తెలుగు ఓటరే కీలకం
తిరువళ్లూరు: చెన్నైకు సమీపంలోని జిల్లా తిరువళ్లూరు. పదేల్ల నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా 1996వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు కాంచీపురం జిల్లాలో ఉన్న తిరువళ్లూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, తిరుత్తణి, పూందమల్లి, తిరువొత్తియూర్, పొన్నేరి, మధురవాయల్, మాధవరం, అంబత్తూరు, ఆవడి పది అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పాటు చేశారు.
2011లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అయితే తిరుత్తణి, తిరువళ్లూరు, గుమ్మిడిపూండి నియోజకవర్గంలో మెజారిటీ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజలు ఎటువైపు మొగ్గితే అటువైపే విజయం దక్కే అవకాశాలు ఉండడంతో అభ్యర్థులందరూ తెలుగు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. తిరువళ్లూరులో పోటాపోటీ: జిల్లా కేంద్రమైన తిరువళ్లూరులో వ్యవసాయం, చేపల పెంపకం, చేనేత రంగాలపై ఆధారపడి జీవించే వారు అధికం.
ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వీరరాఘవుని ఆలయం, తొమ్మిది మూలలు ఉండే పుష్కరిణి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైన అభిప్రాయం ఉంది. 1957లో ఏర్పాటైన తిరువళ్లూరు నియోజకవర్గంలో 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఏకాంబరం మొదలియార్, అరుణాచలం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 13 సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు డీఎంకే, ఐదు సార్లు అన్నాడీఎంకే, రెండు సార్లు కాంగ్రెస్, ఒక సారి తమిళమానిల కాంగ్రెస్ పార్టీలు విజయం సాధించాయి.
ఈ నియోజకవర్గంలో 2.35 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎస్సీలు, వన్నియర్‌లు, మొదలియార్ ఓటర్లు అధికశాతంలో ఉండగా పూండి, తిరువళ్లూరు టౌన్, రామంజేరి, కనకమ్మసత్రం తదితర 20 గ్రామాల్లో తెలుగు ఓటర్లు అధికంగా వున్నారు. వీరు ఎటు వైపు మొగ్గితే అటు వైపు విజయం సాధించే అవకాశాలు ఉండడంతో తెలుగులోనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అన్నాడీఎంకే తరఫున భాస్కరన్, డీఎంకే తరఫున వీజీ రాజేంద్రన్, పీఎంకే తరఫున బాలయోగి, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా బాలసింగం, బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాసన్ సహ 21 మంది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది.
అన్నాడీఎంకే తరఫున ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడంతో పాటు ప్రజల్లో నేరుగా వెళ్లికలుస్తున్నారు. అక్కడక్కడ తెలుగులోనే ప్రసంగిస్తూ తెలుగు వారిని ఆకట్టుకుంటున్నాడు. తెలుగు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నా అంతర్గత కుమ్ములాట, ఎవ్వరిని లెక్కచేయడన్న ప్రచారం, వరద సాయం అందరికి అందడం లేదన్న విమర్శలు, ప్రభుత్వంపై వ్యతిరేకత మైనస్‌గా మారే అవకాశం ఉంది. దీంతో పాటు నియోజకవర్గంలో బలమైన నేతగా వున్న తెలుగు ప్రముఖుడు రమణ సైతం సహాయ నిరాకరణ భాస్కరన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
రమణ రంగంలోకి దిగి చక్రం తిప్పితే అన్నాడీఎంకే గెలుపు నల్లేరుపై నడకే కావచ్చు. డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీజీ రాజేంద్రన్ తిరువళ్లూరులో ప్రముఖ విద్యాసంస్థలను నడుపుతున్నాడు. విద్యావేత్తగా అందరికి సుపరిచితుడే అయినా స్థానిక నేతలను లెక్క చేయడన్న విమర్శలు ఎక్కువగానే ఉంది. దీంతో పాటు డీఎంకేలో ఉన్న కుమ్ములాటలు ఎక్కడ కొంప ముంచుతుందోన్న ఆందోళన వీజీఆర్‌లో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇటీవల స్టాలిన్ లాంటి స్టార్‌ల ప్రచారంతో నెట్టుకురావచ్చన్న ధీమాతో వున్న రాజేంద్రన్ తన భార్య ఇందిరా తెలుగు మహిళ కావడంతో వారి ఓట్లను సాధించడానికి ప్రత్యేకంగా వ్యూహరచన చేసి ఆకట్టుకుంటున్నారు.
గతంలో అన్నాడీఎంకేకు అండగా నిలిచిన తెలుగు ఓటర్లు ఇందిరకు సహకరిస్తే వీజీఆర్‌కు సానుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలయోగి వన్నియర్ ఓట్లపైనే ఆధారపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి తిరువళ్లూరు నియోజకవర్గంలో తెలుగు ఓటరే కీలకం కావడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి.
గుమ్మిడిపూండిలో సిట్టింగ్ గెలిచేనా : తెలుగు ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో గుమ్మిడిపూండి ప్రధానమైనది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లాకు సరిహద్దు ప్రాంతంగా గుమ్మిడిపూండి వుంది.
ఇక్కడ ఇసుక క్వారీపై నిరసన, తాగునీటి ఎద్దడి, విద్యుత్ సమస్యతో మూత పడిన పరిశ్రమలతో వేలాది మంది నిరుద్యోగులుగా మారడం లాంటి సమస్యలు వున్నాయి. చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన వృత్తి. 1957వ సంవత్సరంలో ఏర్పాటైన గుమ్మిడిపూండి నియోజవర్గంలో ఇప్పటి వరకు అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులు ఏడు సార్లు, డీఎంకే నాలుగుసార్లు, కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు తలోసారి విజయం సాధించారు. 2011వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి డీండీకే అభ్యర్థి సీహెచ్ శేఖర్ విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, డీఎంకే కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్, పీఎంకే అభ్యర్థిగా సెల్వరాజ్, బీజేపీ అభ్యర్థిగా భాస్కరన్, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థిగా గీత పోటీ చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో తెలుగు ఓటర్లు వుండగా, గతంలో తెలుగు సంఘాలు, తెలుగు ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్‌కు మద్దతు పలకడంతో భారీ విజయాన్ని సాధించారు. అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్న సీహెచ్ శేఖర్ ప్రస్తుతం తెలుగు ఓటర్లపైనే భారీ ఆశలు ఉంచుకున్నా, అన్నాడీఎంకే అభ్యర్థి విజయకుమార్, బీజేపీ అభ్యర్థి భాస్కరన్ తెలుగు వాడే కావడంతో తెలుగు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.
డీఎంకే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శేఖర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై వ్యతిరేకత, యువతలో వున్న ఫాలోయింగ్ ప్లస్‌గా మారుతుంది. అయితే శేఖర్ ఎవ్వరి మాటలను వినడన్న విమర్శలు, డీఎంకేలో సీటు ఆశించి భంగపడ్డ వేణు, టీజేఎస్ గోవిందరాజన్ లాంటి సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడం, సొంత నిర్ణయాలతో సీనియర్‌లను గౌరవించడన్న విమర్శలు మైనస్‌గా మారుతున్నాయి. అయితే శేఖర్ భార్య మయూరి చేస్తున్న ఇంటింటి ప్రచారం, తెలుగింటి ఆడపడుచును ఆదరించాలని విన్నూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.
అన్నాడీఎంకే కోటగా చెప్పబడే గుమ్మిడిపూండిలో పార్టీకి మంచి పట్టుంది. విజయకుమార్ మృదుస్వభావి, నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉండడంతో పాటు అనవసర విషయాల్లో తలదూర్చే వ్యక్తి కాదన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడం ప్లస్. దీంతో పాటు తెలుగు సంఘాలతో విజయకుమార్‌కు వున్న వ్యక్తిగత పరిచయం. తెలుగు ప్రముఖులు జెడ్పీ చైర్మన్ రవిచంద్రన్, రాజమాణిక్యం, గోపాల్‌నాయుడు లాంటి తెలుగు వ్యక్తులు అండదండలు పుష్కలంగా ఉండడంతో విజయకుమార్ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాస్కరన్ సైతం తెలుగు ఓటర్లను నమ్ముకున్నారు. పీఎంకే, ప్రజాసంక్షేమ కూటమి అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మొత్తానికి తిరువళ్లూరు, గుమ్మడిపూండిలో తెలుగు ఓటర్లు కీలకం. వారు ఎటువైపు మొగ్గితే వారే గెలిచే అవకాశం ఉండడడంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తెలుగు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.