మా ఇల్లు విలక్షణమైనదని నా చిన్నతనం లోనే నేను గ్రహించాను. మా నాన్నగారు కుటుంబంతో ఎక్కువసేపు గడిపేవారు. ఆయన దాదాపుగా ప్రతిసారీ తన ఔట్‌డోర్ షూటింగులు వేసవి కాలం సెలవుల్లోనో, శీతాకాలం సెలవుల్లోనో ఉండేలా చూసుకొనేవారు. అందువల్ల మేమంతా ఆ సెలవుల్లో ఆయనతో పాటు ఔట్‌డోర్ షూటింగులో గడిపే వీలు చిక్కేది. ఆ రోజుల్లో నటీనటులు ఇప్పటిలా మరీ తీరిక లేకుండా ఉండేవారు కారు. అందువల్ల అలాంటి షూటింగులను ఎంతో సులభంగా ఏర్పాటు చేసుకోగలిగేవాళ్లం. ఆ రకంగా మహోన్నత చిత్ర నిర్మాణమంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను.
మా నాన్నగారు రేయింబవళ్లు పని చేసేవారు. ఇంట్లో ఏ అలికిడీ లేకముందే బాగా తెల్లవారు జామునే ఆయన నిద్ర లేస్తారు. అల్పాహారం తర్వాత ఉత్తరాలకు సమాధానాలిస్తూ ఉదయమంతా గడిపేస్తారు. ఆయనకు వ్యక్తిగత కార్యదర్శి అంటూ ఎవరూ లేరు. ఉత్తరాలు రాయడం దగ్గర నుంచి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడం దాకా అన్నీ ఆయనే స్వయంగా చేసేవారు. ఉదయం వేళల్ని ఆయన ఎక్కువగా బొమ్మలు గీసుకోడానికి ప్రత్యేకించుకునేవారు. మధ్యాహ్న భోజనం తరువాత ఆయన చిత్ర రూపకల్పనలో తన దృష్టి అవసరమైన కథా రచన, సంగీతం, తదితర అంశాల్లో దేని మీదనైనా ధ్యాస నిలిపేవారు.
స్క్రీన్ ప్లే, దుస్తులు, సంగీతం నుంచి.. పేర్లు వేసేట ప్పుడు వచ్చే బొమ్మల దాకా ప్రతి అంశం పైనా ఆయన ఏకాగ్రతతో పని చేసేవారు. ఎప్పుడూ ఆయన ఏదో ఒక పని చేస్తూ కనిపించేవారు. జీవన సాఫల్య పురస్కారంగా ఆస్కార్‌ను అందుకోవడం ఆయనకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ అవార్డు అందుకుంటూ చేసిన ప్రసంగంలో ఆయన 1944 నాటి చిత్రమైన ‘డబుల్ ఇన్‌డెమ్నిటీ’ చూశాక, ఆ చిత్ర దర్శకుడు బిల్లీ వైల్డర్‌కు తాను ఓ లేఖ రాశానని, ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో నిరాశ చెందాననీ తెలిపారు. ఆ తరువాత వైల్డర్ ఆయనకు ఓ టెలిగ్రామ్ ఇచ్చారు. లేఖకు జవాబు రాయనందుకు మన్నించమనీ, ఈసారి నాన్నగారు అమెరికాకు వచ్చినప్పుడు డబుల్ ఇన్‌డెమ్నిటీ చిత్రం గురించి సుదీర్ఘంగా చర్చిద్దామనీ వైల్డర్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ అది జరగనే లేదు.
– సందీప్ రాయ్, సినీ దర్శకులు, సత్యజిత్ రాయ్ కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment