సాక్షి, హైదరాబాద్: శనివారం వెలువడనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో అప్పుడే వేడి పెంచేశాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా పోరాడిన కర్ణాటకలో.. కాంగ్రెస్ స్వల్పంగా పైచేయి సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటం, అదేమీకాదు బీజేపీ మెజార్టీ సాధిస్తుందన్న అభిప్రాయాలూ వినిపించడంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ముఖ్యంగా అధికార భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో కర్ణాటక ఫలితాలపై ఆసక్తి కనిపిస్తోంది. నిజానికి ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే తమ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు జరగడంతో.. అక్కడ రాబోయే ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని బీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలలో ఏది గెలిచినా.. తెలంగాణలో ఏ తరహా వ్యూహాన్ని అమలు చేస్తాయన్న దానిపై బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం. కర్ణాటక ఎన్నికల ఫలితాలను అనువుగా ఎలా మలుచుకోవాలనే వ్యూహాలను సిద్ధం చేయడంపైనా దృష్టి సారించినట్టు తెలిసింది.
బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు..
కర్ణాటకలో బీజేపీ అమలు చేసిన పలు విధానాలు, వ్యవహరించిన తీరు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ బలమున్న బీజేపీ.. ప్రధానంగా హైదరాబాద్ నగరం, శివారు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత బలంగా ఉందని అంచనా వేస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో 8 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలు మినహా.. కాంగ్రెస్ పార్టీయే ప్రధాన పోటీదారుగా ఉంటుందని బీఆర్‌ఎస్ సంస్థాగత నివేదికల ఆధారంగా భావిస్తున్నట్టు తెలిసింది.
కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చి నా.. మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి నా... అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సర్వశక్తులు ఒడ్డుతుందని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలో దూకుడు పెంచుతుందని అభిప్రాయపడుతోంది. ఒకవేళ కర్ణాటకలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టకుంటే.. ఇక్కడ ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడం సులువు అవుతుందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
కాంగ్రెస్‌తోనే ప్రధాన పోటీ..
గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉన్నట్టు ఆత్మీయ సమ్మేళనాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరించిన బీఆర్‌ఎస్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నట్టు తెలిసింది. హైదరాబాద్, శివారు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సాధించే ఓట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు ఒక ఏడు శాతం తగ్గితే.. తాము గెలుపు కోసం శ్రమించాల్సి వస్తుందని ఓ ఎమ్మెల్యే వ్యా ఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. హుజూరాబాద్ తరహాలో గ్రేటర్ పరిధిలో కాంగ్రె స్ నామమాత్ర పోటీకి పరిమితమైతే ఇబ్బంది త ప్పవని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ వైపు మొగ్గుచూపే అవకాశము న్న వర్గాలపై ఫోకస్ పెట్టి.. బీఆర్‌ఎస్ వైపు తిప్పు కొనేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment