దక్షిణాదిన కీలక రాష్ట్రం కర్ణాటక బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతిలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో మాత్రం ఇక్కట్లు ఎదుర్కొంటోంది. సీఎం కుర్చీ కోసం ఇద్దరు హేమాహేమీలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడుతున్నారు. ఎవరిని ఎంపిక చేయాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది. ఈ పరిణామం చివరకు ఎటు దారి తీస్తుందో తెలియక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో నెగ్గడం కంటే కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడమే పెద్ద సవాలుగా మారడం గమనార్హం.
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌లో ఇలాంటి విపత్కర పరిస్థితి ఇదే మొదటిసారి కాదు. సుదీర్ఘ కసరత్తు తర్వాత సీఎంను నియమించినప్పటికీ పార్టీలో, ప్రభుత్వంలో లుకలుకలు కొనసాగడం, అసంతృప్త సెగలు రగలడం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రత్యేకత. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటే కాంగ్రెస్‌కు గ్రహపాటుగా మారుతోంది. సీఎంలను ఎంపిక చేయడంలో తప్పటడుగులు వేయడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోలేక ఉక్కిరిబిక్కిరి కావడం ఆ పార్టీలో ఒక ఆనవాయితీగా మారింది. ఇదే కాంగ్రెస్ సంస్కృతి అని సరిపెట్టుకోవాలేమో!
అశోక్ గహ్లోత్ వర్సెస్ పైలట్
రాజస్తాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. పీసీసీ చీఫ్, యువ నాయకుడు సచిన్ పైలట్ సీఎం పోస్టు ఆశించారు. తన నాయకత్వంలోనే పార్టీ గెలిచినందున పదవి తనకే దక్కుతుందని భావించారు. కానీ సోనియా కుటుంబం మరోలా ఆలోచించింది. కారణాలేమైనా సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌ను సీఎం చేసింది. దాంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. 2021లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు విఫలయత్నం ప్రయత్నించారు.
సమస్య పరిష్కారానికి 2022లో గహ్లోత్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా, పైలట్‌ను సీఎంగా నియమించేందుకు పార్టీ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ కుర్చీ వీడేందుకు గహ్లోత్ అంగీకరించలేదు. ఈ విషయమై పెద్ద హైడ్రామానే నడిచింది. చివరికి అధిష్టానమే దిగిరాక తప్పలేదు. పైలట్‌కు సీఎం కుర్చీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రాజస్తాన్‌లో గహ్లోత్ సర్కారుపై పైలట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రెండు వర్గాల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు. అధిష్టానం కూడా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.
పంజాబ్‌లో పరాభవం
పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలు కాంగ్రెస్ కొంప ముంచాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. సిద్ధూ సీఎం పదవిని కోరుకున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్టానం దళిత కార్డు ప్రయోగించింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీని సీఎంగా గద్దెనెక్కించింది. అమరీందర్ సింగ్ సొంత దారి చూసుకున్నారు. ఎన్నికల్లో సిద్ధూ వర్గం సహాయ నిరాకరణ చేసింది. ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం దక్కింది.
ఎందుకు ఈ పరిస్థితి?
అధికార బీజేపీలో మోదీయే ఏకైక పవర్ సెంటర్. పార్టీలో ఆయన మాటకు తిరుగులేదు. ఎవరిని సీఎంగా నియమించాలన్నా మోదీదే తుది నిర్ణయం. కాంగ్రెస్‌లో అలా కాదు. సోనియా, రాహుల్, ప్రియాంక రూపంలో మూడు పవర్ సెంటర్లున్నాయంటారు. డీకే శివకుమార్‌కు సోనియా అండదండలుంటే ప్రియాంక మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గుతుంటే రాహుల్ సైతం ఆమెను సమర్దిస్తున్నట్లు సమాచారం.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ‘‘రాష్ట్రాల్లో ఎవరో ఒక్కరే శక్తివంతులుగా పెత్తనం చెలాయించడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టముండదు. అభద్రతాభావమే ఇందుకు కారణం. అందుకే పలు పవర్ సెంటర్లను ప్రోత్సహిస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అస్సాం చేజారింది
ఈశాన్య భారతదేశంలో కీలక రాష్ట్రం అస్సాం. ఈ రాష్ట్రం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. రాహుల్ గాంధీ వ్యవహార శైలి పట్ల విసుగెత్తిపోయిన హిమంత బిశ్వ శర్మ 2015లో బీజేపీలో చేరారు. తర్వాత ఎన్నికల్లో నెగ్గి ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయ్యారు. అస్సాం బీజేపీ ఖాతాలో చేరింది. అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం గాలిలో దీపమే.
ఛత్తీస్‌గఢ్‌లోనూ...
ఛత్తీస్‌గఢ్‌లో సైతం కాంగ్రెస్ పరిస్థితి గొప్పగా లేదు. పార్టీలో గ్రూప్‌లు భగ్గుమంటున్నాయి. తనను ముఖ్యమంత్రిని చేస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని, ఇప్పటికీ నిలబెట్టుకోలేదని సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలపై, సీఎం భూపేష్ భగేల్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు.
మధ్యప్రదేశ్‌ను వదిలేసుకున్నారు
మధ్యప్రదేశ్‌లోనూ చేతికందిన అధికారం కాంగ్రెస్ తప్పిదంతో చేజారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవి డిమాండ్ చేశారు. సోనియా కుటుంబం కమల్‌నాథ్ వైపు మొగ్గింది. దాంతో సింధియా 2020లో తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. మెజార్టీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివరాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఒప్పందంలో భాగంగా జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మిగిలింది గుండు సున్నా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment