బిపిన్‌ చౌధురి జ్ఞాపకశక్తి పోయిందా..? | Sunday Special Story By Sunkara Koteswar rao In Funday | Sakshi
Sakshi News home page

బిపిన్‌ చౌధురి జ్ఞాపకశక్తి పోయిందా..?

Published Sun, Mar 8 2020 12:12 PM | Last Updated on Sun, Mar 8 2020 12:17 PM

Sunday Special Story By Sunkara Koteswar rao In Funday  - Sakshi

బిపిన్‌ చౌధురి ప్రతి సోమవారంనాడు తన కార్యాలయం నుంచి తిరిగి వచ్చేదారిలో కొత్త అంగడి వీధిలో ఉన్న కాళీచరణ్‌ దుకాణంలోకి పుస్తకాలను కొనడానికి వెళ్తుంటాడు. నేర సంబంధ కథలు, దయ్యాల కథలు, ఇంకా గుండెలు ఝల్లుమనేలా భయపెట్టేవి. వారం అంతా గడిచిపోయేలా అతను ఒకేసారి ఐదు పుస్తకాలను కొంటాడు. బిపిన్‌బాబు ఒంటరిగా ఉంటాడు. అతనికి కొద్దిమంది మిత్రులున్నారు. ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేయడం ఆయనకిష్టం ఉండదు. ఈ దినం కాళీచరణ్‌ దుకాణంలో అతనికి తననెవరో దగ్గరగా పరిశీలనగా గమనిస్తున్నట్లు అనుభూతి కలిగింది. తను వెనక్కి తిరిగి ఒక గుండ్రని ముఖం కలిగి, సాత్వికంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని... తానతన్ని చూడగానే అతని ముఖంపైన చిరునవ్వు కదలడంతో– అతనేనని తనంటత తానే అర్థం చేసుకున్నాడు.

‘‘నువ్వు నన్ను గుర్తు పట్టలేదని భావిస్తున్నా’’
‘‘మనం క్రితం కలుసుకున్నామా?’’ బిపిన్‌బాబు అడిగాడు.
ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ‘‘ఒక పూర్తి వారంలోని ప్రతిదినం మనం కలుసుకున్నాము. 1958లో రాంచీలో హుద్రూ జలపాతాలకు నిన్ను తీసుకు వెళ్లడానికి నేను కారును ఏర్పాటు చేశాను. నా పేరు పరిమళ ఘోష్‌.’’

‘‘రాంచీనా?’’ ఇప్పుడు బిపిన్‌బాబు– అతనిక్కావలసిన ఆ వ్యక్తి ఎవరో తాను కాదని ఈ మనిషి పొరపాటు పడ్డాడనీ నిశ్చయానికి వచ్చాడు. తానేనాడూ రాంచీ వెళ్లలేదు. అనేకసార్లు వెళ్లాలని ఉద్దేశపడ్డాడు. కానీ ఎప్పుడూ వెళ్లలేదు. చిరునవ్వుతో అడిగాడు బిపిన్‌బాబు ‘‘నేనెవరో మీకు తెలుసా?’’
ఆ మనిషి కనుబొమలు పైకెగురవేస్తూ అన్నాడు ‘‘నువ్వు నాకు తెలుసు. బిపిన్‌ చౌధురిని ఎరగని వాళ్లెవరు?’’
బిపిన్‌బాబు పుస్తకాల అరల వైపు తిరిగి అన్నాడు ‘‘ఇప్పటికీ మీరు పొరపాటులోనే ఉన్నారు. నేనేనాడూ రాంచీ వెళ్లలేదు.’’

ఆ వ్యక్తి పెద్దగా నవ్వాడు ‘‘ఏమంటున్నావు మిస్టర్‌ చౌధురి! నువ్వు హుద్రూలో పడిపోయావు. నీ కుడి మోకాలికి గాయమైంది. నేను నీకు అయోడిన్‌ తెచ్చాను. తర్వాతి దినం నువ్వు నెవర్‌హాట్‌ వెళ్లడానికి నేనో కారు కుదిర్చాను. కానీ నువ్వు నీ మోకాలి నొప్పితో వెళ్లలేకపోయావు. ఇవేవీ గుర్తులేవా? అదే సమయంలో నీకు తెలిసిన మరో వ్యక్తి కూడా రాంచీలో ఉన్నాడు. అతను మిస్టర్‌ దినేష్‌ ముఖర్జీ.నువ్వో బంగ్లాలో బస చేశావు. నీకు హోటలు భోజనం ఇష్టం కాదని చెప్పావు. ఎవరైనా ఒక వంట మనిషి వండిన భోజనమైతే మేలన్నావు. నీకింకా చెప్తాను. దర్శనయోగ్యస్థలాలకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ నువ్వో సంచిలో పుస్తకాలు పెట్టుకుని మోసుకెళుతుంటావు. అవునా, కాదా?’’

తన దృష్టినలాగే పుస్తకాల మీద నిలిపి నిమ్మళంగా మాట్లాడాడు బిపిన్‌బాబు ‘‘1958 గురించి మాట్లాడుతున్నారు కదా, అది ఏ నెల?’’
‘‘అక్టోబరు’’ అన్నాడా వ్యక్తి.
‘‘లేదండి’’ బిపిన్‌బాబు అన్నాడు. ‘‘58 అక్టోబరులో నేను కాన్పూరులో ఉన్న నా మిత్రుని వద్ద గడిపాను. మీరు పొరబడ్డారు. మంచిది. సెలవ్‌!’’

కానీ ఆ మనిషి సెలవు తీసుకోనూలేదు, మాట్లాడకుండా ఉండనూలేదు. ‘‘చాలా చిత్రం. ఒక సాయంకాలం నీ బంగళా వరండాలో నీతో కలసి తేనీరు తాగాను. నువ్వు నీ కుటుంబం గురించి మాట్లాడావు. నీకు పిల్లల్లేరని చెప్పావు. పదేళ్ల క్రితమే భార్యను కోల్పోయానన్నావు. నీ ఒక్కగానొక్క తమ్ముడు పిచ్చితో చనిపోయాడనీ, అందుకే నువ్వు రాంచీలో మనోవ్యాధుల చికిత్సాలయానికి రావడం నీకిష్టంలేదని చెప్పావు.’’

బిపిన్‌బాబు కొన్న పుస్తకాలకు డబ్బిచ్చి దుకాణం వదిలి వెళుతుండగా ఆ వ్యక్తి శుద్ధ అపనమ్మకంతో అతన్నలాగే చూస్తూ ఉండిపోయాడు.
బిపిన్‌బాబు కారును బెర్ట్రం వీధిలోని లైట్‌హౌస్‌ చిత్రశాల దగ్గర కార్లు నిలిపే స్థలంలో సురక్షితంగా నిలుపుతాడు. వచ్చి కారులో కూర్చుంటూ నడిపే వ్యక్తికి ‘‘కొంచెం అలా గంగ పక్కగా పోనియ్‌ సీతారాం’’ అని చెప్పాడు. తీరా రాస్తాపైన కారు పోతుండగా... ఇందాక తానడగకుండానే జోక్యం చేసుకుని చొరబడిన వ్యక్తి వద్ద శ్రద్ధ కనపరచినందుకు పశ్చాత్తాపపడుతున్నాడు. తానెప్పుడూ రాంచీ వెళ్లలేదు. దాని గురించి ప్రశ్నే లేదు. కేవలం ఆరేడు సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను మరచిపోవడం అసంభవం. తనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది– తనకి బుర్రతిరుగుడు జరిగితే తప్ప...

తాను చలచిత్తుడైతే తప్ప– కానీ అదెలా జరుగుతుంది? ప్రతిదినం అతను కార్యాలయానికి వెళ్లి పని చేస్తూనే ఉన్నాడు. అదొక పెద్ద సంస్థ. అందులో తాను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఇప్పటివరకు ఏదైనా తీవ్రమైన తప్పు జరుగుతోందని అతని దృష్టికి వచ్చింది లేదు. ఈరోజే చాలా ముఖ్యమైన సమావేశంలో అరగంటసేపు మాట్లాడాడు. అయినా...
అయినప్పటికీ, ఆ వ్యక్తి తన గురించి సవిస్తారంగా ఆరా తీశాడే. ఎలా? అతను కొన్ని ఆంతరంగిక వివరాలను సైతం తెలుసుకున్నట్లు కనిపిస్తోంది... పుస్తకాల సంచి, భార్య గతించడం, సోదరుని పిచ్చి... ఒకే పొరపాటు– తాను రాంచీ వెళ్లానని చెప్పడం గురించి. అది పొరపాటు మాత్రమే కాదు, బుద్ధిపూర్వకంగా చెప్పిన అబద్ధం. 1958లో అది పూజల సమయం. తాను తన మిత్రుడు హరిదాస్‌ బాగ్చీ దగ్గర కాన్పూర్‌లో ఉన్నాడు. ఈ విషయంలో అతనికి రాస్తే..? లేదు లేదు. హరిదాస్‌కు రాసే మార్గం లేదు. అతను తన భార్యతో సహా కొన్ని వారాల క్రితం జపాన్‌ వెళ్లాడనేది హఠాత్తుగా గుర్తుకొచ్చింది బిపిన్‌కి. అతని చిరునామా తన వద్ద లేదు.

అయినా దీనికి రుజువుల అవసరం దేనికి? తాను రాంచీ వెళ్లలేదనేది తనంటత తనకి పూర్తిగా తెలిసిందే కదా!... అంతే!
నది నుంచి వస్తున్న చల్లనిగాలి అతనికి కొంత బలాన్ని చేకూర్చింది. అయినా, కొద్దిపాటి అసౌకర్యం బిపిన్‌బాబు మనసులో తారాట్లాడుతోంది. తనను చుట్టుముడుతున్న తీవ్రతలో బిపిన్‌బాబు... ఒక ఆలోచనతో తన పొడవు నిక్కరును పైకి మడిచి కుడి మోకాలును చూసుకున్నాడు. ఒక అంగుళం పొడవున పాతగాయపు గుర్తు కనిపించింది. అదెప్పటిది అనేది చెప్పడం అసంభవం. చిన్నపిల్లవానిగా కిందపడి మోకాలి గాయం చేసుకోవడం ఎప్పుడైనా జరిగిందా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వీలవలేదు.

బిపిన్‌బాబు అప్పుడు హఠాత్తుగా దినేష్‌ ముఖర్జీ గురించి ఆలోచించాడు. ఆ సమయంలో ఆ సమయంలో దినేష్‌ రాంచీలో ఉన్నాడని ఆ వ్యక్తి చెప్పాడు. అతనిని అడగడమే ఉత్తమమైన రుజువర్తనమవుతుంది. పైగా అతను దగ్గరలోనే బెహినందన్‌ వీధిలో ఉంటున్నాడు. ఇప్పుడే అతని దగ్గరకు వెళితే ఎలా ఉంటుంది? అయితే, అప్పుడు– వాస్తవానికి తానెప్పుడూ రాంచీ వెళ్లి ఉండకపోతే, బిపిన్‌బాబు దృఢపరచుకోవడానికి అడిగినట్లయితే, దినేష్‌ ఏవిధంగా ఆలోచిస్తాడు! బహుశా బిపిన్‌బాబు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడనే భావనకు వస్తాడు. లేదు. అతన్నడగడం వెర్రితనం.
దయమాలిన దినేష్‌ తిరస్కార గుణం ఎలా ఉంటుందో తనకు తెలుసు.

తన ఏసీ గదిలో కూర్చుని చల్లని ద్రవాన్ని చప్పరించడంతో బిపిన్‌బాబు మళ్లీ నిమ్మళం చేకూరిన అనుభూతిని పొందాడు.
ఎంతటి పీకులాట? ఏమీ లేదు... చేయడానికి ఏ పనీ ఉండదు. ఇతరుల జుట్టులో కెలుకుతుంటారు.
రాత్రి భోంచేసిన తర్వాత, కొత్తగా తెచ్చిన ఉత్తేజిత నవలల్లో ఒకదాన్ని పట్టుకుని నిమ్మళంగా పడకన చేరాడు. కొత్త అంగడి వీధిలో కలిసిన వ్యక్తిని గురించి మరచిపోయాడు. తర్వాతి రోజు కార్యాలయంలో గడుస్తున్న ప్రతిగంట క్రితంరోజు తాను ఎదుర్కొన్న పరిస్థితి తన మనసును మరీ మరీ ఆక్రమించుకుంటున్నట్లు గమనించాడు. అతను తన గురించిన అంతటి సమాచారం తెలుసుకుని ఉన్నాడు కదా మరి రాంచీ ప్రయాణం గురించి పొరపాటెలా పడ్డాడు.

మధ్యాహ్న భోజన వేళకు కొంచెం ముందు దినేష్‌ ముఖర్జీకి ఫోను చేద్దామనే నిర్ణయానికొచ్చాడు. తన సందేహాన్ని ఫోను సంభాషణల్లోనే తేల్చుకోవడం ఉత్తమం. కనీసం ముఖంలో కదలాడే కలతన్నా తీరుతుంది. రెండు... మూడు... ఐదు... ఆరు... ఒకటి... ఆరు బిపిన్‌బాబు ఈ అంకెలను నొక్కి ‘‘హలో!.. దినేషేనా?... నేను బిపిన్‌ని’’
‘‘మంచిది– బాగుంది!... ఏమిటి సంగతులు!’’
‘‘1958లో జరిగిన ఒక సంఘటన నీకు గుర్తుంటే, నేను కొంత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నా...’’ 
‘‘యాభై ఎనిమిదిలోనా? ఏ సంఘటన?’’
‘‘ఆ సంవత్సరమంతా నువ్వు కలకత్తాలోనే ఉన్నావా? మొదటగా ఆ సంగతి నాక్కావాలి’’
‘‘కొద్దిగా... ఒక్క నిమిషం ఆగు...58– కొద్దిగా నా డెయిరీలో పరిశీలించనివ్వు...’’
ఒక్క నిమిషం సేపు అటువైపు  నిశ్శబ్దం. బిపిన్‌బాబు తన గుండె కొట్టుకోవడం పెరిగినట్లు భావించాడు. కొద్దిగా చెమట్లు కూడా పట్టాయి.
‘‘హలో!’’
‘‘చెప్పు’’
‘‘దొరికింది. నేను రెండుసార్లు బయటకు వెళ్లాను.’’
‘‘ఎక్కడికి?’’
‘‘ఒకసారి ఫిబ్రవరిలో దగ్గర్లోని కృష్ణనగర్‌కు మేనల్లుడి పెళ్లికి. తర్వాత... అయితే దీని గురించి నీకు తెలుసునే!– అది రాంచీ ప్రయాణం. నువ్వక్కడున్నావు కూడా.– అంతే! కానీ, ఏమిటిదంతా– ఈ పరిశోధన?’’
‘‘ఏమీ లేదు. కొద్దిగా సమాచారానికి.– ఏమైనా– ధన్యవాదాలు’’
బిపిన్‌బాబు దడాలున ఫోను పెట్టేసి, తన తలను గట్టిగా చేతులతో పట్టుకున్నాడు. తల ఈదులాడుతున్న భావన– ఒక చలి ఝలక్‌ తన శరీరమంతా పాకుతున్నట్లనిపించింది. భోజనపు గిన్నెలో రొట్టెముక్కల మధ్య మాంసం పొదిగిన పదార్థాలు ఉన్నాయి. కానీ బిపిన్‌ వాటిని తినలేదు. ఆకలంతా ఇగిరిపోయింది పూర్తిగా.
మధ్యాహ్న భోజన సమయం తర్వాత బిపిన్‌బాబు బల్ల దగ్గర కూర్చుని తాను క్రితంలా యథాశక్తిగా పని నిర్వహించలేనేమోననుకున్నాడు. తాను ఆ సంస్థలో ఉన్న పాతికేళ్లలో ఏనాడూ ఇలా జరగలేదు. అలుపెరుగని, సత్యసంధత కలిగిన పనివానిగా అతనికి కీర్తి ఉంది. కానీ, ఈరోజు అతను అయోమయంలో పడిపోయి, సరైన ఆలోచన చేయలేకపోతున్నాడు.

అతను రెండున్నరకి ఇంటికి తిరిగి వచ్చి మంచంపై పడుకుని ప్రశాంతతను కూర్చుకుని నెమ్మది ఆలోచనతో తన బుద్ధి వివేకాలను సమీకరించుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి తెలుసు. తలలో ఏదైనా గాయమైతే ఆ వ్యక్తి జ్ఞాపకశక్తిని కోల్పోయే అవకాశం ఉంది. ఎవరో ఒక వ్యక్తి గుర్తుచేసిన ఒకే ఒక సంఘటన తప్ప ప్రతిదీ తనకు గుర్తుంది. సముచితంగా ఈ మధ్యనే జరిగిన ప్రాముఖ్యత కలిగిన ఆ ఒక్కటే... అతనెప్పుడో రాంచీ వెళ్లాలని కోరుకోవడం– వెళ్లడం. అక్కడ పనులు జరపడం... అవి జ్ఞాపకం లేకపోవడం... ఏదైనా పూర్తిగా అసంభవం!
ఏడున్నర సమయంలో బిపిన్‌ సేవకుడు వచ్చి ‘‘అయ్యా! చునీబాబు... చాలా ముఖ్యమైన సంగతట...’’ అంటూ చెప్పాడు.

చునీ ఎందుకొచ్చాడో బిపిన్‌బాబుకు తెలుసు. చునీలాల్‌ బడిలో తనతో ఉండేవాడు. ఈ మధ్య అతని రోజులు బాగాలేవు. అందుకని తరచు తన దగ్గరకు వస్తున్నాడు తనకేదైనా ఉద్యోగం చూడమని. అతని కోసం తానేదైనా చేయడం సంభవం కాదని బిపిన్‌బాబు బాగా ఎరుగును. వాస్తవానికి ఆ విషయం అతనితో కూడా చెప్పాడు. అయినా చునీ చెల్లని కాసులా వస్తూనే ఉన్నాడు. 
ప్రస్తుతం చునీని చూడటం తనకు సాధ్యం కాదని, ఇప్పుడే కాదు చాలా వారాల పాటు కుదరదని కబురంపాడు బిపిన్‌. అయితే, ఆ కబురుతో సేవకుడు గడప దాటిన మరుక్షణంలో బిపిన్‌బాబుకు ఒక ఆలోచన తట్టింది. 1958లో తన రాంచీ ప్రయాణం గురించి చునీకి ఏమైనా గుర్తుండవచ్చునేమోనని. అతన్ని అడగడంలో ఇబ్బంది ఉండదు కదా! తక్షణం బిపిన్‌బాబు హడావుడిగా మెట్లు దిగి కిందనున్న వాడుక గదిలోకి వెళ్లాడు. వెళ్లిపోబోతున్న చునీ బిపిన్‌ రావడం చూసి ఆశ చిగురించి వెనక్కు తిరిగాడు.

బిపిన్‌బాబు డొంకతిరుగుడుకు ఇష్టపడకుండా సూటిగా అడిగాడు ‘‘చూడు చునీ! ఒక విషయం నిన్నడగదలచుకున్నాను. నీకు మంచి జ్ఞాపకశక్తి ఉంది. నువ్వు నన్ను చాలాకాలంగా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నావు. నీ మనసును కేవలం పాత రోజులకు మరల్చి ఆలోచించి చెప్పు. 1958లో నేను రాంచీ వెళ్లానా?’’
చునీ అన్నాడు: ‘‘యాభై ఎనిమిదా? అది యాభై ఎనిమిది అయి ఉంటుంది లేదా యాభై తొమ్మిది’’
‘‘నేను రాంచీ వెళ్లాననేది నీకు నిశ్చయమేనా?’’
చునీ ఆశ్చర్యంగా చూసిన చూపుతో ఆతృత కలసి ఉంది. ‘‘పోయి ఉండటం గురించి ఏమాత్రమో సందేహాలు ఉన్నాయని భావిస్తున్నావా?’’
‘‘నేను వెళ్లానా? నీకు స్పష్టంగా గుర్తుందా?’’

చునీ సోఫా మీద కూర్చుని దృఢపరచేలా బిపిన్‌ వైపు రెప్పలేయని దృష్టి నిలిపి అన్నాడు. ‘‘బిపిన్‌! మత్తు పదార్థాల్లాంటివేమైనా సేవించావా? నాకు తెలిసినంత వరకు అలాంటి అలవాట్ల విషయంలో నీకు స్వచ్ఛమైన చరిత్ర ఉంది. పాత స్నేహాలు నీకంతగా పట్టవని నాకు తెలుసు. కానీ, కనీసం మంచి జ్ఞాపకశక్తి ఉంది నీకు. రాంచీ ప్రయాణం గురించి నువ్వు మర్చిపోవడమనేది నీకు చిన్నతనమనిపించడం లేదా?’’
చునీ దృష్టి నుంచి బిపిన్‌బాబు వేరేవైపు తిరిగాడు. 
‘‘నేను చివర్లో ఏం ఉద్యోగం చేశానో అదయినా గుర్తుందా నీకు?’’ చునీలాల్‌ అడిగాడు.
‘‘పర్యాటక ఏజెన్సీలో పనిచేశావు కదా!’’

‘‘పోన్లే అదన్నా గుర్తుంది. కానీ, నీకు రాంచీకి రైలు టికెట్‌ సిద్ధపరచి తెప్పించింది నేనేననేది నీకు గుర్తులేదు. నిన్ను బండెక్కించి పంపడానికి ప్లాట్‌ఫామ్‌కు వచ్చింది నేనే! బోగీలోని ఫ్యాను పాడైతే ఆ వ్యక్తిని పిలుచుకు వచ్చి బాగుచేయించాను. వీటన్నింటినీ మరచిపోయావా? నీకేమైనా అయిందా? నీ ఒంట్లో బాగున్నట్లుగా కనిపించడం లేదు... అది తెలుసా నీకు?’’
బిపిన్‌బాబు నిట్టూర్చి తల అడ్డంగా ఊపాడు. కొంచెం సేపాగి అన్నాడు: ‘‘నేను చాలా ఎక్కువగా పని చేస్తున్నాను. అదే కారణమై ఉంటుంది. దీని గురించి వైద్య నిపుణుని సంప్రదించాలి.’’
సందేహం లేదు. చునీలాల్‌ తన ఉద్యోగం గురించి మాట్లాడకుండా వెళ్లిపోవడంతోనే బిపిన్‌కు పరిస్థితి అర్థమవుతోంది. 

చురుకైన మెరిసే కళ్లు. చక్కగా కొనదేలిన ముక్కుతో యువకుడైన పరేష్‌చందా వైద్య నిపుణుడు. ఆయన బిపిన్‌బాబు లక్షణాల గురించి వినగానే ఆలోచనలో మునిగాడు. ‘‘చూడండి డాక్టర్‌ చందా! ఈ దారుణమైన రుగ్మత నుంచి నాకు మీరు స్వస్థత చేకూర్చాలి. ఇది నా పని బాధ్యతలపై ఎంతగా ప్రభావం చూపిస్తోందో మీకు చెప్పలేను.’’

డాక్టర్‌ చందా తలను అడ్డంగా ఊపి అన్నాడు ‘‘మీకేమన్నా అర్థమవుతుందా మిస్టర్‌ చౌధురి! మీ రుగ్మత వంటి వ్యవహారాన్ని నేనింత వరకు చూడలేదు. స్పష్టంగా చెప్పాలంటే ఇది పూర్తిగా నా అనుభవ పరిధిని దాటి కనిపిస్తోంది. అయితే నేనొక సూచన చేస్తాను. అదెంతవరకు పనిచేస్తుందో నేను చెప్పలేను. కానీ, అదొక మంచి ప్రయత్నం, హానికరం కాదు.’’
బిపిన్‌బాబు ఆరాటంగా ముందుకు వంగాడు.

డాక్టర్‌ చందా చెబుతున్నాడు ‘‘నేననుకున్నదాని ప్రకారం మీరు రాంచీ వెళ్లి ఉంటారు. కానీ, ఏదో అవగాహనకు రాని కారణాల వల్ల ఆ కథన భాగం మీ మెదడు పొరలలోంచి తప్పుకుంది. దీనికిప్పుడు నా సూచన ఏమిటంటే, మీరు మళ్లీ ఒకసారి రాంచీ వెళ్లండి. మీరు ఆ ప్రదేశాలను చూస్తున్నప్పుడు మీ గత ప్రయాణం గుర్తు రావచ్చు. ఇది అసంభవమేమీ కాదు. నరాల సంబంధంగా ఉపశమనానికి నేనో మందు ఇస్తాను. నిద్ర చాలా ముఖ్యం. లేదా లక్షణాలు ఎక్కువయ్యే అవకాశాలుంటాయి.’’

మర్నాటి ఉదయం బిపిన్‌బాబుకు కొంతవరకు నెమ్మదించినట్లు అనిపించింది. ఉదయం టిఫిన్‌ చేశాక ఆఫీసుకు ఫోన్‌ చేసి, కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసి, తర్వాత అదేరోజు సాయంత్రం రాంచీ ప్రయాణం కోసం మొదటి తరగతి టికెట్‌ ఏర్పాటు చేసుకున్నాడు.

రెండోరోజు ఉదయం రాంచీలో బండి దిగి, గతంలో తాను ఏనాడూ అక్కడికి వచ్చి ఉండలేదని రూఢి చేసుకున్నాడు. అతను స్టేషన్‌ బయటకు వచ్చి, బాడుగ కారు తీసుకుని, తనే నడుపుకుంటూ కొంచెంసేపు పట్టణాన్ని చుట్టి వచ్చాడు. ఆ వీధులు, కట్టడాలు, ఫలహార భోజనశాలలు, వ్యాపార స్థలాలు, మోరాబాడీ కొండ ఏ ఒక్కటీ తనకే మాత్రం పరిచయం కలిగినది కాదని రూఢి చేసుకున్నాడు. హుద్రూ జలపాతాల వద్దకు వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందా! తనకా నమ్మకం లేదు. కానీ, అదే సమయంలో తాను తగినంత ప్రయత్నం చేయకుండా వదిలేశాననే శంక లేకుండా చేయాలనుకున్నాడు. సాయంత్రం ఒక కారును ఏర్పాటు చేసుకుని హుద్రూకు వెళ్లాడు.

