Satyajit Ray
-
DERIVAZ AND IVES: జ్ఞాపకాల ‘రే’ఖలు
సత్యజిత్ రే చిత్రాలు కాలాతీతమైనవి. ఆ జ్ఞాపకాలు ఏ కాలానికైనా అపురూపమైనవి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ యాక్షన్ హౌజ్ డెరివాజ్ అండ్ ఐవ్స్ సత్యజిత్ రే సినిమాలకు సంబంధించి రేర్ పోస్టర్లు, ఫోటోగ్రాఫిక్ స్టిల్స్, లాబీ కార్డ్స్, సినాప్సిస్ బుక్‌లెట్స్‌తో పాటు ఆయన రూపొందించిన కళారూపాలను వేలం వేసింది. ఈ వేలంలో పాల్గొనడానికి రే అభిమానులు, సినీ పండితులు, ఆర్ట్ కలెక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కాలం కంటే ముందు ఉన్న ఆలనాటి పోస్టర్ డిజైనింగ్, కాలిగ్రాఫిక్ క్వాలిటీని అర్థం చేసుకోవడానికి... స్థూలంగా చెప్పాలంటే ఐకానిక్ ఫిల్మ్‌మేకర్ అద్భుత ప్రయాణాన్ని అన్వేషించడానికి ఈ వేలం ఒక సాధనం అవుతుంది. -
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్‌రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్‌పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
దార్శనిక శ్రమజీవి: సత్యజిత్ రాయ్ / 1921–1992
మా ఇల్లు విలక్షణమైనదని నా చిన్నతనం లోనే నేను గ్రహించాను. మా నాన్నగారు కుటుంబంతో ఎక్కువసేపు గడిపేవారు. ఆయన దాదాపుగా ప్రతిసారీ తన ఔట్‌డోర్ షూటింగులు వేసవి కాలం సెలవుల్లోనో, శీతాకాలం సెలవుల్లోనో ఉండేలా చూసుకొనేవారు. అందువల్ల మేమంతా ఆ సెలవుల్లో ఆయనతో పాటు ఔట్‌డోర్ షూటింగులో గడిపే వీలు చిక్కేది. ఆ రోజుల్లో నటీనటులు ఇప్పటిలా మరీ తీరిక లేకుండా ఉండేవారు కారు. అందువల్ల అలాంటి షూటింగులను ఎంతో సులభంగా ఏర్పాటు చేసుకోగలిగేవాళ్లం. ఆ రకంగా మహోన్నత చిత్ర నిర్మాణమంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను. మా నాన్నగారు రేయింబవళ్లు పని చేసేవారు. ఇంట్లో ఏ అలికిడీ లేకముందే బాగా తెల్లవారు జామునే ఆయన నిద్ర లేస్తారు. అల్పాహారం తర్వాత ఉత్తరాలకు సమాధానాలిస్తూ ఉదయమంతా గడిపేస్తారు. ఆయనకు వ్యక్తిగత కార్యదర్శి అంటూ ఎవరూ లేరు. ఉత్తరాలు రాయడం దగ్గర నుంచి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడం దాకా అన్నీ ఆయనే స్వయంగా చేసేవారు. ఉదయం వేళల్ని ఆయన ఎక్కువగా బొమ్మలు గీసుకోడానికి ప్రత్యేకించుకునేవారు. మధ్యాహ్న భోజనం తరువాత ఆయన చిత్ర రూపకల్పనలో తన దృష్టి అవసరమైన కథా రచన, సంగీతం, తదితర అంశాల్లో దేని మీదనైనా ధ్యాస నిలిపేవారు. స్క్రీన్ ప్లే, దుస్తులు, సంగీతం నుంచి.. పేర్లు వేసేట ప్పుడు వచ్చే బొమ్మల దాకా ప్రతి అంశం పైనా ఆయన ఏకాగ్రతతో పని చేసేవారు. ఎప్పుడూ ఆయన ఏదో ఒక పని చేస్తూ కనిపించేవారు. జీవన సాఫల్య పురస్కారంగా ఆస్కార్‌ను అందుకోవడం ఆయనకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ అవార్డు అందుకుంటూ చేసిన ప్రసంగంలో ఆయన 1944 నాటి చిత్రమైన ‘డబుల్ ఇన్డెమ్నిటీ’ చూశాక, ఆ చిత్ర దర్శకుడు బిల్లీ వైల్డర్‌కు తాను ఓ లేఖ రాశానని, ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో నిరాశ చెందాననీ తెలిపారు. ఆ తరువాత వైల్డర్ ఆయనకు ఓ టెలిగ్రామ్ ఇచ్చారు. లేఖకు జవాబు రాయనందుకు మన్నించమనీ, ఈసారి నాన్నగారు అమెరికాకు వచ్చినప్పుడు డబుల్ ఇన్డెమ్నిటీ చిత్రం గురించి సుదీర్ఘంగా చర్చిద్దామనీ వైల్డర్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ అది జరగనే లేదు. – సందీప్ రాయ్, సినీ దర్శకులు, సత్యజిత్ రాయ్ కుమారుడు -
చెన్నైలో సత్యజిత్ రే చిత్రోత్సవాలు ప్రారంభం
తమిళ సినిమా: ప్రఖ్యాత దివంగత సినీ దర్శకు డు సత్యజిత్ రే శత జయంతిని పురస్కరించుకొని చెన్నైలో మూడు రోజులపాటు సత్యజిత్ రే చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఎన్.ఎఫ్.డి.సీ (నే షనల్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చిత్రోత్సవాలు సోమవారం స్థానిక అడయార్, ఆర్.ఏ.పురంలోని ఠాగూర్ ఫిలిం సెంటర్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. నటి అర్చన ముఖ్యఅతిథిగా పాల్గొ ని ద్వీప ప్రజ్వలన చేసి చిత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో ఎన్.ఎఫ్.డి.సీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేష్ ఖన్నా, రీజనల్ హెడ్ రోహిణి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగ నున్నాయి. ఇందులో సత్యజిత్ రే వెండితెరపై చె క్కిన అజరామర చిత్రాలను ప్రదర్శించనున్నారు. -
Satyajit Ray: నవ్యచిత్ర వైతాళికుడు
‘‘ఏమున్నది సార్ గీ సిన్మాల అంతా మా వూరు లెక్కనే వున్నది... మా బతుకులే వున్నయి...’’ సత్యజిత్ రే ‘పథేర్ పాంచాలి’ సినిమా చూసిన తర్వాత కరీంనగర్ జిల్లా ‘పోరండ్ల’ గ్రామ రైతు స్పందన ఇది. ఒక నిజాయతీ కలిగిన వాస్తవిక సినిమాకు ప్రపంచంలో ఎక్కడయినా ఇలాంటి స్పందనే వస్తుందన్నది నిజం. భారతీయ సినిమాకు కళాత్మకతనూ, మానవీయ స్పందనలనూ అందించిన దర్శకుడు రే. తన ముప్పై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన ‘పథేర్ పాంచాలి’ నుంచి ‘ఆగంతుక్’ వరకు ముప్పై పూర్తి నిడివి సినిమాలు, అనేక డాక్యుమెంటరీ సినిమాలు తీశారు. ఈ రోజుల్లో లాగా ఎలాంటి ఆధునిక ప్రసార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ లేని ఆ కాలంలో రే కు ప్రపంచ ఖ్యాతి లభించింది. 1921లో మే 2న జన్మించిన సత్యజిత్ రే తన జీవితంలోని అత్యధిక సమయం సినీ రంగంలోనే గడిపినప్పటికీ ఆయన... రచయితగా, చిత్రకారుడిగా, టైపోగ్రాఫర్గా, బాల సాహిత్య సృష్టి కర్తగా, సైన్స్ ఫిక్షన్ రచయితగా తనదైన ముద్రతో సృజన రంగంలో పని చేశారు. సినిమా రంగంలో కూడా దర్శకత్వంతో పాటు సంగీతం, సినిమా టోగ్రఫీ, స్క్రిప్ట్, మాటల రచన తానే నిర్వహించారు. మొదట రవిశంకర్ లాంటి వాళ్ళతో సంగీతం చేయించుకున్నా తర్వాత తానే తన సినిమాలన్నింటికీ సంగీతం సమకూర్చుకున్నారు. ఇంకా సన్నివేశాలకు సంబంధించి సంపూర్ణ స్కెచెస్ వేసుకొని, చిత్రీకరణ జరిపేవారు. సాహిత్యానికీ సినిమాకూ వారధిలా నిలిచి భారతీయ సినిమాను పరిపుష్టం చేశారు. టాగూర్, బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్, తారాశంకర్ బంధోపాధ్యాయ్, ప్రేమ్ చంద్, నరేంద్రనాథ్ లాంటి మహా రచయితల రచనల్ని తెరపైకి ఎక్కించారు రే. అంతేకాదు, పలు సినిమాలకు తన స్వీయ రచనల్ని కూడా ఉపయోగించుకున్నారు. (చదవండి: ఆదర్శ కమ్యూనిస్టుకు జోహార్లు!) 1956లో ‘పథేర్ పాంచాలి’ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్’ అవా ర్డును గెలుచుకొని భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది. తర్వాత ‘దేవి’, ‘కాంచన్ జంగా’, ‘చారులత’, ‘తీన్ కన్య’ ‘ఘరె బైరె’, ‘ఆగంతుక్’ లాంటి అనేక విశ్వ విఖ్యాత సిని మాల్ని రూపొందించారు. బహుశా ఆయన సినిమాల్ని ప్రదర్శించని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ప్రపంచంలో లేవు. ఆయన అందుకోని అవార్డులూ లేవు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’, దాదా సాహెబ్ ఫాల్కే వంటి అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన ‘లెజియన్ ఆఫ్ ఆనర్’, అలాగే ‘ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారం’ లాంటి లెక్కలేనన్ని అంతర్జాతీయ పురస్కారాలూ అందుకున్నారు. భారతీయ సినిమాకు నవ్యచిత్ర వైతాళికుడిగా నిలిచిన సత్యజిత్ రే 1992 ఏప్రిల్ 23న కలకత్తాలోని బెల్లెవీ నర్సింగ్ హోమ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన చరిత్ర చిత్రసీమకు మణిహారం. (చదవండి: ‘జై హింద్’ నినాదకర్త మనోడే!) – వారాల ఆనంద్ (మే 2న సత్యజిత్ రే జయంతి) -
ట్రైలర్ టాక్: నాలుగు స్తంభాలాట
ఓటీటీ కంటెంట్‌లో అంథాలజీ(నాలుగైదు కథల సమూహారం) సిరీస్‌లకు ఈమధ్య ఫుల్ క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ మరోక దానితో రాబోతోంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రాసిన కథల సమూహారం నుంచి నాలుగు కథలను తీసుకుని వాటి ఆధారంగా.. హిందీలో ‘రే’ సిరీస్‌ను నిర్మించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సిరీస్ ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఏదైనా గుర్తు పెట్టుకునే కంప్యూటర్ లాంటి బ్రెయిన్ ఉన్న ఒక వ్యక్తి, ఒక యువ నటుడు, ఒక ఫేమస్ కవి, ఒక మేకప్ ఆర్టిస్ట్.. ఈ నలుగురి జీవితాల కథాంశమే రే(కిరణం). కవిగా మనోజ్ వాజ్‌పాయి, సూపర్ మెమరీ ఉన్న వ్యక్తిగా మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్(గుడ్డూ), మేకప్ ఆర్టిస్ట్‌గా కయ్ కయ్ మీనన్, నటుడి రోల్లో హర్షవర్దన్ కపూర్లు యాక్ట్ చేశారు. సాఫీగా సాగిపోయే ఆ నలుగురి జీవితాల్లో కల్లోలం, వాళ్ల చీకటి గతం, ఆ నలుగురి కథలకు ఊహించని ముగింపుల హింట్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. అహం, అసూయ, వెన్నుపోటు, ప్రతీకారం.. చుట్టే ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇక సత్యజిత్ రే కథల సమూహారంలో ‘హంగామా హై క్యోన్ బార్పా, ఫర్ గెట్ మీ ఆనట్, బహురూపియా, స్పాట్లైట్ ప్రామిస్’.. రే ఆంథాలజీ సిరీస్‌గా రాబోతోంది. గజ్రాజ్ రావ్, శ్వేతా బసు ప్రసాద్, అనిందితా బోస్, బిదితా బాగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాల దీనిని తెరకెక్కించారు. జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. చదవండి:ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
బిపిన్ చౌధురి జ్ఞాపకశక్తి పోయిందా..?
బిపిన్ చౌధురి ప్రతి సోమవారంనాడు తన కార్యాలయం నుంచి తిరిగి వచ్చేదారిలో కొత్త అంగడి వీధిలో ఉన్న కాళీచరణ్ దుకాణంలోకి పుస్తకాలను కొనడానికి వెళ్తుంటాడు. నేర సంబంధ కథలు, దయ్యాల కథలు, ఇంకా గుండెలు ఝల్లుమనేలా భయపెట్టేవి. వారం అంతా గడిచిపోయేలా అతను ఒకేసారి ఐదు పుస్తకాలను కొంటాడు. బిపిన్‌బాబు ఒంటరిగా ఉంటాడు. అతనికి కొద్దిమంది మిత్రులున్నారు. ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేయడం ఆయనకిష్టం ఉండదు. ఈ దినం కాళీచరణ్ దుకాణంలో అతనికి తననెవరో దగ్గరగా పరిశీలనగా గమనిస్తున్నట్లు అనుభూతి కలిగింది. తను వెనక్కి తిరిగి ఒక గుండ్రని ముఖం కలిగి, సాత్వికంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని... తానతన్ని చూడగానే అతని ముఖంపైన చిరునవ్వు కదలడంతో– అతనేనని తనంటత తానే అర్థం చేసుకున్నాడు. ‘‘నువ్వు నన్ను గుర్తు పట్టలేదని భావిస్తున్నా’’ ‘‘మనం క్రితం కలుసుకున్నామా?’’ బిపిన్‌బాబు అడిగాడు. ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ‘‘ఒక పూర్తి వారంలోని ప్రతిదినం మనం కలుసుకున్నాము. 1958లో రాంచీలో హుద్రూ జలపాతాలకు నిన్ను తీసుకు వెళ్లడానికి నేను కారును ఏర్పాటు చేశాను. నా పేరు పరిమళ ఘోష్.’’ ‘‘రాంచీనా?’’ ఇప్పుడు బిపిన్‌బాబు– అతనిక్కావలసిన ఆ వ్యక్తి ఎవరో తాను కాదని ఈ మనిషి పొరపాటు పడ్డాడనీ నిశ్చయానికి వచ్చాడు. తానేనాడూ రాంచీ వెళ్లలేదు. అనేకసార్లు వెళ్లాలని ఉద్దేశపడ్డాడు. కానీ ఎప్పుడూ వెళ్లలేదు. చిరునవ్వుతో అడిగాడు బిపిన్‌బాబు ‘‘నేనెవరో మీకు తెలుసా?’’ ఆ మనిషి కనుబొమలు పైకెగురవేస్తూ అన్నాడు ‘‘నువ్వు నాకు తెలుసు. బిపిన్ చౌధురిని ఎరగని వాళ్లెవరు?’’ బిపిన్‌బాబు పుస్తకాల అరల వైపు తిరిగి అన్నాడు ‘‘ఇప్పటికీ మీరు పొరపాటులోనే ఉన్నారు. నేనేనాడూ రాంచీ వెళ్లలేదు.’’ ఆ వ్యక్తి పెద్దగా నవ్వాడు ‘‘ఏమంటున్నావు మిస్టర్ చౌధురి! నువ్వు హుద్రూలో పడిపోయావు. నీ కుడి మోకాలికి గాయమైంది. నేను నీకు అయోడిన్ తెచ్చాను. తర్వాతి దినం నువ్వు నెవర్హాట్ వెళ్లడానికి నేనో కారు కుదిర్చాను. కానీ నువ్వు నీ మోకాలి నొప్పితో వెళ్లలేకపోయావు. ఇవేవీ గుర్తులేవా? అదే సమయంలో నీకు తెలిసిన మరో వ్యక్తి కూడా రాంచీలో ఉన్నాడు. అతను మిస్టర్ దినేష్ ముఖర్జీ.నువ్వో బంగ్లాలో బస చేశావు. నీకు హోటలు భోజనం ఇష్టం కాదని చెప్పావు. ఎవరైనా ఒక వంట మనిషి వండిన భోజనమైతే మేలన్నావు. నీకింకా చెప్తాను. దర్శనయోగ్యస్థలాలకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ నువ్వో సంచిలో పుస్తకాలు పెట్టుకుని మోసుకెళుతుంటావు. అవునా, కాదా?’’ తన దృష్టినలాగే పుస్తకాల మీద నిలిపి నిమ్మళంగా మాట్లాడాడు బిపిన్‌బాబు ‘‘1958 గురించి మాట్లాడుతున్నారు కదా, అది ఏ నెల?’’ ‘‘అక్టోబరు’’ అన్నాడా వ్యక్తి. ‘‘లేదండి’’ బిపిన్‌బాబు అన్నాడు. ‘‘58 అక్టోబరులో నేను కాన్పూరులో ఉన్న నా మిత్రుని వద్ద గడిపాను. మీరు పొరబడ్డారు. మంచిది. సెలవ్!’’ కానీ ఆ మనిషి సెలవు తీసుకోనూలేదు, మాట్లాడకుండా ఉండనూలేదు. ‘‘చాలా చిత్రం. ఒక సాయంకాలం నీ బంగళా వరండాలో నీతో కలసి తేనీరు తాగాను. నువ్వు నీ కుటుంబం గురించి మాట్లాడావు. నీకు పిల్లల్లేరని చెప్పావు. పదేళ్ల క్రితమే భార్యను కోల్పోయానన్నావు. నీ ఒక్కగానొక్క తమ్ముడు పిచ్చితో చనిపోయాడనీ, అందుకే నువ్వు రాంచీలో మనోవ్యాధుల చికిత్సాలయానికి రావడం నీకిష్టంలేదని చెప్పావు.’’ బిపిన్‌బాబు కొన్న పుస్తకాలకు డబ్బిచ్చి దుకాణం వదిలి వెళుతుండగా ఆ వ్యక్తి శుద్ధ అపనమ్మకంతో అతన్నలాగే చూస్తూ ఉండిపోయాడు. బిపిన్‌బాబు కారును బెర్ట్రం వీధిలోని లైట్‌హౌస్ చిత్రశాల దగ్గర కార్లు నిలిపే స్థలంలో సురక్షితంగా నిలుపుతాడు. వచ్చి కారులో కూర్చుంటూ నడిపే వ్యక్తికి ‘‘కొంచెం అలా గంగ పక్కగా పోనియ్ సీతారాం’’ అని చెప్పాడు. తీరా రాస్తాపైన కారు పోతుండగా... ఇందాక తానడగకుండానే జోక్యం చేసుకుని చొరబడిన వ్యక్తి వద్ద శ్రద్ధ కనపరచినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. తానెప్పుడూ రాంచీ వెళ్లలేదు. దాని గురించి ప్రశ్నే లేదు. కేవలం ఆరేడు సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను మరచిపోవడం అసంభవం. తనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది– తనకి బుర్రతిరుగుడు జరిగితే తప్ప... తాను చలచిత్తుడైతే తప్ప– కానీ అదెలా జరుగుతుంది? ప్రతిదినం అతను కార్యాలయానికి వెళ్లి పని చేస్తూనే ఉన్నాడు. అదొక పెద్ద సంస్థ. అందులో తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఇప్పటివరకు ఏదైనా తీవ్రమైన తప్పు జరుగుతోందని అతని దృష్టికి వచ్చింది లేదు. ఈరోజే చాలా ముఖ్యమైన సమావేశంలో అరగంటసేపు మాట్లాడాడు. అయినా... అయినప్పటికీ, ఆ వ్యక్తి తన గురించి సవిస్తారంగా ఆరా తీశాడే. ఎలా? అతను కొన్ని ఆంతరంగిక వివరాలను సైతం తెలుసుకున్నట్లు కనిపిస్తోంది... పుస్తకాల సంచి, భార్య గతించడం, సోదరుని పిచ్చి... ఒకే పొరపాటు– తాను రాంచీ వెళ్లానని చెప్పడం గురించి. అది పొరపాటు మాత్రమే కాదు, బుద్ధిపూర్వకంగా చెప్పిన అబద్ధం. 1958లో అది పూజల సమయం. తాను తన మిత్రుడు హరిదాస్ బాగ్చీ దగ్గర కాన్పూర్‌లో ఉన్నాడు. ఈ విషయంలో అతనికి రాస్తే..? లేదు లేదు. హరిదాస్‌కు రాసే మార్గం లేదు. అతను తన భార్యతో సహా కొన్ని వారాల క్రితం జపాన్ వెళ్లాడనేది హఠాత్తుగా గుర్తుకొచ్చింది బిపిన్‌కి. అతని చిరునామా తన వద్ద లేదు. అయినా దీనికి రుజువుల అవసరం దేనికి? తాను రాంచీ వెళ్లలేదనేది తనంటత తనకి పూర్తిగా తెలిసిందే కదా!... అంతే! నది నుంచి వస్తున్న చల్లనిగాలి అతనికి కొంత బలాన్ని చేకూర్చింది. అయినా, కొద్దిపాటి అసౌకర్యం బిపిన్‌బాబు మనసులో తారాట్లాడుతోంది. తనను చుట్టుముడుతున్న తీవ్రతలో బిపిన్‌బాబు... ఒక ఆలోచనతో తన పొడవు నిక్కరును పైకి మడిచి కుడి మోకాలును చూసుకున్నాడు. ఒక అంగుళం పొడవున పాతగాయపు గుర్తు కనిపించింది. అదెప్పటిది అనేది చెప్పడం అసంభవం. చిన్నపిల్లవానిగా కిందపడి మోకాలి గాయం చేసుకోవడం ఎప్పుడైనా జరిగిందా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వీలవలేదు. బిపిన్‌బాబు అప్పుడు హఠాత్తుగా దినేష్ ముఖర్జీ గురించి ఆలోచించాడు. ఆ సమయంలో ఆ సమయంలో దినేష్ రాంచీలో ఉన్నాడని ఆ వ్యక్తి చెప్పాడు. అతనిని అడగడమే ఉత్తమమైన రుజువర్తనమవుతుంది. పైగా అతను దగ్గరలోనే బెహినందన్ వీధిలో ఉంటున్నాడు. ఇప్పుడే అతని దగ్గరకు వెళితే ఎలా ఉంటుంది? అయితే, అప్పుడు– వాస్తవానికి తానెప్పుడూ రాంచీ వెళ్లి ఉండకపోతే, బిపిన్‌బాబు దృఢపరచుకోవడానికి అడిగినట్లయితే, దినేష్ ఏవిధంగా ఆలోచిస్తాడు! బహుశా బిపిన్‌బాబు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడనే భావనకు వస్తాడు. లేదు. అతన్నడగడం వెర్రితనం. దయమాలిన దినేష్ తిరస్కార గుణం ఎలా ఉంటుందో తనకు తెలుసు. తన ఏసీ గదిలో కూర్చుని చల్లని ద్రవాన్ని చప్పరించడంతో బిపిన్‌బాబు మళ్లీ నిమ్మళం చేకూరిన అనుభూతిని పొందాడు. ఎంతటి పీకులాట? ఏమీ లేదు... చేయడానికి ఏ పనీ ఉండదు. ఇతరుల జుట్టులో కెలుకుతుంటారు. రాత్రి భోంచేసిన తర్వాత, కొత్తగా తెచ్చిన ఉత్తేజిత నవలల్లో ఒకదాన్ని పట్టుకుని నిమ్మళంగా పడకన చేరాడు. కొత్త అంగడి వీధిలో కలిసిన వ్యక్తిని గురించి మరచిపోయాడు. తర్వాతి రోజు కార్యాలయంలో గడుస్తున్న ప్రతిగంట క్రితంరోజు తాను ఎదుర్కొన్న పరిస్థితి తన మనసును మరీ మరీ ఆక్రమించుకుంటున్నట్లు గమనించాడు. అతను తన గురించిన అంతటి సమాచారం తెలుసుకుని ఉన్నాడు కదా మరి రాంచీ ప్రయాణం గురించి పొరపాటెలా పడ్డాడు. మధ్యాహ్న భోజన వేళకు కొంచెం ముందు దినేష్ ముఖర్జీకి ఫోను చేద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన సందేహాన్ని ఫోను సంభాషణల్లోనే తేల్చుకోవడం ఉత్తమం. కనీసం ముఖంలో కదలాడే కలతన్నా తీరుతుంది. రెండు... మూడు... ఐదు... ఆరు... ఒకటి... ఆరు బిపిన్‌బాబు ఈ అంకెలను నొక్కి ‘‘హలో!.. దినేషేనా?... నేను బిపిన్ని’’ ‘‘మంచిది– బాగుంది!... ఏమిటి సంగతులు!’’ ‘‘1958లో జరిగిన ఒక సంఘటన నీకు గుర్తుంటే, నేను కొంత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నా...’’ ‘‘యాభై ఎనిమిదిలోనా? ఏ సంఘటన?’’ ‘‘ఆ సంవత్సరమంతా నువ్వు కలకత్తాలోనే ఉన్నావా? మొదటగా ఆ సంగతి నాక్కావాలి’’ ‘‘కొద్దిగా... ఒక్క నిమిషం ఆగు...58– కొద్దిగా నా డెయిరీలో పరిశీలించనివ్వు...’’ ఒక్క నిమిషం సేపు అటువైపు నిశ్శబ్దం. బిపిన్‌బాబు తన గుండె కొట్టుకోవడం పెరిగినట్లు భావించాడు. కొద్దిగా చెమట్లు కూడా పట్టాయి. ‘‘హలో!’’ ‘‘చెప్పు’’ ‘‘దొరికింది. నేను రెండుసార్లు బయటకు వెళ్లాను.’’ ‘‘ఎక్కడికి?’’ ‘‘ఒకసారి ఫిబ్రవరిలో దగ్గర్లోని కృష్ణనగర్‌కు మేనల్లుడి పెళ్లికి. తర్వాత... అయితే దీని గురించి నీకు తెలుసునే!– అది రాంచీ ప్రయాణం. నువ్వక్కడున్నావు కూడా.– అంతే! కానీ, ఏమిటిదంతా– ఈ పరిశోధన?’’ ‘‘ఏమీ లేదు. కొద్దిగా సమాచారానికి.– ఏమైనా– ధన్యవాదాలు’’ బిపిన్‌బాబు దడాలున ఫోను పెట్టేసి, తన తలను గట్టిగా చేతులతో పట్టుకున్నాడు. తల ఈదులాడుతున్న భావన– ఒక చలి ఝలక్ తన శరీరమంతా పాకుతున్నట్లనిపించింది. భోజనపు గిన్నెలో రొట్టెముక్కల మధ్య మాంసం పొదిగిన పదార్థాలు ఉన్నాయి. కానీ బిపిన్ వాటిని తినలేదు. ఆకలంతా ఇగిరిపోయింది పూర్తిగా. మధ్యాహ్న భోజన సమయం తర్వాత బిపిన్‌బాబు బల్ల దగ్గర కూర్చుని తాను క్రితంలా యథాశక్తిగా పని నిర్వహించలేనేమోననుకున్నాడు. తాను ఆ సంస్థలో ఉన్న పాతికేళ్లలో ఏనాడూ ఇలా జరగలేదు. అలుపెరుగని, సత్యసంధత కలిగిన పనివానిగా అతనికి కీర్తి ఉంది. కానీ, ఈరోజు అతను అయోమయంలో పడిపోయి, సరైన ఆలోచన చేయలేకపోతున్నాడు. అతను రెండున్నరకి ఇంటికి తిరిగి వచ్చి మంచంపై పడుకుని ప్రశాంతతను కూర్చుకుని నెమ్మది ఆలోచనతో తన బుద్ధి వివేకాలను సమీకరించుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి తెలుసు. తలలో ఏదైనా గాయమైతే ఆ వ్యక్తి జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది. ఎవరో ఒక వ్యక్తి గుర్తుచేసిన ఒకే ఒక సంఘటన తప్ప ప్రతిదీ తనకు గుర్తుంది. సముచితంగా ఈ మధ్యనే జరిగిన ప్రాముఖ్యత కలిగిన ఆ ఒక్కటే... అతనెప్పుడో రాంచీ వెళ్లాలని కోరుకోవడం– వెళ్లడం. అక్కడ పనులు జరపడం... అవి జ్ఞాపకం లేకపోవడం... ఏదైనా పూర్తిగా అసంభవం! ఏడున్నర సమయంలో బిపిన్ సేవకుడు వచ్చి ‘‘అయ్యా! చునీబాబు... చాలా ముఖ్యమైన సంగతట...’’ అంటూ చెప్పాడు. చునీ ఎందుకొచ్చాడో బిపిన్‌బాబుకు తెలుసు. చునీలాల్ బడిలో తనతో ఉండేవాడు. ఈ మధ్య అతని రోజులు బాగాలేవు. అందుకని తరచు తన దగ్గరకు వస్తున్నాడు తనకేదైనా ఉద్యోగం చూడమని. అతని కోసం తానేదైనా చేయడం సంభవం కాదని బిపిన్‌బాబు బాగా ఎరుగును. వాస్తవానికి ఆ విషయం అతనితో కూడా చెప్పాడు. అయినా చునీ చెల్లని కాసులా వస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం చునీని చూడటం తనకు సాధ్యం కాదని, ఇప్పుడే కాదు చాలా వారాల పాటు కుదరదని కబురంపాడు బిపిన్. అయితే, ఆ కబురుతో సేవకుడు గడప దాటిన మరుక్షణంలో బిపిన్‌బాబుకు ఒక ఆలోచన తట్టింది. 1958లో తన రాంచీ ప్రయాణం గురించి చునీకి ఏమైనా గుర్తుండవచ్చునేమోనని. అతన్ని అడగడంలో ఇబ్బంది ఉండదు కదా! తక్షణం బిపిన్‌బాబు హడావుడిగా మెట్లు దిగి కిందనున్న వాడుక గదిలోకి వెళ్లాడు. వెళ్లిపోబోతున్న చునీ బిపిన్ రావడం చూసి ఆశ చిగురించి వెనక్కు తిరిగాడు. బిపిన్‌బాబు డొంకతిరుగుడుకు ఇష్టపడకుండా సూటిగా అడిగాడు ‘‘చూడు చునీ! ఒక విషయం నిన్నడగదలచుకున్నాను. నీకు మంచి జ్ఞాపకశక్తి ఉంది. నువ్వు నన్ను చాలాకాలంగా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నావు. నీ మనసును కేవలం పాత రోజులకు మరల్చి ఆలోచించి చెప్పు. 1958లో నేను రాంచీ వెళ్లానా?’’ చునీ అన్నాడు: ‘‘యాభై ఎనిమిదా? అది యాభై ఎనిమిది అయి ఉంటుంది లేదా యాభై తొమ్మిది’’ ‘‘నేను రాంచీ వెళ్లాననేది నీకు నిశ్చయమేనా?’’ చునీ ఆశ్చర్యంగా చూసిన చూపుతో ఆతృత కలసి ఉంది. ‘‘పోయి ఉండటం గురించి ఏమాత్రమో సందేహాలు ఉన్నాయని భావిస్తున్నావా?’’ ‘‘నేను వెళ్లానా? నీకు స్పష్టంగా గుర్తుందా?’’ చునీ సోఫా మీద కూర్చుని దృఢపరచేలా బిపిన్ వైపు రెప్పలేయని దృష్టి నిలిపి అన్నాడు. ‘‘బిపిన్! మత్తు పదార్థాల్లాంటివేమైనా సేవించావా? నాకు తెలిసినంత వరకు అలాంటి అలవాట్ల విషయంలో నీకు స్వచ్ఛమైన చరిత్ర ఉంది. పాత స్నేహాలు నీకంతగా పట్టవని నాకు తెలుసు. కానీ, కనీసం మంచి జ్ఞాపకశక్తి ఉంది నీకు. రాంచీ ప్రయాణం గురించి నువ్వు మర్చిపోవడమనేది నీకు చిన్నతనమనిపించడం లేదా?’’ చునీ దృష్టి నుంచి బిపిన్‌బాబు వేరేవైపు తిరిగాడు. ‘‘నేను చివర్లో ఏం ఉద్యోగం చేశానో అదయినా గుర్తుందా నీకు?’’ చునీలాల్ అడిగాడు. ‘‘పర్యాటక ఏజెన్సీలో పనిచేశావు కదా!’’ ‘‘పోన్లే అదన్నా గుర్తుంది. కానీ, నీకు రాంచీకి రైలు టికెట్ సిద్ధపరచి తెప్పించింది నేనేననేది నీకు గుర్తులేదు. నిన్ను బండెక్కించి పంపడానికి ప్లాట్‌ఫామ్‌కు వచ్చింది నేనే! బోగీలోని ఫ్యాను పాడైతే ఆ వ్యక్తిని పిలుచుకు వచ్చి బాగుచేయించాను. వీటన్నింటినీ మరచిపోయావా? నీకేమైనా అయిందా? నీ ఒంట్లో బాగున్నట్లుగా కనిపించడం లేదు... అది తెలుసా నీకు?’’ బిపిన్‌బాబు నిట్టూర్చి తల అడ్డంగా ఊపాడు. కొంచెం సేపాగి అన్నాడు: ‘‘నేను చాలా ఎక్కువగా పని చేస్తున్నాను. అదే కారణమై ఉంటుంది. దీని గురించి వైద్య నిపుణుని సంప్రదించాలి.’’ సందేహం లేదు. చునీలాల్ తన ఉద్యోగం గురించి మాట్లాడకుండా వెళ్లిపోవడంతోనే బిపిన్‌కు పరిస్థితి అర్థమవుతోంది. చురుకైన మెరిసే కళ్లు. చక్కగా కొనదేలిన ముక్కుతో యువకుడైన పరేష్చందా వైద్య నిపుణుడు. ఆయన బిపిన్‌బాబు లక్షణాల గురించి వినగానే ఆలోచనలో మునిగాడు. ‘‘చూడండి డాక్టర్ చందా! ఈ దారుణమైన రుగ్మత నుంచి నాకు మీరు స్వస్థత చేకూర్చాలి. ఇది నా పని బాధ్యతలపై ఎంతగా ప్రభావం చూపిస్తోందో మీకు చెప్పలేను.’’ డాక్టర్ చందా తలను అడ్డంగా ఊపి అన్నాడు ‘‘మీకేమన్నా అర్థమవుతుందా మిస్టర్ చౌధురి! మీ రుగ్మత వంటి వ్యవహారాన్ని నేనింత వరకు చూడలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నా అనుభవ పరిధిని దాటి కనిపిస్తోంది. అయితే నేనొక సూచన చేస్తాను. అదెంతవరకు పనిచేస్తుందో నేను చెప్పలేను. కానీ, అదొక మంచి ప్రయత్నం, హానికరం కాదు.’’ బిపిన్‌బాబు ఆరాటంగా ముందుకు వంగాడు. డాక్టర్ చందా చెబుతున్నాడు ‘‘నేననుకున్నదాని ప్రకారం మీరు రాంచీ వెళ్లి ఉంటారు. కానీ, ఏదో అవగాహనకు రాని కారణాల వల్ల ఆ కథన భాగం మీ మెదడు పొరలలోంచి తప్పుకుంది. దీనికిప్పుడు నా సూచన ఏమిటంటే, మీరు మళ్లీ ఒకసారి రాంచీ వెళ్లండి. మీరు ఆ ప్రదేశాలను చూస్తున్నప్పుడు మీ గత ప్రయాణం గుర్తు రావచ్చు. ఇది అసంభవమేమీ కాదు. నరాల సంబంధంగా ఉపశమనానికి నేనో మందు ఇస్తాను. నిద్ర చాలా ముఖ్యం. లేదా లక్షణాలు ఎక్కువయ్యే అవకాశాలుంటాయి.’’ మర్నాటి ఉదయం బిపిన్‌బాబుకు కొంతవరకు నెమ్మదించినట్లు అనిపించింది. ఉదయం టిఫిన్ చేశాక ఆఫీసుకు ఫోన్ చేసి, కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసి, తర్వాత అదేరోజు సాయంత్రం రాంచీ ప్రయాణం కోసం మొదటి తరగతి టికెట్ ఏర్పాటు చేసుకున్నాడు. రెండోరోజు ఉదయం రాంచీలో బండి దిగి, గతంలో తాను ఏనాడూ అక్కడికి వచ్చి ఉండలేదని రూఢి చేసుకున్నాడు. అతను స్టేషన్ బయటకు వచ్చి, బాడుగ కారు తీసుకుని, తనే నడుపుకుంటూ కొంచెంసేపు పట్టణాన్ని చుట్టి వచ్చాడు. ఆ వీధులు, కట్టడాలు, ఫలహార భోజనశాలలు, వ్యాపార స్థలాలు, మోరాబాడీ కొండ ఏ ఒక్కటీ తనకే మాత్రం పరిచయం కలిగినది కాదని రూఢి చేసుకున్నాడు. హుద్రూ జలపాతాల వద్దకు వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందా! తనకా నమ్మకం లేదు. కానీ, అదే సమయంలో తాను తగినంత ప్రయత్నం చేయకుండా వదిలేశాననే శంక లేకుండా చేయాలనుకున్నాడు. సాయంత్రం ఒక కారును ఏర్పాటు చేసుకుని హుద్రూకు వెళ్లాడు. అదే సాయంకాలం ఐదుగంటలకు ఒక వనభోజనాల బృందంలోని ఇద్దరు గుజరాతీలు బిపిన్‌బాబు ఒక పెద్ద బండరాయి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. అతను తిరిగి స్పృహలోకి వచ్చాక అతను అన్నది ‘‘నేను అయిపోయాను. ఇంకే ఆశా మిగల్లేదు’’ అని. తర్వాతి ఉదయానికి బిపిన్‌బాబు తిరిగి కలకత్తా వచ్చాడు. నిజానికి తనకేమాత్రం ఆశ మిగల్లేదనే నిశ్చయానికొచ్చాడు. ‘త్వరలో పనిమీద ఇచ్ఛ, నమ్మకం, సామర్థ్యం, ఆలోచన నియంత్రణ అన్నీ కోల్పోతాను. నేను... నా జీవితం శరణాలయంలో ముగిసిపోతుందా?’’ బిపిన్‌బాబు ఇక ఆపై ఆలోచించలేకపోయాడు. తిరిగి ఇంటికి చేరి, డాక్టర్ చందాకు ఫోన్‌చేసి ఇంటికి రమ్మని కోరాడు. తర్వాత తలస్నానం చేసి, తలకు ఐస్‌బ్యాగ్ బిగించుకుని పడుకున్నాడు. అదే సమయంలో సేవకుడు వచ్చి లెటర్బాక్సులో ఎవరో ఉంచారని చెప్పి ఒక ఉత్తరం తెచ్చిచ్చాడు. ఆకుపచ్చని కవరుపై ఎర్రసిరాతో తనపేర రాయబడి ఉందది. పేరు పైభాగంలో ‘‘అత్యవసరం– ఆంతరంగికం’’ అని రాసి ఉంది. తన ప్రస్తుత స్థితి బాగాలేకపోయినా బిపిన్ బాబు ఆ ఉత్తరం చదివి తీరాల్సిందిగా భావించాడు. కవరును ఒకవైపు చించి ఉత్తరం బయటకు తీశాడు. అందులో ఇలా ఉంది. ‘‘ప్రియమైన బిపిన్! ఐశ్వర్యం నీలో ఈ విధమైన మార్పు తెస్తుందని నేననుకోలేకపోయాను. నువ్వు మారిపోయావు. అదృష్టం జారిపోయిన ఒక పూర్వమిత్రునికి సహాయం చేయడం నీకంతటి కష్టతరమా? నాకు డబ్బులేదు. అలా నా సంపాదన వనరులు పరిమితమైపోయాయి. ఇక నాకున్న ఆలోచనేమిటి? అందులో భాగంగానే దయాదాక్షిణ్యాలు లేని నీ ప్రవర్తనకు ప్రాయశ్చిత్తం కలిగించే ఒక మార్గం ఎన్నుకున్నాను. కొత్త అంగడి వీధిలో నీకెదురైన వ్యక్తి మా పొరుగింటివాడు. నాకు పరిచయస్తుడు. సామర్థ్యమున్న నటుడు. అందుకే, నేనతనికి రాసిచ్చినదంతా అవగాహనతో నటించగలిగాడు. ఇక, దినేష్ ముఖర్జీ.. తానేనాడూ, ముఖ్యంగా నీ పట్ల సదుద్దేశం, స్నేహం కలిగినవాడు కాదు. అందుకే ఈ విషయంలో నాకు సహాయపడటానికి పూర్తి అంగీకారం ఇచ్చాడు. నీ మోకాలి మచ్చ విషయానికొస్తే, 1939లో చాంద్పాల్ ఘాట్‌లో నువ్వు ఒక తాడు నుంచి జారిపడ్డప్పటిదని ఇప్పుడు నువ్వు కచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటావు. సరే, ఇక ఇప్పుడు నువ్వు తిరిగి స్వస్థత పొందుతావు. నేను రాసిన ఒక నవలను ముద్రించడానికి ఒక ప్రచురణకర్త అంగీకరించాడు. అతను గనుక నాకు తగినట్లుగా ఇష్టపడినట్లయితే, అదే చాలు– రాబోయే కొద్ది నెలల్లో అదే నన్ను కాపాడుతుంది. నీ చునీలాల్’’ భారతీయ ఆంగ్ల మూలం : సత్యజిత్ రాయ్ అనువాదం: సుంకర కోటేశ్వరరావు -
సేన్, రేల మధ్య వైరుధ్య బంధం
సాక్షి, న్యూఢిల్లీ : ‘కళాత్మక చిత్రాలు తీస్తామని చెప్పుకునే వారందరికి విదేశాల్లో జరిగే చలన చిత్రోత్సవాల్లో పొల్గొనాలనే ధ్యాస తప్పించి, భారత ప్రేక్షకులను ఆకర్షించాలనే దృష్టి లేదు. కథ ఎలా చెప్పాలో తెల్సిన మృణాల్ సేన్ కూడా వారిలో ఒకరే’ అని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్ రాయ్ రాసిన ఓ లేఖలోని వ్యాఖ్యలివి. మృణాల్ సేన్ తీసిన దాదాపు అన్ని సినిమాల గురించి విమర్శనాత్మక దృక్పథంతోనే మాట్లాడిన సత్యజిత్ రే ఆయన్ని విమర్శిస్తూ ప్రముఖ సినీ విమర్శకుడు చిదానంత గుప్తాకు (1991, జూన్‌లో) రాసిన ఆఖరి లేఖలోనిది ఈ వ్యాఖ్య. ఈ లేఖ ప్రతిని ఓ జాతీయ పత్రిక 1991, అక్టోబర్‌లో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలను చూసిన మృణాల్ సేన్ బాగా నొచ్చుకున్నారు. అప్పటికే సత్యజిత్ రే ఆస్పత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నారు. సినీ పాత్రికేయ లోకం మృణాల్ సేన్‌ను చుట్టుముట్టి, సత్యజిత్ రే చేసిన విమర్శలపై స్పందించాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సత్యజిత్ రే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఆయన ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన వేలకు మందులు తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. అందుకని కళాత్మక విలువల గురించి. సినీ కళ గురించి నేనిప్పుడు చర్చించ దల్చుకోలేదు’ అని సేన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆశించినట్లు సత్యజిత్ రే కోలుకోకుండా 1992, ఏప్రిల్ 23వ తేదీన కన్నుమూశారు. రే ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి ఆయన దహన సంస్కారాల వరకు మృణాల్ సేన్, రే కుటుంబం వెన్నంటే ఉన్నారు. అయితే అన్ని రోజులూ ఆయన కళ్లలో వెలుగు కోల్పోయిన ఛాయలే కనిపించాయి. సత్యజిత్ రే విమర్శలకు మృణాల్ సేన్ నొచ్చుకోవడం అదే మొదటి సారి కాదు. 1965లో ఆయన తీసిన ‘ఆకాశ్ కుసమ్’ నుంచి 1969లో హిందీలో తీసిన తొలి చిత్రం ‘భువన్ షోమ్’ (కరీర్లో 9వ చిత్రం) మొదలుకొని దాదాపు అన్ని చిత్రాలపై సత్యజిత్ విమర్శలు చేశారు. తెలుగులో తీసిన ‘ఒక ఊరి కథ’తోపాటు ఒకటి రెండు హిందీ చిత్రాలను మెచ్చుకున్నారు. కేవలం రెండు లక్షల రూపాయలను మాత్రమే వెచ్చించి తీసిన హిందీ చిత్రం ‘భువన్ షోమ్’ సినీ విమర్శకులనే కాకుండా కమర్షియల్‌గా కూడా ఎంతో హిట్టయింది. కొత్త తరంగ చిత్రంగా సినీ విమర్శకులు దాన్ని కొనియాడగా, ఆ అందులో ఏముందీ, ప్రేక్షకులకు ఆకట్టుకునే కొన్ని పాపులర్ టెక్నిక్‌లు తప్ప అని సత్యజిత్ రే విమర్శించారు. ‘ఏ బిగ్ బ్యాడ్ బ్యూరోక్రట్ రిఫామ్డ్ బై రస్టిక్ బెల్లి’ అంటూ వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయా ట్రూఫాట్ చిత్రాల స్ఫూర్తితో మృణాల్ సేన్, సౌమిత్ర ఛటర్జీ, అపర్ణా సేన్ జంటగా ‘ఆకాశ్ కుసమ్’ చిత్రాన్ని తీశారు. ఈ చిత్రంతోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలయింది. నాడు ‘స్టేట్స్‌మేన్’ పత్రిక ఈ సినిమాపై బహిరంగ చర్చను నిర్వహించింది. సినీ విమర్శకులు కొందరు సేన్ వైపు నిలువగా, మరికొందరు రే వైపు వ్యాఖ్యానాలు చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానగా మారడంతో 1965, సెప్టెంబర్ 13వ తేదీన చర్చను నిలిపివేస్తున్నట్లు స్టేట్స్‌మేన్ పత్రిక ప్రకటించింది. రే చేసిన దాదాపు అన్ని విమర్శలకు సేన్ సమాధానం ఇచ్చినా రే అంత ఘాటుగా ఎప్పుడు స్పందించలేదు. రే తీసిన ‘పథేర్ పాంచాలి’, అపరాజిత సిరీస్ చిత్రాలను ప్రశంసించిన మృణాల్ సేన్ ‘పరాస్ పత్తర్’ చిత్రాన్ని తీవ్రంగానే విమర్శించారు. ఈ ఇరువురు మహా దర్శకులు వర్తమాన జీవన వైరుధ్యాలపై తమదైన దృక్పథంతో సినిమాలు తీసి సామాజిక ప్రయోజనానికి దోహదపడ్డారు. వీరిద్దరు తీసిన ‘పునస్క–మహానగర్, ప్రతివాండీ–ఇంటర్వ్యూ, బైషే శ్రావణ–ఆశని సంకేత్, కోరస్–హీరక్ రాజర్ దిశే’ చిత్రాల్లో కథాంశం దాదాపు ఒకటే అయినా భిన్న కోణాలు కల్పిస్తాయి. ఒకప్పుడు మంచి మిత్రులే ఒడ్డూ, పొడువు, ఛామన ఛాయలో ఒకే తీరుగా కనిపించే మృణాల్ సేన్, సత్జిత్ రేలు చర్చా వేదికలపై ఒకరినొకరు విమర్శించుకుంటూ గంభీరంగానే కనిపించేవారు. అంతకుముందు వారు చాలా సన్నిహిత మిత్రలు. చాప్లిన్ మీద మృణాల్ సేన్ రాసిన పుస్తకం కవర్ పేజీని సత్యజిత్ రే స్వయంగా డిజైన్ చేశారు. లేక్ టెంపుల్ రోడ్డులోని సత్యజిత్ రే ఫ్లాట్‌కు సేన్ తరచూ వెళ్లి గంటల తరబడి సినిమా ముచ్చట్లు పెట్టేవారు. భిన్నత్వంలో ఏకత్వంలా వైరుధ్యంలో ఏకత్వంగా వారి మధ్య మిత్రత్వం ఉండేది. రే జ్ఙాపకాలతో మృణాల్ సేన్ నిన్న, అంటే ఆదివారం లోకం విడిచి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. -
సత్యజిత్రేలా ఉంది!
తమిళసినిమా: సత్యజిత్‌రే చిత్రం చూస్తున్నట్లు అనిపించిందని ఎండీఎంకే నేత వైగో ఒరు కుప్పై కథైపై ప్రశంసల వర్షం కురిపించారు. నవ దర్శకుడు కాళీ రంగస్వామి దర్శకత్వంలో అస్లామ్ నిర్మించిన చిత్రం ఒరు కుప్పై కథై. నృత్య దర్శకుడు దినేశ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించింది. గత వారం తెరపైకి వచ్చిన ఒరు కుప్పై కథై చిత్రాన్ని ఎండీఎంకే నేత వైగో ఇటీవల తిలకించారు. అనంతరం ఆయన చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఒరు కుప్పై కథై చిత్రాన్ని అందరూ, ముఖ్యంగా మహిళలు చూడాలన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడడం, వివాహేతర సంబంధం కారణంగా భార్య హత్య, ఈ కాలంలో భర్తను కొట్టి చంపిన భార్య లాంటి వార్తలు చదువుతుంటే వేదన కలుగుతోందన్నారు. 50 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదన్నారు. సాయం చేయడమే ఎరిగిన దేశం మనదన్నారు. ఈ సమాజంలో బయట పడని అంతరంగ ఆపదలు ఎలా జరుగుతున్నాయన్నది ఎక్కడా అసహనానికి గురి కాకుండా ఒరు కుప్పై కథై చిత్రంలో దర్శకుడు కాళీ రంగస్వామి అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా ఆయన చాలా మంచి సందేశాన్ని చెప్పారన్నారు. మనం సమాజంలో సంసార జీవితాన్ని ఎలా సాగించాలి, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అన్న విషయాలను చక్కగా చెప్పారన్నారు. భర్త ధనవంతుడైనా సమాజంలోని పరిస్థితుల గురించి అవగాహన లేకుంటే ఎంత కష్టం అన్ని విషయాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు కాళీ రంగస్వామి ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం అన్నారు. చిత్రంలో నటీనటులు నటించలేదని, పాత్రకు ప్రాణం పోశారని అన్నారు. ఈ చిత్రంలో చూపించిన ప్రాంతాలను చూసి ఏంటి ఇలా ఉంది అని తొలుత అనిపించినా నిజానికి అదే జీవితం. అయితే మరో జీవితం కూడా చిత్రంలో చూపించారు. నక్షత్ర హోటళ్లు, ఆడంబర జీవితాలు ఉంటాయన్నారు. అయితే మురికి వాడలు, అక్కడి ప్రజల జీవితాలు ఉన్నయే అవే వాస్తవం అన్నారు. దర్శకుడు సత్యజిత్‌రే తన చిత్రాల్లో ఇలాంటి విషయాలను తెరపై ఆవిష్కరించే పలు అవార్డులను అందుకున్నారన్నారు. ఈ ఒరు కుప్పైకథైకి అవార్డులు రాకపోయినా ప్రజలు చూసి ఆదరించాలన్నారు. -
నా ప్రతీ సినిమా కాపీనే: షూజిత్ సర్కార్
షూజిత్ సర్కార్.. ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు.. సాధారణంగా కమర్షియల్ దర్శకులు కొన్ని కథల జోలికి వెళ్లడానికి కూడా భయపడతారు. అలాంటి కథలతో సంచలనాలు సృష్టించే ఈ దర్శకుడు.. తాజాగా సంచలనాత్మక కామెంట్లతో వార్తల్లో నిలిచాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింట్‌ను కాపీ చేస్తానంటూ చెప్పిన షూజిత్.. ఆ విషయం మాత్రం సాధారణ ప్రేక్షకులకు అర్ధం కాకుండా జాగ్రత్త పడతానన్నాడు. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలి' సినిమా విడుదలై 60 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న షూజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాయింటును 'పథేర్ పాంచాలి' స్ఫూర్తితోనే తెరకెక్కిస్తానని, నిజానికి రే తీసిన ప్రతి సినిమా భారతీయ సినీ పరిశ్రమకు బైబిల్ లాంటిదని అన్నాడు. మద్రాస్ కేఫ్, విక్కీ డోనార్, పికు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన షూజిత్ సర్కార్ ప్రస్తుతం అమితాబ్ ప్రధానపాత్రలో ఓ డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు మరో రెండు సినిమాలను ప్రకటించి.. వాటికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. -
మరోసారి ‘పథేర్ పాంచాలి’
భారతదేశం గ ర్వించదగ్గ దర్శకుల్లో సత్యజిత్ రే ఒకరు. ఆయన తీసిన తొలి సినిమా ‘పథేర్ పాంచాలి’ ఏకంగా 11 అంతర్జాతీయ అవార్డులను సాధించడంతో పాటు 1956లో జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లో ‘మానవ జీవితాన్ని తెరకెక్కిం చిన ఉత్తమ సెల్యులాయిడ్ డాక్యుమెంట్’గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. మే రెండోవారం నుంచి జరగనున్న కాన్స్ చిత్రోత్సవాల్లో ‘క్లాసిక్ చిత్రాల’ విభాగంలో ఈ చిత్రాన్ని మళ్లీ ప్రదర్శించనున్నారు. అలాగే ఈ సినిమాతో పాటు సత్యజిత్ రే రూపొందించిన మరో రెండు చిత్రాలు ‘అపరాజితో’, ‘అపూర్ సంసార్’లను న్యూయార్క్‌లో విడుదల చేస్తున్నారు. నిజానికి, 1993లో లండన్‌లో జరిగిన ప్రమాదంలో ఈ చిత్రాల నెగెటివ్‌లు పాడయ్యాయి. నిపుణులు చేసిన కృషి వల్ల ఈ చిత్రాలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. -
చాంద్ స.. రోషన్ చెహరా..
హైదరాబాదీ: షర్మిలా టాగోర్.. సత్యజిత్ రే ఆమెను పరిచయం చేయకపోయి ఉంటే, వెండితెర కచ్చితంగా ఒక వెలుగును కోల్పోయి ఉండేది. ఇటు బాలీవుడ్‌ను, అటు బెంగాలీ చిత్రసీమను వెలిగించిన ఆ వెలుగు పేరు షర్మిలా టాగోర్. ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే. అప్పట్లో ఆమె తండ్రి గీతీంద్రనాథ్ టాగోర్ ఈస్టిండియా కంపెనీ యాజమాన్యంలోని ఎల్గిన్ మిల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసేవారు. గీతీంద్రనాథ్ తాత గగనేంద్రనాథ్ టాగోర్ సుప్రసిద్ధ పెయింటర్. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్‌కు సమీప బంధువు కూడా. విద్యావంతుల కుటుంబంలో పుట్టిన షర్మిలను సినీరంగంలోకి పంపడం ఆమె తల్లిదండ్రులకు పెద్దగా ఇష్టం లేదు. అయితే, సత్యజిత్ రే స్వయంగా అడగడంతో కాదనలేకపోయారు. అలా షర్మిలా పదిహేనేళ్ల ప్రాయంలోనే తెరంగేట్రం చేసింది. సత్యజిత్ రే బెంగాలీలో రూపొందించిన ‘అపూర్ సంసార్’ ఆమె తొలి చిత్రం. వరుసగా నాలుగు బెంగాలీ చిత్రాలు చేశాక, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. వైవిధ్యభరితమైన కథానాయికగా దాదాపు రెండు దశాబ్దాలు బాలీవుడ్‌ను ఏలింది. నాటి తరానికి చెందిన దాదాపు అందరు హీరోల సరసనా నటించింది. ఉద్దండ దర్శకులందరి దర్శకత్వంలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది. సప్నోంకీ రానీ... ‘ఆరాధన’ చిత్రంలో ‘మేరే సప్నోంకీ రానీ...’ అంటూ రాజేశ్ ఖన్నా హుషారుగా జీపులో రైలును వెంబడిస్తుంటే, రైలులో పుస్తకం చదువుకుంటూ మధ్య మధ్య ఓరచూపులు విసిరే షర్మిలా నటనకు నాటి యువతరం ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. శక్తి సామంతా దర్శకత్వంలో 1969లో విడుదలైన ఈ చిత్రం షర్మిలాకు ఉత్తమ నటిగా ‘ఫిలింఫేర్’ అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఆరాధన’ విడుదలకు ఐదేళ్ల ముందే ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టింది. హిందీలో ఆమె తొలిచిత్రం... శక్తి సామంతా దర్శకత్వంలోని ‘కాశ్మీర్ కీ కలీ’. అందులో షమ్మీకపూర్ సరసన నటించి, అందరినీ ఆకట్టుకుంది. ‘యే చాంద్ స రోషన్ చెహరా...’ అంటూ షమ్మీకపూర్ మెలికలు తిరుగుతూ ముసిముసి నవ్వుల షర్మిలాను ‘తారీఫ్’ చేస్తే, ప్రేక్షకులూ ఆమెను తారీఫ్ చేశారు. అయితే, ‘ఆరాధన’ తర్వాతే ఆమె కెరీర్ ఊపందుకుంది. శక్తి సామంతా దర్శకత్వంలోనే ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్’లో టూ పీస్ బికినీతో తెరపై కనిపించి, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది. ఒక భారతీయ నటి టూ పీస్ బికినీతో తెరపై కనిపించడం అదే తొలిసారి. ఆమె బికినీ ఫొటోను ‘ఫిలింఫేర్’ కవర్‌పేజీపై ముద్రించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు నటనకు ఆస్కారం ఉన్న ఉదాత్త పాత్రల్లోనూ రాణించింది. సినీ కెరీర్ ఊపందుకుంటున్న దశలోనే భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని 1969లో పెళ్లాడింది. మతం మారి, బేగం ఆయేషా సుల్తానాగా పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు గ్లామర్ తగ్గి, తెరమరుగవుతారు. షర్మిలా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. పెళ్లి తర్వాత చాలా సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ‘అమానుష్’, ‘అమర్‌ప్రేమ్’, ‘మౌసమ్’, ‘సఫర్’ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల మన్ననలు పొందింది. ‘మౌసమ్’ చిత్రంలో నటనకు ఉత్తమనటిగా 1976లో జాతీయ అవార్డు సాధించింది. భారత ప్రభుత్వం గత ఏడాది ఆమెకు ‘పద్మభూషణ్’ అవార్డు ఇచ్చింది. సెన్సార్‌బోర్డు చైర్‌పర్సన్‌గా, యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా సేవలందించిన షర్మిలా టాగోర్, ఇప్పటికీ వయసుకు తగిన పాత్రల్లో రాణిస్తోంది. ఆమె కొడుకు సైఫ్ అలీఖాన్, కూతురు సోహా అలీఖాన్ సినీ రంగంలో రాణిస్తున్నారు. మరో కూతురు సాబా అలీఖాన్ జ్యుయలరీ డిజైనర్‌గా కొనసాగుతోంది. ‘పారో’ పాత్ర... నెరవేరని కల ఎన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినా, ‘పారో’ పాత్ర చేయలేకపోవడాన్ని షర్మిలా ఇప్పటికీ తీరని లోటుగానే భావిస్తుంది. ఆమె కెరీర్ ఉజ్వలంగా వెలుగుతున్న కాలంలో ‘దేవదాస్’ సినిమాను మళ్లీ తెరకెక్కించాలని దర్శక, రచయిత గుల్జార్ సంకల్పించాడు. ధర్మేంద్రను దేవదాసుగా, షర్మిలాను పారోగా (పార్వతి), హేమమాలినిని ‘చంద్రముఖి’గా పెట్టి తీయాలనుకున్నాడు. ఎందువల్లనో అది కార్యరూపం దాల్చలేదు. ‘పారో’ పాత్ర షర్మిలాకు నెరవేరని కలగానే మిగిలిపోయింది. - పన్యాల జగన్నాథదాసు -
దాహపు మనిషి
సత్వం: గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా సంపూర్ణం కాదు. భారతీయ సినిమాకు ముఖంగా పాశ్చాత్యులు పరిగణించే సత్యజిత్ రే మీద ఒక విమర్శ ఏమిటంటే, రే ప్రధాన ప్రేక్షకులు భారతీయేతరులే! కానీ గురుదత్ అలాకాదు. మౌఖిక సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేశాడు. భారతీయ సినిమా తనకంటూ రూపొందించుకున్న నిర్దిష్టరూపాన్ని పాటిస్తూనే, సారంలో ఉన్నతిని ప్రదర్శించాడు. కెమెరాను స్వీయ వ్యక్తీకరణకు వాడుకున్నాడు. వసంతకుమార్ శివశంకర్ పదుకోణెగా బెంగళూరులో జన్మించాడు గురుదత్. పూర్తి దక్షిణాదివాడు. పేరు మార్చుకునేలా చేసింది ఆయన ఇష్టంగా పీల్చిన బెంగాలీ గాలి! ఆయన సినిమాల్లో కూడా మార్మికత, అస్పష్టత లాంటి వంగతనం కనబడేది అందుకే! ఒక కథ తట్టగానే అందులో లీనమవడం, అది ఉత్సాహమివ్వడం మానేయగానే దాన్ని వదిలేసి మరో కొత్తదాన్లో పడిపోవడం గురుదత్ స్వభావమట! పిల్లాడు బొమ్మను పొందేదాకా చాలా ముఖ్యమైందన్నంత పట్టింపు కనబరిచి, తీరా చేతిలోకొచ్చాక అటూయిటూ తిప్పి కిందపడేస్తాడు కదా, అలా ఉండేదట గురు శైలి. ఏ సన్నివేశమూ ఆయనకు ఒకపట్టాన నచ్చేది కాదు. ‘ఏక్ ఔర్, ఇంకోటి, ఇంకోటి,’ అంటూ తీస్తూపోయేవాడు. మరింత మెరుగైనది ముందుందని నమ్మేవాడు. ‘ప్యాసా’లోని ఒక సన్నివేశానికైతే 104 టేక్స్ చేశామని గురుదత్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి అంటారు. అందుకే, నిర్మాతలను విసిగించలేకే తొలిహిట్లతో కూడబెట్టిన డబ్బుతో స్వయంగా నిర్మాణానికి పూనుకున్నాడు గురుదత్. ఈ సన్నివేశానికి సిద్ధమవుతూ కూడా, తరువాయి సన్నివేశం గురించి ఆలోచించేవాడట గురుదత్. సృజనాత్మక మెదడు ఎప్పుడూ ఖాళీగా ఉండనట్టుగా, ఏదో లోకంలో ఉండేవాడు. ‘పిలవగానే ఒక్కసారిగా మేల్కొన్నట్టుగా అందులోంచి బయటకు వచ్చేవాడు’.