ఏకమయ్యే సమయమిదే!
సాక్షి, ముంబై: ముంబై, భివండీలతోపాటు తెలుగు ఓటర్లు గెలుపోటములను శాసించే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఓట్లు చీలిపోతుండడంతో ప్రతి ఎన్నికల్లోనూ తెలుగువారి ఓట్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయనే అభిప్రాయాలను అన్ని పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. అదే తెలుగువారు ఐక్యంగా నిలబడి, ఒకే అభ్యర్థికి ఓటువేసేలా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే గెలుపోటములను శాసించే స్థాయికి చేరడం ఏమంత కష్టం కాదని రాజకీయ పార్టీలే అంగీకరిస్తున్నాయి.
ఇది సాధ్యం కావాలంటే తెలుగు సంఘాలన్నీ ముందు ఏకతాటిపైకి రావాల్సిన అవసరముంది. నిజానికి ఎన్నికలకు ముందే తమ ప్రతినిధిగా ఒకరిని నిలబెట్టి, అసెంబ్లీకి పంపేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అసెంబ్లీ తెలుగు అభ్యర్థుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. అయితే ఇప్పుడు అందుకు సమయం దాటిపోయింది. ఇప్పుడు తెలుగువారి చేతుల్లో ఉన్నదల్లా ఐక్యంగా నిలబడి, తెలుగువారి సంక్షేమానికి కృషి చేస్తాడని నమ్మే అభ్యర్థిని గెలిపించడమే. బరిలో ఉన్న కొంతమంది తెలుగువారికైనా మద్దతుగా నిలవడమే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా బరిలో ఉన్న తెలుగువారి వివరాలు ఇలా ఉన్నాయి...
మహాసంగ్రామంలో మనోళ్లు 15 మంది..
సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా భివండీ మినహా ముంబై, పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్, మరాఠ్వాడా జాల్నా, విదర్భ చంద్రాపూర్, యావత్మాల్ తదితర జిల్లాల్లో 15 మంది తెలుగు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15 మంది తెలుగు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వీరిలో అత్యధికంగా షోలాపూర్‌లో రెండు స్థానాలకుగాను ఐదుగురు, యావత్మాల్ జిల్లాలో నలుగురు, చంద్రాపూర్ జిల్లాలో ఇద్దరు, నాందేడ్ జిల్లాలో ఇద్దరు, ముంబై, జాల్నాలలో ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైన కైలాస్ గోరింట్యాల్, వామన్‌రావ్ కాసంవార్, సుధీర్ మునగంటివార్‌లు మళ్లీ బరిలో ఉండగా మాజీ ఎమ్మెల్యే ఆడెం నర్సయ్య మరోసారి బరిలోకి దిగారు. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో తెలుగు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
షోలాపూర్‌లో ముగ్గురు హోరాహోరీ..
పశ్చిమ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. జిల్లా కేంద్రమైన షోలాపూర్ పట్టణంలో సుమారు 70 శాతం మంది తెలుగువారే. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఆడెం నర్సయ్య, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అత్యంత సన్నిహితులైన విష్ణుకోటే కుమారుడైన మహేష్ కోటే బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్లుగా మరో ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆడెం నర్సయ్య, మహేష్ కోటేలతోపాటు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, సుశీల్‌కుమార్ షిండే కుమార్తె ప్రణతి షిండేల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. వీరికి ఎన్సీపీ అభ్యర్థి విద్యా లోల్గే, బీజేపీ అభ్యర్థి మోహినీ పట్కి, ఎంఐఎం అభ్యర్థి షేఖ్ తౌఫిక్‌ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
విదర్భలో...
విదర్భలోని చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న చంద్రాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కరీంనగర్, అదిలాబాద్‌లతోపాటు ఇతర జిల్లాలకు చెందిన తెలుగు ప్రజలున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేస్థాయికి ఎదిగిన మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షులు సుధీర్ మునగంటివార్ బల్లార్షా నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. వరుసగా మూడు సార్లు విజయం సాధించిన సుధీర్ మునగంటివార్ బల్లార్షాలో మరోసారి విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రచారం చేశారు. మరోవైపు చంద్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన తరఫున కిషోర్ జోరగేవార్ పోటీ చేస్తున్నారు.
అయితే ఆయనకు ఇక్కడ పలువురి నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక విదర్భలోని వనీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వామన్‌రావ్ కాసావార్ మళ్లీ బరిలోకి దిగారు. ఆయనకు పోటీగా తెలుగు వ్యక్తి అయిన బోద్కువార్ సంజీవరెడ్డిని బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ తెలుగువారి మధ్య హోరాహోరి పోరు సాగడం ఖాయమంటున్నారు. మరోవైపు యావత్మల్‌లో ప్రధాన పార్టీలైన బీజేపీ నుంచి తెలుగు అభ్యర్థులు మదన్ యేర్వార్, పీడబ్ల్యూపీ నుంచి దిలీప్ ముక్కావార్‌లు పోటీ పడుతున్నారు.
మరాఠ్వాడాలో...
నిజాంపరిపాలనలో తెలంగాణతో కలిసి ఉండే మరాఠ్వాడా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలున్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలను ఆనుకొని ఉన్న నాందేడ్‌లో భారీ సంఖ్యలో తెలుగువారున్నారు. దీంతో సౌత్ నాందేడ్ నుంచి తెలుగు వ్యక్తి దిలీప్ కందుకుర్తి బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండగా ఎమ్మెన్నెస్ ప్రకాశ్ మారావార్‌ను బరిలోకి దింపింది.
దీంతో ఇక్కడ కూడా తెలుగువారి మధ్య పోటీ ఏర్పడింది. మరోవైపు జాల్నాలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కైలాస్ గోరింట్యాల్ మళ్లీ బరిలోకి దిగారు. మరాఠ్వాడాలోనే తెలుగు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గెలుపు నల్లేరుమీద నడకేనంటున్నారు విశ్లేషకులు.
ముంబై, భివండీలలో...
ముంబైతోపాటు తెలుగువారు అధికంగా ఉండే భివండీలో రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎవరూ ఎదగలేకపోతున్నారు.
అనేక నియోజకవర్గాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇంకా వెనుబడే ఉన్నామనే చెప్పాలి. ముంబైలో ఈసారి మహీం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా తెలుగు వ్యక్తి నాగ్‌సేన్ మాల బరిలో ఉన్నారు. ఇక భివండీలో ఒక్క తెలుగు అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం.