
సాక్షి, విజయవాడ : కర్నాటకలో తెలుగువాళ్లు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ నేత రమేశ్‌నాయుడు తెలిపారు. బెంగళూరు నగరంలోని పద్మనాభ నగర్‌లో తెలుగువారు అధికంగా ఉంటారని, అక్కడ బీజేపీ అభ్యర్థి అశోశ్‌ను ఓటర్లు గెలిపించారని తెలిపారు. బీజేవైఎం ఈసీ సభ్యుడిగా ఉన్న రమేశ్ నాయుడు ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మహాదేవపూర్‌లోనూ బీజేపీ గెలిచిందని, కానీ టీడీపీ నేతలు తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చూసిన చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీకి ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టారని, అయినా, మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో వాజపేయి తరహాలో విలువలకు నిలబడి.. యడ్యూరప్ప గౌరవంగా రాజీనామా చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏడుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా.. నైతిక విలువలను బీజేపీ కట్టుబడిందని అన్నారు. కర్ణాటక ఎన్నికల కోసం చంద్రబాబు ఇక్కడ నుంచి డబ్బు తరలించారని ఆరోపించారు. అయినా బీజేపీనే గెలిచిందని, నైతిక విజయం తమ పార్టీదేనని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment