున్నారు. ఎప్పటినుంచో స్థిరపడిపోయిన తెలుగువారు ఇక్కడే తమ అనుబంధాలను ఏర్పరచుకున్నారు. రాష్ట్రంలో కన్నడ తరువాత ఇతర భాషలు మాట్లాడే వారిలో ఉర్దూ తొలిస్థానంలో ఉండగా ఆ తర్వాత తెలుగు నిలిచింది. అక్కడి జనాభాలో ఉర్దూ మాట్లాడేవారు 9 శాతం కాగా, తెలుగు ప్రజలు 8.17 శాతం ఉన్నారు. బళ్లారి, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో దగ్గుబాటి పురంధేశ్వరి వంటి తెలుగు నేతలతో బీజేపీ ప్రచారం చేయిస్తోంది. బెంగళూరులోనూ అలనాటి నటుడు కృష్ణంరాజు ఇప్పటికే ఒక విడత ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్‌కు కేసీఆర్, పవన్, కాంగ్రెస్‌కు చిరు గణనీయ సంఖ్యలో ఉన్న తెలుగు వారి ఓట్లను దక్కించుకునేందుకు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాల పరంగా కాంగ్రెస్, బీజేపీలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం ఇక్కడ జేడీఎస్ అధినేత దేవెగౌడతో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతివ్వాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు వారిని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని రంగంలోకి దింపనుంది. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జేడీఎస్ తరఫున ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలంటున్నారు. పవన్‌కు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామితో మంచి సంబంధాలు ఉన్నాయి. ‘యోగి అడుగుపెడితే చెప్పులతో కొట్టండి’ బెంగళూరు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై కర్ణాటక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ దినేశ్ గుండూరావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగి ఎప్పుడు రాష్ట్రంలో అడుగుపెట్టినా చెప్పులతో కొట్టా లని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్మూ కశ్మీర్లో కఠువా, యూపీలో ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కర్ణాటక పీసీసీ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన నిజంగా యోగి కాదు. గూండా, అబద్ధాల కోరు, ఇక్కడికి వస్తే ప్రజలు చెప్పులతో కొట్టి వెనక్కుపంపాలి’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. -
తెలుగోడి సత్తా ఎంత?
♦ తమిళ బరిలో తెలుగు ఓటర్ల కరుణ కోసం పార్టీల ఎత్తులు ♦ పలువురు తెలుగు అభ్యర్థులను బరిలోకి దించిన డీంఎంకే, అన్నాడీఎంకే సాక్షి, చెన్నై: తమిళనాట ఏ రంగమైనా తెలుగువారి ముద్ర కచ్చితంగా ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంగా కలిసున్నప్పటి నుంచి ఇప్పటివరకూ రాజకీయాలతో పాటు కళలు, వాణిజ్యం ఇలా అన్నింట తెలుగు ప్రజలు తళుక్కుమంటూనే ఉన్నారు. ఇక ఎన్నికలొస్తే మన వారి సందడి అంతా ఇంతా కాదు. తెలుగును అణగదొక్కే ప్రయత్నాలు సాగినా, ఎన్నికల్లో తెలుగు ఓటరు ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పక్షాలు మాత్రం కుస్తీలు పడతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇక తెలుగువారు ఎక్కువ గా ఉన్న చోట వారినే అభ్యర్థులుగా ప్రకటించాయి ప్రధాన పార్టీలు. తమిళ రాజకీయాల్లో తెలుగు వారి ఆధిపత్యం మొదటి నుంచి కొనసాగుతోంది. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి నుంచి డీఎండీకే నేత విజయ్‌కాంత్ వరకు తమిళ రాజకీయాల్లో మన వాళ్లు చక్రం తిప్పుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పూర్వీకులు తమిళనాడులో స్థిరపడిన తెలుగువారే. ఆ పార్టీలోని ఆర్కాడు వీరాస్వామి, కేఎన్ నెహ్రూలు, కాంగ్రెస్‌కు చెందిన కృష్ణస్వామి, చిరంజీవి, గోపీనాథ్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోలు కూడా మనవాళ్లే. చెన్నైలోని 7 స్థానాల్లో మనవాళ్లే కీలకం.. చెన్నైలో తెలుగు సంతతి ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. నగరంలోని రాయపురం, తిరువొత్తియూరు, పెరంబూరు, కొళత్తూరు, విల్లివాక్కం, హార్బర్, అన్నానగర్, ఆర్కేనగర్ స్థానాల్లో వీరు అధికం. వారిని ఆకర్షించేందుకు తెలుగువారైన శేఖర్‌బాబు(హార్బర్), రంగనాథన్ (విల్లివాక్కం), మోహన్ (అన్నానగర్)లను డీఎంకే బరిలో నిలిపింది. ఆవడి, తాంబరం, పల్లావరంలోనూ తెలుగు ఓటర్లు అధికమే. పల్లావరం అభ్యర్థిగా తెలుగువారైన నటి సీఆర్ సరస్వతిని అన్నాడీఎంకే పోటీకి పెట్టింది. సరిహద్దు జిల్లాలోను మన రాజకీయమే ఏపీ సరిహద్దుల్లోని తిరువళ్లూరు, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోను మనవాళ్ల ప్రభావం ఎక్కువే. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, తిరుత్తణి, కృష్ణగిరి జిల్లా హొసూరు, తలి, వేపనహల్లి, ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిల్లో తెలుగు ఓటరే కీలకం. గుమ్మిడిపూండిలో తెలుగువాడైన శేఖర్ డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి తెలుగు నేత మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ రేసులో ఉన్నారు. తిరుత్తణి నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు, ప్రజా సంక్షేమ కూటమి నుంచి డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తినాయుడు బరిలో ఉన్నారు. హోసూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపీనాథ్ తమిళ అసెంబ్లీలో తెలుగు వాణి విన్పిస్తున్నారు. ఆర్కేనగర్లో సీఎం జయలలితను తమిళనాడు తెలుగు యువశక్తి చీఫ్ జగదీశ్వరరెడ్డి ఢీకొంటున్నారు. జయ, కరుణలకు ఈసీ నోటీసులు ఈ నెల16న ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ప్రచారం శనివారంతో ముగిసింది. తమిళనాడులోని అరవకురిచి స్థానంలో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టారన్న ఆరోపణలతో ఈసీ ఎన్నికను ఈ నెల 23కు వాయిదా వేసింది. పార్టీల మేనిఫెస్టోలు ఈసీ నిబంధనల మేరకు లేవని అన్నాడీఎంకే అధినేత్రి జయ, డీఎంకే చీఫ్ కరుణానిధికి ఈసీ నోటీసులు జారీచేసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణివ్వాలని పేర్కొంది. -
తెలుగు ఓటరే కీలకం
తిరువళ్లూరు: చెన్నైకు సమీపంలోని జిల్లా తిరువళ్లూరు. పదేల్ల నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా 1996వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కాంచీపురం జిల్లాలో ఉన్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, తిరుత్తణి, పూందమల్లి, తిరువొత్తియూర్, పొన్నేరి, మధురవాయల్, మాధవరం, అంబత్తూరు, ఆవడి పది అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు. 2011లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అయితే తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మిడిపూండి నియోజకవర్గంలో మెజారిటీ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు ఎటువైపు మొగ్గితే అటువైపే విజయం దక్కే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులందరూ తెలుగు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తిరువళ్లూరులో పోటాపోటీ: జిల్లా కేంద్రమైన తిరువళ్లూరులో వ్యవసాయం, చేపల పెంపకం, చేనేత రంగాలపై ఆధారపడి జీవించే వారు అధికం. ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వీరరాఘవుని ఆలయం, తొమ్మిది మూలలు ఉండే పుష్కరిణి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైన అభిప్రాయం ఉంది. 1957లో ఏర్పాటైన తిరువళ్లూరు నియోజకవర్గంలో 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఏకాంబరం మొదలియార్, అరుణాచలం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 13 సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు డీఎంకే, ఐదు సార్లు అన్నాడీఎంకే, రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి తమిళమానిల కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో 2.35 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎస్సీలు, వన్నియర్లు, మొదలియార్ ఓటర్లు అధికశాతంలో ఉండగా పూండి, తిరువళ్లూరు టౌన్, రామంజేరి, కనకమ్మసత్రం తదితర 20 గ్రామాల్లో తెలుగు ఓటర్లు అధికంగా వున్నారు. వీరు ఎటు వైపు మొగ్గితే అటు వైపు విజయం సాధించే అవకాశాలు ఉండడంతో తెలుగులోనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున భాస్కరన్, డీఎంకే తరఫున వీజీ రాజేంద్రన్, పీఎంకే తరఫున బాలయోగి, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా బాలసింగం, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసన్ సహ 21 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అన్నాడీఎంకే తరఫున ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడంతో పాటు ప్రజల్లో నేరుగా వెళ్లికలుస్తున్నారు. అక్కడక్కడ తెలుగులోనే ప్రసంగిస్తూ తెలుగు వారిని ఆకట్టుకుంటున్నాడు. తెలుగు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నా అంతర్గత కుమ్ములాట, ఎవ్వరిని లెక్కచేయడన్న ప్రచారం, వరద సాయం అందరికి అందడం లేదన్న విమర్శలు, ప్రభుత్వంపై వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దీంతో పాటు నియోజకవర్గంలో బలమైన నేతగా వున్న తెలుగు ప్రముఖుడు రమణ సైతం సహాయ నిరాకరణ భాస్కరన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రమణ రంగంలోకి దిగి చక్రం తిప్పితే అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకే కావచ్చు. డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ తిరువళ్లూరులో ప్రముఖ విద్యాసంస్థలను నడుపుతున్నాడు. విద్యావేత్తగా అందరికి సుపరిచితుడే అయినా స్థానిక నేతలను లెక్క చేయడన్న విమర్శలు ఎక్కువగానే ఉంది. దీంతో పాటు డీఎంకేలో ఉన్న కుమ్ములాటలు ఎక్కడ కొంప ముంచుతుందోన్న ఆందోళన వీజీఆర్లో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇటీవల స్టాలిన్ లాంటి స్టార్ల ప్రచారంతో నెట్టుకురావచ్చన్న ధీమాతో వున్న రాజేంద్రన్ తన భార్య ఇందిరా తెలుగు మహిళ కావడంతో వారి ఓట్లను సాధించడానికి ప్రత్యేకంగా వ్యూహరచన చేసి ఆకట్టుకుంటున్నారు. గతంలో అన్నాడీఎంకేకు అండగా నిలిచిన తెలుగు ఓటర్లు ఇందిరకు సహకరిస్తే వీజీఆర్‌కు సానుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలయోగి వన్నియర్ ఓట్లపైనే ఆధారపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గంలో తెలుగు ఓటరే కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. గుమ్మిడిపూండిలో సిట్టింగ్ గెలిచేనా : తెలుగు ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో గుమ్మిడిపూండి ప్రధానమైనది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా గుమ్మిడిపూండి వుంది. ఇక్కడ ఇసుక క్వారీపై నిరసన, తాగునీటి ఎద్దడి, విద్యుత్ సమస్యతో మూత పడిన పరిశ్రమలతో వేలాది మంది నిరుద్యోగులుగా మారడం లాంటి సమస్యలు వున్నాయి. చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన వృత్తి. 1957వ సంవత్సరంలో ఏర్పాటైన గుమ్మిడిపూండి నియోజవర్గంలో ఇప్పటి వరకు అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఏడు సార్లు, డీఎంకే నాలుగుసార్లు, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు తలోసారి విజయం సాధించారు. 2011వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి డీండీకే అభ్యర్థి సీహెచ్ శేఖర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, డీఎంకే కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్, పీఎంకే అభ్యర్థిగా సెల్వరాజ్, బీజేపీ అభ్యర్థిగా భాస్కరన్, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా గీత పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో తెలుగు ఓటర్లు వుండగా, గతంలో తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్‌కు మద్దతు పలకడంతో భారీ విజయాన్ని సాధించారు. అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సీహెచ్ శేఖర్ ప్రస్తుతం తెలుగు ఓటర్లపైనే భారీ ఆశలు ఉంచుకున్నా, అన్నాడీఎంకే అభ్యర్థి విజయకుమార్, బీజేపీ అభ్యర్థి భాస్కరన్ తెలుగు వాడే కావడంతో తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. డీఎంకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై వ్యతిరేకత, యువతలో వున్న ఫాలోయింగ్ ప్లస్‌గా మారుతుంది. అయితే శేఖర్ ఎవ్వరి మాటలను వినడన్న విమర్శలు, డీఎంకేలో సీటు ఆశించి భంగపడ్డ వేణు, టీజేఎస్ గోవిందరాజన్ లాంటి సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడం, సొంత నిర్ణయాలతో సీనియర్లను గౌరవించడన్న విమర్శలు మైనస్‌గా మారుతున్నాయి. అయితే శేఖర్ భార్య మయూరి చేస్తున్న ఇంటింటి ప్రచారం, తెలుగింటి ఆడపడుచును ఆదరించాలని విన్నూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. అన్నాడీఎంకే కోటగా చెప్పబడే గుమ్మిడిపూండిలో పార్టీకి మంచి పట్టుంది. విజయకుమార్ మృదుస్వభావి, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉండడంతో పాటు అనవసర విషయాల్లో తలదూర్చే వ్యక్తి కాదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడం ప్లస్. దీంతో పాటు తెలుగు సంఘాలతో విజయకుమార్‌కు వున్న వ్యక్తిగత పరిచయం. తెలుగు ప్రముఖులు జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, రాజమాణిక్యం, గోపాల్‌నాయుడు లాంటి తెలుగు వ్యక్తులు అండదండలు పుష్కలంగా ఉండడంతో విజయకుమార్ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాస్కరన్ సైతం తెలుగు ఓటర్లను నమ్ముకున్నారు. పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొత్తానికి తిరువళ్లూరు, గుమ్మడిపూండిలో తెలుగు ఓటర్లు కీలకం. వారు ఎటువైపు మొగ్గితే వారే గెలిచే అవకాశం ఉండడడంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తెలుగు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
ఏకమయ్యే సమయమిదే!
సాక్షి, ముంబై: ముంబై, భివండీలతోపాటు తెలుగు ఓటర్లు గెలుపోటములను శాసించే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఓట్లు చీలిపోతుండడంతో ప్రతి ఎన్నికల్లోనూ తెలుగువారి ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయనే అభిప్రాయాలను అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే తెలుగువారు ఐక్యంగా నిలబడి, ఒకే అభ్యర్థికి ఓటువేసేలా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే గెలుపోటములను శాసించే స్థాయికి చేరడం ఏమంత కష్టం కాదని రాజకీయ పార్టీలే అంగీకరిస్తున్నాయి. ఇది సాధ్యం కావాలంటే తెలుగు సంఘాలన్నీ ముందు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముంది. నిజానికి ఎన్నికలకు ముందే తమ ప్రతినిధిగా ఒకరిని నిలబెట్టి, అసెంబ్లీకి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అసెంబ్లీ తెలుగు అభ్యర్థుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. అయితే ఇప్పుడు అందుకు సమయం దాటిపోయింది. ఇప్పుడు తెలుగువారి చేతుల్లో ఉన్నదల్లా ఐక్యంగా నిలబడి, తెలుగువారి సంక్షేమానికి కృషి చేస్తాడని నమ్మే అభ్యర్థిని గెలిపించడమే. బరిలో ఉన్న కొంతమంది తెలుగువారికైనా మద్దతుగా నిలవడమే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న తెలుగువారి వివరాలు ఇలా ఉన్నాయి... మహాసంగ్రామంలో మనోళ్లు 15 మంది.. సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా భివండీ మినహా ముంబై, పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్, మరాఠ్వాడా జాల్నా, విదర్భ చంద్రాపూర్, యావత్మాల్ తదితర జిల్లాల్లో 15 మంది తెలుగు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా షోలాపూర్‌లో రెండు స్థానాలకుగాను ఐదుగురు, యావత్మాల్ జిల్లాలో నలుగురు, చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరు, నాందేడ్ జిల్లాలో ఇద్దరు, ముంబై, జాల్నాలలో ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కైలాస్ గోరింట్యాల్, వామన్రావ్ కాసంవార్, సుధీర్ మునగంటివార్లు మళ్లీ బరిలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఆడెం నర్సయ్య మరోసారి బరిలోకి దిగారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో తెలుగు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. షోలాపూర్‌లో ముగ్గురు హోరాహోరీ.. పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. జిల్లా కేంద్రమైన షోలాపూర్ పట్టణంలో సుమారు 70 శాతం మంది తెలుగువారే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఆడెం నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అత్యంత సన్నిహితులైన విష్ణుకోటే కుమారుడైన మహేష్ కోటే బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లుగా మరో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆడెం నర్సయ్య, మహేష్ కోటేలతోపాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండేల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. వీరికి ఎన్సీపీ అభ్యర్థి విద్యా లోల్గే, బీజేపీ అభ్యర్థి మోహినీ పట్కి, ఎంఐఎం అభ్యర్థి షేఖ్ తౌఫిక్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విదర్భలో... విదర్భలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కరీంనగర్, అదిలాబాద్లతోపాటు ఇతర జిల్లాలకు చెందిన తెలుగు ప్రజలున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదిగిన మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సుధీర్ మునగంటివార్ బల్లార్షా నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన సుధీర్ మునగంటివార్ బల్లార్షాలో మరోసారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రచారం చేశారు. మరోవైపు చంద్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున కిషోర్ జోరగేవార్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు ఇక్కడ పలువురి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక విదర్భలోని వనీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వామన్రావ్ కాసావార్ మళ్లీ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా తెలుగు వ్యక్తి అయిన బోద్కువార్ సంజీవరెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ తెలుగువారి మధ్య హోరాహోరి పోరు సాగడం ఖాయమంటున్నారు. మరోవైపు యావత్మల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి తెలుగు అభ్యర్థులు మదన్ యేర్వార్, పీడబ్ల్యూపీ నుంచి దిలీప్ ముక్కావార్లు పోటీ పడుతున్నారు. మరాఠ్వాడాలో... నిజాంపరిపాలనలో తెలంగాణతో కలిసి ఉండే మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలను ఆనుకొని ఉన్న నాందేడ్‌లో భారీ సంఖ్యలో తెలుగువారున్నారు. దీంతో సౌత్ నాందేడ్ నుంచి తెలుగు వ్యక్తి దిలీప్ కందుకుర్తి బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండగా ఎమ్మెన్నెస్ ప్రకాశ్ మారావార్ను బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ కూడా తెలుగువారి మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు జాల్నాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాస్ గోరింట్యాల్ మళ్లీ బరిలోకి దిగారు. మరాఠ్వాడాలోనే తెలుగు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గెలుపు నల్లేరుమీద నడకేనంటున్నారు విశ్లేషకులు. ముంబై, భివండీలలో... ముంబైతోపాటు తెలుగువారు అధికంగా ఉండే భివండీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎవరూ ఎదగలేకపోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా వెనుబడే ఉన్నామనే చెప్పాలి. ముంబైలో ఈసారి మహీం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నాగ్‌సేన్ మాల బరిలో ఉన్నారు. ఇక భివండీలో ఒక్క తెలుగు అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. -
షోలాపూర్ బరి తెలుగువారి ఓట్లే కీలకం
షోలాపూర్, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా పలు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా వ్యవహరించనుండగా, మరికొన్నిచోట్ల తమదైన ముద్రనువేసుకోనున్నారు. షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం తెలుగువారి అధీనంలోనే ఉండేది. ఇక్కడ నివసించేవారిలో సుమారు 50 శాతం మంది తెలుగు ప్రజలే. ఈ నియోజక వర్గంలో మొత్తం ఆరు సెగ్మెంట్లున్నాయి. షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ నార్త్, షోలాపూర్ సౌత్ సెగ్మెంట్లలో మెజారిటీ ఓటర్లు తెలుగు ప్రజలే. దీంతో ఇక్కడ తెలుగువారి ఓట్లే కీలకంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగువారైన గంగాధర్ కూచన్, ధర్మన్న సాదుల్, లింగరాజు వల్యాల్‌లు ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. దీంతో సుమారు 25 సంవత్సరాలపాటు తెలుగు వారే ఎంపీలుగా గెలుపొందారు. అయితే గత ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో ఈ నియోజకవర్గం ఎస్సీ కోటాలోకి వెళ్లింది. ఇలా జరగడం తెలుగువారు ప్రాతినిధ్యం వహించే అవకాశానికి గండికొట్టింది.మరోవైపు తెలుగువారిలో ఐక్యత లోపించడంతో అది ఇతరులకు అవకాశం దక్కేలాచేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఓటర్ల మనోభావాలను ‘సాక్షి’ తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఉత్తర షోలాపూర్ శాసనసభా నియోజకవర్గంలో నివసిస్తున్న తెలుగువారి సమస్యలను తెలుసుకునేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించింది. ఎన్నికల నేపథ్యంలో వారు ఏమి కోరుకుంటున్నారు..? ఎలాంటి సమస్యలున్నాయి? తదితరాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. -
సాక్షి టీవీతో అబిప్రాయాలు పంచుకున్న ఢిల్లీ తెలుగు ఓటర్లు