కమలం నెంబర్‌ వన్‌.. | BJP Is The Single Largest Party In Karnataka Assembly Elections | Sakshi
Sakshi News home page

కమలం నెంబర్‌ వన్‌..

Published Wed, May 16 2018 1:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

BJP Is The Single Largest Party In Karnataka Assembly Elections - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు:  అందరూ ఊహించిందే.. కానీ అనూహ్య పరిణామాలు.. కాషాయ శిబిరంలో మధ్యాహ్నం వరకు ఆనందం.. అంతలోనే ఆందోళన..! హస్తం శ్రేణుల్లో ఉదయం నుంచీ నిరాశ.. కాసేపటికే సమరోత్సాహం..! కింగ్‌మేకర్‌ అవుతుందనుకున్న జేడీఎస్‌ చివరికి ‘కింగ్‌’ అయ్యే పరిస్థితి..!! అటు ఉత్కంఠ.. ఇటు ఎత్తులు పైఎత్తులతో కర్ణాటక రాజకీయం పొలిటికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఓటరు ఇచ్చిన హంగ్‌ తీర్పు అనేక సమీకరణలకు తెరలేపింది. బీజేపీ 103 (బీజేపీ అభ్యర్థి నెగ్గిన ఓ స్థానంలో ఫలితాన్ని నిలిపేశారు) సీట్లను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి 9 సీట్ల దూరంలో ఆగిపోయింది.

78 చోట్ల నెగ్గి రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్‌.. బీజేపీకి పీఠం దక్కకుండా ఉండేందుకు జేడీఎస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇక 37 సీట్లను గెల్చుకుని మూడోస్థానానికి పరిమితమైన జేడీఎస్‌.. తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌ను కలిసింది. బీజేపీ కూడా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసింది. అధికార పీఠానికి కొద్దిదూరంలో ఆగిపోవడంతో బీజేపీ అధిష్టానం.. కేంద్రమంత్రులు జవదేకర్, జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌లను హుటాహుటిన బెంగళూరుకు పంపి వ్యూహాలకు పదును పెడుతోంది. జేడీఎస్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చీల్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో కన్నడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 



మొదట్నుంచీ ‘నువ్వా–నేనా’! 
కర్ణాటకలో మంగళవారం కౌంటింగ్‌ మొదలైనప్పట్నుంచీ ఉత్కంఠ నెలకొంది. మొదటి రెండు రౌండ్ల వరకు కాంగ్రెస్‌ ఎక్కువ చోట్ల లీడింగ్‌లో కనిపించగా.. కాసేపటికే బీజేపీ బలం పుంజుకుంది. అదే ఊపును కొనసాగిస్తూ ఏకంగా వంద సీట్ల మార్కును దాటేసింది. మధ్యలో కాసేపు ఇరు పార్టీల మధ్య ‘లీడ్‌’ దోబూచులాడింది. మధ్యాహ్నం సమయంలో బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ (112)ను దాటేసింది. కానీ ఆరంభంలో హైదరాబాద్‌ కర్ణాటకలో సీట్లు తగ్గటంతో కమలదళం గ్రాఫ్‌ తగ్గింది. 2013 ఎన్నికల్లో కేవలం 40 స్థానాలు మాత్రమే సంపాదించిన బీజేపీ.. ఈసారి ఫలితాల్లో 103 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలవడం విశేషం. పార్టీకి పట్టున్న బాంబే కర్ణాటక, కోస్తా కర్ణాటక, మధ్య కర్ణాటకల్లో మెజారిటీ స్థానాలు గెల్చుకొని స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.

మధ్య కర్ణాటక ప్రాంతంలో బళ్లారి జిల్లాలో మాత్రం బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ జిల్లాలో గాలి సోదరులు ఇద్దరు మినహా మిగిలిన బీజేపీ అభ్యర్థులంతా ఓటమిపాలయ్యారు. అటు హైదరాబాద్‌ కర్ణాటకలో ఆరంభంలో బీజేపీకి మంచి ఆధిపత్యం లభించినా.. క్రమేణా కాంగ్రెస్‌ లీడ్‌ను అందిపుచ్చుకుంది. ఇక్కడ బీజేపీకి మరో నాలుగు స్థానాలు వచ్చి ఉన్నా పరిస్థితి మరోలా ఉండేది. ఇక మైసూరు ప్రాంతంలో జేడీఎస్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 2013లో 122 సీట్లతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్‌ ఈసారి 76 సీట్లకే పరిమితమవడం, క్రితం సారికన్నా ఒక సీటు తక్కువే వచ్చినా జేడీఎస్‌ సీఎం రేసులో నిలవటం గమనార్హం. 

మేకర్‌ కాదు ‘కింగ్‌’! 
బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏది అతిపెద్ద పార్టీగా నిలిచినా జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా మారుతుందని అందరూ ఊహించారు. కానీ మారిన సమీకరణలు జేడీఎస్‌ను ఏకంగా ‘కింగ్‌’ను చేశాయి. త్రిముఖ పోటీలో మూడోస్థానంలో నిలిచినప్పటికీ.. అధికారాన్ని అందుకునే అవకాశం జేడీఎస్‌కు లభించింది. సోమవారం రాత్రే బెంగళూరు చేరుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్, అశోక్‌ గెహ్లాట్‌లు ఫలితాలు వెల్లడవుతుండగానే జేఎడీఎస్‌తో చర్చలు మొదలుపెట్టారు. ఒక దశలో తమకేమీ వద్దని.. బీజేపీకి అధికారం దక్కకుండా ఉండేందుకు సంపూర్ణ మద్దతిస్తామని కూడా ప్రతిపాదించినట్లు తెలిసింది. కుమారుడికి సీఎం పదవి ఆఫర్‌ చేయటంతో దేవెగౌడ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటైతే కాంగ్రెస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు 20 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించారు. 

బీజేపీ అప్రమత్తం.. షా నివాసంలో భేటీ 
అంతా తమకు అనుకూలంగానే ఉందనుకున్న సమయంలో సోనియాగాంధీ చొరవతో కాంగ్రెస్‌ అనూహ్యంగా నిర్ణయం తీసుకోవటం, అందుకు జేడీఎస్‌ సై అనడంతో బీజేపీ అప్రమత్తమైంది. మేజిక్‌ ఫిగర్‌ దక్కని పక్షంలో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామనుకున్న ఆశ ఆవిరయ్యే పరిస్థితి కనబడటంతో బీజేపీ ‘మిషన్‌ కర్ణాటక’ను ప్రారంభించింది. ఢిల్లీలో అమిత్‌ షా నివాసంలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, పీయూష్‌ గోయెల్, రవిశంకర్‌ ప్రసాద్, ప్రకాశ్‌ జవదేకర్‌ తదితరులు భేటీ అయ్యారు. కాసేపటికే నడ్డా, జవదేకర్, రవిశంకర్‌లు ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరారు. అటు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప కూడా అమిత్‌షాతో అనుక్షణం టచ్‌లో ఉంటూ.. ఏం చేయాలనేదానిపై చర్చలు జరిపారు. సాయంత్రం 6 గంటలకు జేడీఎస్, కాంగ్రెస్‌ గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరగా.. అంతకుముందే తాము కలవాలనకుంటున్నట్లు యడ్యూరప్ప గవర్నర్‌కు వర్తమానం పంపారు. 

మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: యడ్యూరప్ప 
యడ్యూరప్ప, కేంద్రమంత్రి అనంత్‌కుమార్, పార్టీ నేతలు మురళీధర్‌ రావు, శ్రీరాములు, ఎంపీ శోభా కరంద్లాజె తదితరులు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ వజుభాయ్‌ వాలాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు వారం రోజుల గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బయటకొచ్చిన యడ్యూరప్ప.. గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, రెండ్రోజుల్లో నిర్ణయం చెబుతామన్నారని వెల్లడించారు. వంద శాతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

నమ్మకంగా ఉన్నాం: కుమారస్వామి 
బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసిన అనంతరం.. కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతలు రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ముందుగా సీఎం సిద్ధరామయ్య రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీఎస్‌ తరపున కుమారస్వామి గవర్నర్‌కు లేఖనందించారు. అనంతరం జేడీఎస్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్‌ కూడా లేఖను సమర్పించింది. దీనిపై నిపుణులతో సంప్రదించిన నిర్ణయం చెబుతానని గవర్నర్‌ చెప్పారు. అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నర్‌ తమను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జేడీఎస్‌కు షరతుల్లేని సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. కాంగ్రెస్‌మద్దతుతో జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోందన్నారు. ఇద్దరు స్వతంత్రులు సహా తమకు 118 మంది బలం ఉందని ఆయన వెల్లడించారు. 

బీజేపీ ఏం చేయబోతోంది? 
అధిష్టానం ఆదేశాలతో కన్నడ బీజేపీ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. జేడీఎస్, కాంగ్రెస్‌లలో ఉన్న అసంతృప్తులకు గాలం వేసేందుకు యత్నిస్తున్నారు. ఆరుగురు కాంగ్రెస్‌ లింగాయత్‌ ఎమ్మెల్యేలు, ఆరుగురు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ లింగాయత్‌ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు చేసేందుకు అవకాశం ఉందన్న వార్తలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మరోవైపు దేవెగౌడ మరో కుమారుడు హెచ్‌డీ రేవణ్ణకు ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన పార్టీలోంచి 7–8 మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకొస్తారని మీడియాలో ప్రచారం సాగుతోంది. 

‘చే’జారకుండా చూద్దాం 
బీజేపీ తన వ్యూహాలకు పదునుపెడుతుండటంతో బెంగళూరు రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ‘రిసార్టు రాజకీయాల’కు కాంగ్రెస్‌ తెరదీస్తోంది. తమ ఎమ్మెల్యేలెవరూ చేజారకుండా జాగ్రత్త పడుతోంది. జేడీఎస్‌ ఎమ్మెల్యేలను కూడా ఈ క్యాంపులకు తరలించాలని భావిస్తోంది. గెలిచిన వారంతా తమ నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలెవరికీ అందుబాటులో ఉండకుండా గవర్నర్‌ నిర్ణయం వెలువడేంతవరకు వీరందరినీ అజ్ఞాత ప్రదేశానికి తరలించే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది.

పార్టీ నేతల్లో అసంతృప్తి చెలరేగకుండా.. సీనియర్‌లు, అనుభవజ్ఞులైన మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, బీకే హరిప్రసాద్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వీరంతా మంత్రి పదవుల పంపకం, పదవులు రాని వారిని బుజ్జగించనున్నారు. బీజేపీ వ్యూహాలకు ప్రతివ్యూహాలను సిద్ధం చేసేందుకు మేధోమథనం చేస్తోంది. ఇరుపార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోవడంతో రెండ్రోజుల పాటు కర్ణాటకలో మరెన్ని మలుపులుంటాయోననేది ఆసక్తికరంగా మారింది. 

ఆనందం.. అంతలోనే టెన్షన్‌ 
కౌంటింగ్‌ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. లీడ్‌లో పార్టీ మేజిక్‌ఫిగర్‌కు చేరుకోవటంతో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకు పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. కేంద్ర మంత్రులు కూడా కర్ణాటకలో తమ ప్రభుత్వ ఏర్పాటు లాంఛనమేనని.. మోదీ, షాలకు ఎదురులేదని వ్యాఖ్యానించారు. కానీ మధ్యాహ్నం నుంచి పరిస్థితులు మారటం, బీజేపీ మేజిక్‌ ఫిగర్‌ నుంచి కిందికి రావటం, కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవటంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అప్పటివరకు సంబరాల్లో ఉన్న వారంతా.. హఠాత్తుగా జరిగిన ఈ మార్పుతో ఢీలా పడిపోయారు. 

షెట్టర్‌ షాక్‌.. ఫలితం నిలుపుదల 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి జగదీష్‌ షెట్టర్‌ హుబ్లీ–ధార్వాడ నియోజకవర్గం నుంచి 20 వేల మెజార్టీతో గెలుపొందినా అధికారికంగా ప్రకటించలేదు. తొలుత ఆయనకు 72,182 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి మహేష్‌ నెలవాడకు 49,835 ఓట్లు లభించాయి. దీంతో షెట్టర్‌ గెలిచినట్లు ప్రకటించారు. అయితే పోలైన ఓట్లకు, ఈవీఎంలలో ఉన్న ఓట్లకు తేడా వచ్చినట్లు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్నికల ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఆ ఫలితాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా 104 సీట్లలో నెగ్గినప్పటికీ సాంకేతికంగా 103 సీట్లలో మాత్రమే గెలిచినట్లు అధికారంగా ప్రకటించారు. 

11 మంది మంత్రులు ఓటమిపాలు 
కర్ణాటక ఎన్నికలు ఎప్పట్లాగే.. అధికార పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టాయి. సీఎం సిద్ధ రామయ్య ప్రభుత్వంలోని 11 మంది మంత్రులు ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సిద్ధ రామయ్య కూడా చాముండేశ్వరిలో 36 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోగా.. బాదామీలో 2 వేల మెజారిటీతో కనాకష్టంగా గట్టెక్కారు. బీజేపీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందిన శ్రీరాములు.. సిద్ధ రామయ్య చేతిలో బాదామీలో ఓడినా ములకముర్రులో భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప శికారీపుర నుంచి () గెలవగా.. బీజేపీ సీనియర్‌ నేత ఈశ్వరప్ప శివమొగ్గ నుంచి, మాజీ సీఎం జగదీశ్‌ షెట్టార్‌ ధార్వాడ్‌ నుంచి () విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడిన పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ ఈసారి కొరటగెరె నుంచి గెలిచారు. కన్నడ ధనిక మంత్రిగా పేరున్న డీకే శివకుమార్‌ కనకపుర నుంచి సులభంగా గెలిచారు. దేవెగౌడ మరో కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ హోలెనర్సాపుర నుంచి, హోం మంత్రి రామలింగారెడ్డి బీఎంటీ లేఔట్‌ నుంచి ఎమ్మెల్యేలుగా నెగ్గారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement