ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారా..? డీఎంకే అభ్యర్థులకే గంపగుత్తగా ఓట్లేశారా..? ఆ పార్టీ అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపారా..? అత్యధిక స్థానాలతో అధికార పీఠం చేపట్టనున్నారా..? అన్నాడీఎంకే హవాకు ఓటర్లు మంగళం పాడేశారా..? అతి తక్కువ సీట్లకే పరిమితం చేయనున్నారా..? తమిళనాట కమల వికాసం కలేనా..? బోణీ కొట్టే పరిస్థితి కూడా ఉండదా..? అవుననే అంటున్నాయి సర్వేలు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తిరుగులేని విజయం సాధిస్తుందని ఘంటాపథంగా వెల్లడిస్తున్నాయి.
సాక్షి , చెన్నై : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేలో ఆనందం వెల్లివిరుస్తోంది, అన్నాడీఎంకేలో నైరాశ్యం అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే– డీఎంకే తలపడ్డాయి. 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రజలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళి డీఎంకేకు అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐ బ్యాక్ సంస్థ ఎన్నికలకు ముందు మొత్తం 234 స్థానాల్లో సర్వేలో నిర్వహించి డీఎంకేకు 180 స్థానాలు ఖాయమని తేల్చింది.
ఈ క్రమంలో పోలింగ్ న ఆడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని ఐ బ్యాక్ సంస్థ కార్యాలయానికి సైతం వెళ్లడం విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేకు 180 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించింది. దీంతో డీఎంకే శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. స్టాలిన్ కూడా డీఎంకే అభ్యర్థులను చెన్నైకి పిలిపించుకుని విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గురు, శుక్రవారాల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు సైతం స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ డీఎంకే అగ్రనేతలతో సమావేశమై మంత్రి పదవులు, శాఖల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది.
రెండాకుల్లో గుబులు!
అన్నాడీఎంకే విషయానికి వస్తే ఎన్నికలకు ముందు సీఎం ఎడపాడి పళనిస్వామి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత డీలా పడిపోయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పలువురు మంత్రులు సైతం ఓటమిపాలవుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పళనిస్వామి సేలం జిల్లా సూరమంగళంలోని తన సొంతింటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రులు ఎంసీ సంపత్, ఆర్‌బీ ఉదయకుమార్, విజయభాస్కర్, కేసీ వీరమణి, జయకుమార్ సహా పలువురు అభ్యర్థులు సేలం వెళ్లి ఎడపాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులే ఓడిపోయే పరిస్థితి ఉందని వారు చెప్పడంతో పళనిస్వామి మరింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే 20–30 సీట్లకు పరిమితమవుతుందని, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించినట్లు సమాచారం.
చదవండి: సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స
Comments
Please login to add a commentAdd a comment