‘ప్యాసా’లో నిజానికి దిలీప్‌కుమార్ నటించాల్సింది! కానీ పారితోషికం విషయంలో వచ్చిన చిక్కులవల్ల తానే ఆ ‘కవి’ పాత్రను పోషించేందుకు సిద్ధపడ్డాడు గురుదత్. అది క్లాసిక్‌గా నిలవడానికి అదీ ఒక కారణమంటారు విమర్శకులు. ఏ దర్శకుడైనా తన జీవితంలో ఉన్నది సినిమాలో కలపకుండా ఉండడు. మెరుగుల ప్రపంచంలో నిలబడలేని తనలాంటి సున్నితమైన దర్శకుడి జీవితాన్నే ‘కాగజ్ కె ఫూల్’లో పాక్షికంగానైనా తెరకెక్కించడం గురుదత్‌కే చెల్లింది. అయితే, చిత్రంగా కాగజ్ కె ఫూల్‌ను అప్పటి ప్రేక్షకులు తిప్పికొట్టారు. తెరమీదకు రాళ్లు విసిరారు. రచ్చ గెలిచాకే, ఇంట్లోనూ హారతి పట్టడం మొదలైంది. కానీ గురుదత్ మనసు తీవ్రంగా గాయపడింది. ఒకటి మాత్రం నిజం. ప్రేక్షకుల ప్రమాణం పాక్షికమే! కాలమే సిసలైన నిర్ణేత. రాళ్లు వేయించుకోవడానికి ‘సిద్ధపడ్డవాడి’కే కాలం పూలు జల్లుతుంది, తన పరీక్ష తాను పెట్టి! ‘పరిశ్రమకు కొత్తగా వచ్చినవాళ్లకు ఆయన మంచి దర్శకుడు. కొత్తవాళ్ల పరిమితుల్ని అర్థంచేసుకుని, వాటిని పరిష్కరించేవారు,’ అంటారు దత్ ఆస్థాన నటి వహీదా రెహమాన్. అంత జీవితాన్ని చూశాక కూడా, ఆయన తన సమస్యల్ని పరిష్కరించుకోలేకపోవడం విధి వైచిత్రి! జానీ వాకర్‌తో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వి.కె.మూర్తితో దోశ, భేల్పూరి తినడానికి పోయేవాడు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు. మితం లేకుండా మద్యం తాగేవాడు. అటు భార్య గీతాదత్తో సర్దుబాటు కాలేక, ఇటు వహీదాతో కొత్త జీవితంలోకి అడుగిడలేక నలిగిపోయాడు. (భర్తను భరించలేక) భార్య పిల్లల్తో సహా దూరమైపోవడం, వహీదా వేరే దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించుకోవడం, కొత్తగా జతచేరిన ఆర్థిక ఇబ్బందులు... అప్పటికే సొంతిల్లు అమ్మాడు. అద్దింట్లోకి మారాడు. ‘నేను అనాథను అయ్యాను. ఇంట్లోవాళ్లు లేరు. నువ్వు(వి.కె.మూర్తి) బెంగుళూరు వెళ్లిపోతున్నావు, అబ్రార్ (అల్వీ-గురుదత్ ఆస్థాన రచయిత) ఇంకో సినిమా రాయడానికి మద్రాసు వెళ్తున్నాడు, నేను ఏం చేయను?’ అన్నాడట, చివరిసారి తనను కలిసిన మిత్రులతో. ‘చూడు, నేను దర్శకుడిని కావాలనుకున్నాను, దర్శకుడిని అయ్యాను; నటుణ్ని కావాలనుకున్నాను, నటుణ్నయ్యాను; మంచి పిక్చర్లు తీయాలనుకున్నాను, మంచివి తీశాను. పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా నా దగ్గర ఏమీలేదు,’ అనుకునేంత నిరాశలోకి కూరుకుపోయాడు. 39వ ఏట తనను తానే హత్య చేసుకున్నాడు. ‘యార్, జీవితంలో ఉన్నవేమిటి? రెండే రెండు విషయాలు... విజయం, పరాజయం. వీటికి మధ్యన ఏదీలేదు,’ అన్నాడో సందర్భంలో గురుదత్. ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాడుగానీ జీవితంలో ఫెయిల్ అయ్యాడంటారు. కానీ ఆయనకు జీవితమే సినిమా అయినప్పుడు, జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని అనగలమా! -
రే సాబ్తో చేయలేకపోయా..
ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేతో పనిచేయలేకపోయినందుకు చాలా బాధగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎ వెన్స్డే, సర్ఫ్రోష్, మాన్సూన్ వెడ్డింగ్, ఇక్బాల్ తదితర సినిమాల ద్వారా నజీరుద్దీన్ మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కేతన్ మెహతా సినిమా ‘మిర్చి మసాలా’లో తన నటనను చూసి రేసాబ్ మెచ్చుకున్నారని నసీరుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘కాశీ కథ’ అనే బెంగాలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినిమాలో ఏదైనా పాత్ర ఇప్పించాలని చాలాసార్లు రే సాబ్‌కు ఉత్తరం రాద్దామని అనుకుని ఎందుకనో రాయలేకపోయానన్నారు. కాని అటువంటి అద్భుతమైన దర్శకుడితో పనిచేయలేకపోయినందుకు ఇప్పుడు దానికి పశ్ఛాత్తాపం పడుతున్నానన్నారు. తాను మొదటిసారి సత్యజిత్ రేను కలిసిన ఘటనను షా గుర్తుచేసుకున్నాడు. తనకు 22 యేళ్ల వయసులో మ్యాక్స్ ముల్లర్ భవన్లో బెర్గ్మెన్ సినిమా ‘సెలైన్స్’ను చూశానని, ఆ సమయంలో మానిక్‌దా (సత్యజిత్ రే) కూడా తన తో పాటు సినిమా చూశారని చెప్పాడు. ఆ సమయంలో ఆయన పోలీస్ అధికారి స్టైల్లో నెత్తిపై టోపీ పెట్టుకుని తన ముందు సీటులో కూర్చుని ఉండటంతో తనకు సినిమా సరిగ కనిపించలేదని చెప్పాడు. కాగా, రెండేళ్ల కిందట రిభూ దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన మైఖేల్‌లో నసీరుద్దీన్ నటించినా అది ఇప్పటివరకు విడుదల కాలేదు. జుధాజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాశీ కథ’ సినిమాలో నసీరుద్దీన్ షా ఒక కసాయి పాత్రలో కనిపించనున్నాడు. తాను ఇంతవరకు ఆ సినిమా చూడలేదని, అయితే సినిమా చాలా బాగుంటుందని చెప్పగలనన్నారు. ఈ సినిమాలో కాశీ పాత్ర సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా ఈ సినిమాలో కాశీ పాత్రధారి ఒక మేకతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యానిమేటెడ్ మేక పాత్రకు ప్రముఖ బెంగాలీ కమెడియన్, క్యారెక్టర్ నటుడు కాంచన్ మల్లిక్ డబ్బింగ్ చెప్పడం విశేషం.