ఒరు కుప్పై కథై చిత్రంలో ఓ దృశ్యం
తమిళసినిమా: సత్యజిత్‌రే చిత్రం చూస్తున్నట్లు అనిపించిందని ఎండీఎంకే నేత వైగో ఒరు కుప్పై కథైపై ప్రశంసల వర్షం కురిపించారు. నవ దర్శకుడు కాళీ రంగస్వామి దర్శకత్వంలో అస్లామ్ నిర్మించిన చిత్రం ఒరు కుప్పై కథై. నృత్య దర్శకుడు దినేశ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించింది. గత వారం తెరపైకి వచ్చిన ఒరు కుప్పై కథై చిత్రాన్ని ఎండీఎంకే నేత వైగో ఇటీవల తిలకించారు. అనంతరం ఆయన చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఒరు కుప్పై కథై చిత్రాన్ని అందరూ, ముఖ్యంగా మహిళలు చూడాలన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడడం, వివాహేతర సంబంధం కారణంగా భార్య హత్య, ఈ కాలంలో భర్తను కొట్టి చంపిన భార్య లాంటి వార్తలు చదువుతుంటే వేదన కలుగుతోందన్నారు. 50 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదన్నారు. సాయం చేయడమే ఎరిగిన దేశం మనదన్నారు.
ఈ సమాజంలో బయట పడని అంతరంగ ఆపదలు ఎలా జరుగుతున్నాయన్నది ఎక్కడా అసహనానికి గురి కాకుండా ఒరు కుప్పై కథై చిత్రంలో దర్శకుడు కాళీ రంగస్వామి అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా ఆయన చాలా మంచి సందేశాన్ని చెప్పారన్నారు. మనం సమాజంలో సంసార జీవితాన్ని ఎలా సాగించాలి, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అన్న విషయాలను చక్కగా చెప్పారన్నారు. భర్త ధనవంతుడైనా సమాజంలోని పరిస్థితుల గురించి అవగాహన లేకుంటే ఎంత కష్టం అన్ని విషయాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు కాళీ రంగస్వామి ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం అన్నారు. చిత్రంలో నటీనటులు నటించలేదని, పాత్రకు ప్రాణం పోశారని అన్నారు.
ఈ చిత్రంలో చూపించిన ప్రాంతాలను చూసి ఏంటి ఇలా ఉంది అని తొలుత అనిపించినా నిజానికి అదే జీవితం. అయితే మరో జీవితం కూడా చిత్రంలో చూపించారు. నక్షత్ర హోటళ్లు, ఆడంబర జీవితాలు ఉంటాయన్నారు. అయితే మురికి వాడలు, అక్కడి ప్రజల జీవితాలు ఉన్నయే అవే వాస్తవం అన్నారు. దర్శకుడు సత్యజిత్‌రే తన చిత్రాల్లో ఇలాంటి విషయాలను తెరపై ఆవిష్కరించే పలు అవార్డులను అందుకున్నారన్నారు. ఈ ఒరు కుప్పైకథైకి అవార్డులు రాకపోయినా ప్రజలు చూసి ఆదరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment