కర్ణాటక ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరం  | BRS away from Karnataka elections | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరం 

Published Thu, Mar 30 2023 3:06 AM | Last Updated on Thu, Mar 30 2023 3:09 AM

BRS away from Karnataka elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మరో రెండు నెలల్లో జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నిర్ణయించింది. గతంలోనే తీసుకున్న నిర్ణయం మేరకు అక్కడ లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని పేర్కొంది. అయితే కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎన్నికల్లో అక్కడి ఏయే పా ర్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాయి? పొత్తులు, ఇతర అంశాల ప్రభావం ఏమిటి? అన్న అంశాలను బీఆర్‌ఎస్‌ క్షుణ్నంగా పరిశీలించనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కర్ణాటకకు పంపనుంది. 

మొదట్లో హడావుడి చేసినా.. 
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు టీఆర్‌ఎస్‌ గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా అవతరించగా.. మొదట్లో పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో అడుగు పెట్టేందుకు హడావుడి చేసింది. అయితే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల వరకు ఇతర రాష్ట్రాల్లో జరిగే అన్ని ఎన్నికలకు దూరంగా ఉంటామని తర్వాత ప్రకటించింది.

కానీ ఈ నిర్ణయాన్ని పాక్షికంగా సడలిస్తూ.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను రిజిస్టర్‌ చేయడంతోపాటు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ తదితర పా ర్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్, కాంధార్‌–లోహలో బహిరంగ సభలు నిర్వహించారు. మరిన్ని సభలు, సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. 

పోటీ చేయకున్నా.. చురుగ్గా.. 
కర్ణాటకలో శాసనసభ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. అక్కడ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉంటూనే.. చురుకైన పాత్ర పోషించాలనే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల నాటికి కర్ణాటకలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక కమిటీని ప్రకటించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటకలో ప్రధాన రాజకీయపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ) ఎన్నికల ఎత్తుగడలపై కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపాయి. 

సరిహద్దు జిల్లాలపై స్పెషల్‌ నజర్‌ 
గతంలో హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా ఉండి ప్రస్తుతం కల్యాణ కర్ణాటకగా పిలుస్తున్న బీదర్, రాయచూర్, యాద్గిర్, కొప్పల్, కలబుర్గి జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ బలోపేతం లక్ష్యంగా కొంత హడావుడి జరిగింది. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పర్యటించి వివిధ పా ర్టీల నేతలతో భేటీ అయ్యారు.

కానీ తర్వాత కర్ణాటకపై ఫోకస్‌ తగ్గించి మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీతోపాటు విపక్ష కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు బ్యాంకులో చీలికను నివారించడం, భావసారూప్య పార్టీ జనతాదళ్‌ (సెక్యులర్‌)కు మేలు చేసేందుకే కన్నడ రాజకీయాలపై ఫోకస్‌ తగ్గించినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.

మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీ (ఎస్‌) కర్ణాటక ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేపక్షంలో.. ఆ పార్టీ తరఫున కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల అవగాహన కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జేడీఎస్‌ను సంప్రదించాయని ఇటీవల కుమారస్వామి ప్రకటించారు. ఒకవేళ జేడీఎస్‌ ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటే కర్ణాటక ఎన్నికల్లో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 

జేడీ(ఎస్‌)తో మైత్రి కొనసాగుతున్నట్టేనా? 
కుమారస్వామిని మరోమారు కర్ణాటక సీఎంగా చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ, డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమాలకు కుమారస్వామి హాజరయ్యారు. అయితే ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సభకు కేసీఆర్‌తోపాటు మరో ముగ్గురు సీఎంలు హాజరైనా కుమారస్వామి రాలేదు.

ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించేందుకు పలువురు సీఎంలు, విపక్ష నేతలను ఆహ్వానించగా.. అందులో కుమారస్వామి పేరు కనిపించలేదు. దీనితో జేడీ(ఎస్‌)తో బీఆర్‌ఎస్‌ మైత్రి బీటలు వారిందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో తలమునకలైన కుమారస్వామికి తీరిక లేనందునే బీఆర్‌ఎస్‌ సమావేశాలకు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement