సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో నాలుగైదు నెలలే ఉంది. ఇలాంటి సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త బలం వస్తుంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌లలోకి పార్టీ నుంచి వలసలు తగ్గుతాయి. అసెంబ్లీ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది’’.. రాష్ట్ర కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపవచ్చనే రాజకీయ అంచనాల నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ కోటి ఆశలతో ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో ఆ పార్టీలో హుషారు కన్పిస్తోంది.
బీజేపీని నిలువరించడం సులువు!
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని కాంగ్రెస్ నేతలు అంటున్నా.. బీజేపీ పుంజుకుంటున్న తీరు వారిని కలవరపెడుతూనే ఉంది. బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్ నుంచి అడపాదడపా బీజేపీలోకి వలసలు జరుగుతుండటం, కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపైనే దృష్టి సారించనుందనే సంకేతాలు వస్తుండటం.. కాంగ్రెస్‌లో ఆందోళన పెంచుతోంది.
ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. ఈ ఆందోళనకు చెక్‌పడుతుందని, ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితులు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తుందని, అది తెలంగాణలోనూ టానిక్‌లా పనిచేస్తుందని అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి బ్రేక్ పడుతుందని, వలసలు ఆగుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతాయని పేర్కొంటున్నారు.
బీఆర్‌ఎస్‌కు దీటుగా నిలిచేలా..
కర్ణాటకలో విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరాజయాలు, రోజురోజుకూ క్షీణించిపోతున్న పార్టీగా ముద్ర పడుతున్న నేపథ్యంలో.. కర్ణాటక గెలుపు ఆ అభిప్రాయాన్ని తొలగిస్తుందని అంటున్నారు. ఈ ఊపుతోనే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్నికలను ఎదుర్కొనే ధీమా వస్తుందని వివరిస్తున్నారు.
కర్ణాటకలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంచుకున్నట్టే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌వైపు చూస్తారని అంటున్నారు. బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఎన్నికలు జరుగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఎగ్జిట్‌పోల్స్‌కు భిన్నంగా కర్ణాటకలో ప్రతికూల ఫలితాలు వస్తే.. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు గడ్డుకాలమేనని, మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అంటున్నారు.
‘‘కర్ణాటకలో మేం గెలిస్తే ధైర్యంగా తెలంగాణ ఎన్నికలను ఎదుర్కొంటాం. అలా కాకుండా కర్ణాటకలో ఓటమి ఎదురయితే ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దూకుడుగా ఎన్నికలకు వెళ్లకపోతే ఇక్కడా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముంది. అయినా కర్ణాటకలో గెలుస్తామని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకుంది’’అని టీపీసీసీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment