ఎన్నికల పోరు...తారల హోరు
అన్ని పార్టీల్లోనూ కనబడుతోన్న తారల సందడి
రాజకీయాలకు తోడవుతోన్న సినీ గ్లామర్
కాంగ్రెస్‌కు మద్దతుగా కుష్బూ, అన్నాడీఎంకే మద్దతుగా శరత్‌కుమార్ ప్రచారం
తమిళసినిమా: ఎన్నికలు రాజకీయ నాయకులకు మాత్రమే కాదు సినిమా తారలకూ హడావిడే. ఎందుకంటే ఈ రెండు రంగాలను ఇప్పుడు వేరుగా చూడలేని పరిస్థితి కాబట్టి. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వాన్ని ఏలుతున్న వారు, ఏలాలని ఆశపడుతున్న వారిలో అధిక శాతం చిత్ర పరిశ్రమకు చెందిన వారేనన్నది గమనార్హం. ఇక్కడ శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల సమరానికి సరిగ్గా 15 రోజులే ఉంది. ఈ పోరులో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, బీజేపీ తలపడుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎవరి ఊహలకనుగుణంగా వారు ఇప్పటికే ప్రచారభేరి మోగిస్తున్నారు. వారికి సినీ తారల కళ తోడవుతోంది. వీరు తమ గ్లామర్ అనే ఆయుధంతో ప్రత్యర్థులపై అస్త్రశస్త్రాలు సంధించడానికి సిద్ధం అయ్యారు.
ఏ తారలు ఏ పార్టీకి మద్దతు: దాదాపు అన్ని పార్టీలలోనూ తారల సందడి కనిపించడం విశేషం. అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా నటుడు రామరాజన్, ఆనంద్‌రాజ్, సెంథిల్, మనోబాలా, పొన్నంబలం, గుండు కల్యాణం, సింగముత్తు, వైయాపురి, నటి వింధ్య, ఫాతిమాబాబు అంటూ పెద్ద పటాలమే ప్రచార గోదాలోకి దిగింది. వీరంతా 234 శాసనసభ స్థానాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సమత్తువ కట్చి నేత శరత్‌కుమార్ కూడా అన్నాడీఎంకే పార్టీ గెలుపునకు తన వంతు ప్రచారం చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తున్న తిరుచెందూర్ సెగ్మెంట్‌లో ఆయన విజయానికి నటి రాధికా శరత్‌కుమార్ ప్రచారం చేస్తున్నారు.
నటి కుష్భు ప్రచారం: ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్న నటి కుష్భు కాంగ్రెస్-డీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఇటీవలే డీఎంకే తీర్థం పుచ్చుకున్న బుల్లితెర, వెండితెర నటుడు ఇమాన్ అన్నాచ్చి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. నటుడు వాసు విక్రమ్ బోస్ వెంకట్ తదితరులు ఆ పార్టీకి మద్దతుగా గళమెత్తుతున్నారు. ఇక భారతీయ జనతా పార్టీకి మద్దతుగా సంగీత దర్శకుడు గంగైఅమరన్, నటి గాయత్రి రఘురామ్ తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి నడుం బిగించారు.