అదే సాయంకాలం ఐదుగంటలకు ఒక వనభోజనాల బృందంలోని ఇద్దరు గుజరాతీలు బిపిన్‌బాబు ఒక పెద్ద బండరాయి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండగా కనుగొన్నారు. అతను తిరిగి స్పృహలోకి వచ్చాక అతను అన్నది ‘‘నేను అయిపోయాను. ఇంకే ఆశా మిగల్లేదు’’ అని.
తర్వాతి ఉదయానికి బిపిన్‌బాబు తిరిగి కలకత్తా వచ్చాడు. నిజానికి తనకేమాత్రం ఆశ మిగల్లేదనే నిశ్చయానికొచ్చాడు. ‘త్వరలో పనిమీద ఇచ్ఛ, నమ్మకం, సామర్థ్యం, ఆలోచన నియంత్రణ అన్నీ కోల్పోతాను. నేను... నా జీవితం శరణాలయంలో ముగిసిపోతుందా?’’ బిపిన్‌బాబు ఇక ఆపై ఆలోచించలేకపోయాడు.
 తిరిగి ఇంటికి చేరి, డాక్టర్‌ చందాకు ఫోన్‌చేసి ఇంటికి రమ్మని కోరాడు. తర్వాత తలస్నానం చేసి, తలకు ఐస్‌బ్యాగ్‌ బిగించుకుని పడుకున్నాడు. అదే సమయంలో సేవకుడు వచ్చి లెటర్‌బాక్సులో ఎవరో ఉంచారని చెప్పి ఒక ఉత్తరం తెచ్చిచ్చాడు. ఆకుపచ్చని కవరుపై ఎర్రసిరాతో తనపేర రాయబడి ఉందది. పేరు పైభాగంలో ‘‘అత్యవసరం– ఆంతరంగికం’’ అని రాసి ఉంది. తన ప్రస్తుత స్థితి బాగాలేకపోయినా బిపిన్‌ బాబు ఆ ఉత్తరం చదివి తీరాల్సిందిగా భావించాడు. కవరును ఒకవైపు చించి ఉత్తరం బయటకు తీశాడు. అందులో ఇలా ఉంది.

‘‘ప్రియమైన బిపిన్‌!

ఐశ్వర్యం నీలో ఈ విధమైన మార్పు తెస్తుందని నేననుకోలేకపోయాను. నువ్వు మారిపోయావు. అదృష్టం జారిపోయిన ఒక పూర్వమిత్రునికి సహాయం చేయడం నీకంతటి కష్టతరమా? నాకు డబ్బులేదు.

అలా నా సంపాదన వనరులు పరిమితమైపోయాయి. ఇక నాకున్న ఆలోచనేమిటి? అందులో భాగంగానే దయాదాక్షిణ్యాలు లేని నీ ప్రవర్తనకు ప్రాయశ్చిత్తం కలిగించే ఒక మార్గం ఎన్నుకున్నాను.
కొత్త అంగడి వీధిలో నీకెదురైన వ్యక్తి మా పొరుగింటివాడు. నాకు పరిచయస్తుడు. సామర్థ్యమున్న నటుడు. అందుకే, నేనతనికి రాసిచ్చినదంతా అవగాహనతో నటించగలిగాడు. ఇక, దినేష్‌ ముఖర్జీ.. తానేనాడూ, ముఖ్యంగా నీ పట్ల సదుద్దేశం, స్నేహం కలిగినవాడు కాదు. అందుకే ఈ విషయంలో నాకు సహాయపడటానికి పూర్తి అంగీకారం ఇచ్చాడు. నీ మోకాలి మచ్చ విషయానికొస్తే, 1939లో చాంద్‌పాల్‌ ఘాట్‌లో నువ్వు ఒక తాడు నుంచి జారిపడ్డప్పటిదని ఇప్పుడు నువ్వు కచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటావు.

సరే, ఇక ఇప్పుడు నువ్వు తిరిగి స్వస్థత పొందుతావు. నేను రాసిన ఒక నవలను ముద్రించడానికి ఒక ప్రచురణకర్త అంగీకరించాడు. అతను గనుక నాకు తగినట్లుగా ఇష్టపడినట్లయితే, అదే చాలు– రాబోయే కొద్ది నెలల్లో అదే నన్ను కాపాడుతుంది. నీ చునీలాల్‌’’

భారతీయ ఆంగ్ల మూలం : సత్యజిత్‌ రాయ్‌
అనువాదం: సుంకర కోటేశ్వరరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement