హోరాహోరీ
సాక్షి, చెన్నై: అధికార పగ్గాలు అమ్మకే అని ఓ సారి, కాదు..కాదు కరుణకే అంటూ మ రో సారి..! సర్వే ఫలితాలు ఇన్నాళ్లు రాష్ట్రంలో సాగుతూ వచ్చాయి. అయితే, ప్రప్రథమంగా నువ్వా...నేనా అన్నట్టుగా వెలువడ్డ సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. అమ్మకు 73 , కరుణకు 64 గ్యారంటీ అని ప్రకటించిన ఈ తాజా సర్వే, 83 స్థానాల్లో నువ్వా...నేనా అన్నట్టు హోరా హోరీ సమరం నెలకొని ఉందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే, బీజేపీ కూట మి...ఇలా..పంచ ముఖ సమరం నెలకొంది. మునుపెన్నడూ లేని రీతిలో సాగుతున్న ఈ పోరులో ఓటరు నాడి ఎటో అన్నది అంతు చిక్క డం లేదు. పెద్ద ఎత్తున ఓట్ల చీలిక తథ్యం అన్నది మాత్రం స్పష్టం అవుతున్నది. ఈ చీలిక ఆధారం గా గెలుపు గుర్రాలు అవతరించబోతున్నాయి. అది ఎవరు..? అన్న ప్రశ్న సర్వత్రా నెలకొని ఉన్నది. స్థానిక, జాతీయ సంస్థలు, మీడియా వర్గాలు ఇప్పటి వరకు సాగిన సర్వేల్లో విచిత్ర ఫలితాల్ని ప్రకటించాయి.
ఓ సంస్థ ఏమో అమ్మ జయలలిత సీఎం కావడం ఖాయం అని, క్వీన్ స్వీప్ తథ్యం అంటే, మరో సంస్థ అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ సీట్లు దక్కుతాయని వివరించాయి. ఇక, మరికొన్ని సర్వేలు కరుణానిధి సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టి తీరుతారంటూ నొక్కి చెప్పాయి. అయితే, ప్రసుత్తం జూనియర్ విగడన్ పత్రిక సర్వే అందరి దృష్టిని మరల్చి ఉంది. ఇందుకు కారణం ఆ ఫలితాలే. తమిళనాడులో నెంబర్ ఒన్‌గా వారంలో రెండు రోజులు వెలువడే పత్రికగా జూనియర్ విగడన్ ప్రఖ్యాతి గాంచింది.
ఈ సర్వే మేరకు పేద, మధ్య తరగతి, యువతరం ఓటర్ల వద్ద సేకరించిన వివరాల మేరకు ఈ సర్వే వివరాల్ని ప్రకటించి ఉన్నారు.రాష్ట్రంలోని 234 స్థానాల్లో 73 స్థానాల్లో అన్నాడీఎంకే, 64 స్థానాల్లో డీఎంకే గెలుపు ఖాయం అయిందని వివరించారు. కాంగ్రెస్ పది చోట్ల, పీఎంకే, పుదియ తమిళగం, ఐయూఎంఎల్, ఎంఎంకేలు తలా ఓ చోట్ల గెలుపు తథ్యం అని ప్రకటించారు. 151 ఒక్క స్థానాలు పోగా, మిగిలిన 83 స్థానాల్లో గెలుపు ఎవరిదీ..? అన్నది నిర్ణయించలేమని స్పష్టం చేసింది. ఇందుకు కారణం ఆ నియోజకవర్గాల్లో నువ్వా...నేనా అన్నట్టుగా సమరం ఉందని, గెలుపు ఎవరిదో అన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే అన్నట్టుగా ఆ పత్రిక స్పష్టం చేసింది.