వివిధ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేయనున్న అంశాలు..
హైదరాబాద్ కర్ణాటక...
తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారి, రాయ్‌చూర్, కొప్పళ్, బీదర్, యాద్గిర్, కలబురిగి (గుల్బర్గా) జిల్లాలు ఈ ప్రాంతం కిందకు వస్తాయి. సామాజిక, ఆర్థిక వెనకబాటుదనంతో పాటు నీటివనరులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్య. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించాలనే నాలుగుదశాబ్దాల డిమాండ్ 2012లో యూపీఏ హయాంలో నెరవేరింది. వ్యవసాయానికి నీటివనరులు, అభివృద్ది, మౌలికసదుపాయాలు, ఉపాధి ఇక్కడి స్థానాల్లోని ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
బాంబే కర్ణాటక...
భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మరాఠీ ప్రజలు ఎక్కువగానే ఉన్నారు. బెళగావి ప్రాంతాన్ని మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ ఓ సంస్థ ఉద్యమం కూడా సాగిస్తోంది. కళసా బండూరి నాలా ప్రాజెక్టు ద్వారా బెళగావి, హుబ్బళ్ళి (హుబ్లీ)–ధార్వాడ్, గదగ్ ప్రాంతాలకు మహదాయీ నది నీటి పంపిణీపై మహారాష్ట్ర, గోవాలతో కర్ణాటకకు వివాదం తలెత్తింది.
పాత మైసూరు ప్రాంతం...
ఇక్కడ కావేరి జలాల వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. ఇక్కడి రైతుల జీవనోపాధికి, వ్యవసాయానికి ఈ నీరే కీలకం. కొడగు జిల్లా మీదుగా పశ్చిమ కనుమల్లో కాఫీ, నారింజ తోటల పెంపకం పెరగడంతో పర్యావరణ సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ ప్రాంతంలో చేపట్టనున్న రైల్వేలైన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు సంస్థలు ఉద్యమం నిర్వహిస్తున్నాయి. ఈ అంశాలు ఇక్కడ ఎన్నికల్లో ప్రభావితం చూపనుండగా జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.
కోస్తా, మల్నాడు ప్రాంతాలు...
దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. గోరక్షక దళాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మోరల్ పోలీసింగ్ హిందుత్వ అనుకూల శక్తుల ప్రమేయంతో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళూరు నగరంలో ఉగ్రవాద జాడలను పోలీసులు కనుక్కున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా హిందు, ముస్లింల మధ్య బాబాబుడన్‌గిరి ప్రార్థనా స్థలంపై వివాదం సాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. ఇవేకాక ప్రముఖ హేతువాది, చరిత్రకారుడు ఎంఎం కలబురిగీ, విలేకరి గౌరీ లంకేష్‌ల హత్యలు కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
శిరహట్టిలో గెలిస్తే..!
బాంబే కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఉన్న ఓ నియోజవర్గం శిరహట్టి. 1972 నుంచి 2013 వరకు జరిగిన అన్ని విధానసభ ఎన్నికల్లోనూ ఈ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం. స్వతంత్ర అభ్యర్థి గెలిచినప్పటికీ, ఆ అభ్యర్థి ఓ పార్టీలో చేరిన తర్వాతనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు న్నాయి. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది ఓటర్లుంటారు. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వదిరాజ్ ఆచార్య గెలిచారు. 1983 వరకు ఈ సీటుపై పట్టును కాంగ్రెస్ కొనసాగించి అధికారంలో ఉంది. 1983లో నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి జనతాపార్టీకి మద్దతిచ్చారు. ఆ తర్వాతే రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది. 1985లోనూ జనతాపార్టీనే ఆ సీటును నిలుపుకోగా మళ్లీ హెగ్డే సీఎం అయ్యారు. ఆ తర్వాతా ఈ స్థానంలో గెలిచిన పార్టీనే ఎప్పుడూ అధికారంలోకి వచ్చింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment