దాహపు మనిషి | Indian cinemas: Gurudatt Jayanti on july 9 | Sakshi
Sakshi News home page

దాహపు మనిషి

Published Sun, Jul 6 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

దాహపు మనిషి

దాహపు మనిషి

సత్వం: గురుదత్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా సంపూర్ణం కాదు. భారతీయ సినిమాకు ముఖంగా పాశ్చాత్యులు పరిగణించే సత్యజిత్ రే మీద ఒక విమర్శ ఏమిటంటే, రే ప్రధాన ప్రేక్షకులు భారతీయేతరులే! కానీ గురుదత్ అలాకాదు. మౌఖిక సంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేశాడు. భారతీయ సినిమా తనకంటూ రూపొందించుకున్న నిర్దిష్టరూపాన్ని పాటిస్తూనే, సారంలో ఉన్నతిని ప్రదర్శించాడు. కెమెరాను స్వీయ వ్యక్తీకరణకు వాడుకున్నాడు. వసంతకుమార్ శివశంకర్ పదుకోణెగా బెంగళూరులో జన్మించాడు గురుదత్. పూర్తి దక్షిణాదివాడు. పేరు మార్చుకునేలా చేసింది ఆయన ఇష్టంగా పీల్చిన బెంగాలీ గాలి! ఆయన సినిమాల్లో కూడా మార్మికత, అస్పష్టత లాంటి వంగతనం కనబడేది అందుకే!
 
 ఒక కథ తట్టగానే అందులో లీనమవడం, అది ఉత్సాహమివ్వడం మానేయగానే దాన్ని వదిలేసి మరో కొత్తదాన్లో పడిపోవడం గురుదత్ స్వభావమట! పిల్లాడు బొమ్మను పొందేదాకా చాలా ముఖ్యమైందన్నంత పట్టింపు కనబరిచి, తీరా చేతిలోకొచ్చాక అటూయిటూ తిప్పి కిందపడేస్తాడు కదా, అలా ఉండేదట గురు శైలి. ఏ సన్నివేశమూ ఆయనకు ఒకపట్టాన నచ్చేది కాదు. ‘ఏక్ ఔర్, ఇంకోటి, ఇంకోటి,’ అంటూ తీస్తూపోయేవాడు. మరింత మెరుగైనది ముందుందని నమ్మేవాడు. ‘ప్యాసా’లోని ఒక సన్నివేశానికైతే 104 టేక్స్ చేశామని గురుదత్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్ వి.కె.మూర్తి అంటారు. అందుకే, నిర్మాతలను విసిగించలేకే తొలిహిట్లతో కూడబెట్టిన డబ్బుతో స్వయంగా నిర్మాణానికి పూనుకున్నాడు గురుదత్.
 
 ఈ సన్నివేశానికి సిద్ధమవుతూ కూడా, తరువాయి సన్నివేశం గురించి ఆలోచించేవాడట గురుదత్. సృజనాత్మక మెదడు ఎప్పుడూ ఖాళీగా ఉండనట్టుగా, ఏదో లోకంలో ఉండేవాడు. ‘పిలవగానే ఒక్కసారిగా మేల్కొన్నట్టుగా అందులోంచి బయటకు వచ్చేవాడు’.‘ప్యాసా’లో నిజానికి దిలీప్‌కుమార్ నటించాల్సింది! కానీ పారితోషికం విషయంలో వచ్చిన చిక్కులవల్ల తానే ఆ ‘కవి’ పాత్రను పోషించేందుకు సిద్ధపడ్డాడు గురుదత్. అది క్లాసిక్‌గా నిలవడానికి అదీ ఒక కారణమంటారు విమర్శకులు.
 
 ఏ దర్శకుడైనా తన జీవితంలో ఉన్నది సినిమాలో కలపకుండా ఉండడు. మెరుగుల ప్రపంచంలో నిలబడలేని తనలాంటి సున్నితమైన దర్శకుడి జీవితాన్నే ‘కాగజ్ కె ఫూల్’లో పాక్షికంగానైనా తెరకెక్కించడం గురుదత్‌కే చెల్లింది. అయితే, చిత్రంగా కాగజ్ కె ఫూల్‌ను అప్పటి ప్రేక్షకులు తిప్పికొట్టారు. తెరమీదకు రాళ్లు విసిరారు. రచ్చ గెలిచాకే, ఇంట్లోనూ హారతి పట్టడం మొదలైంది. కానీ గురుదత్ మనసు తీవ్రంగా గాయపడింది. ఒకటి మాత్రం నిజం. ప్రేక్షకుల ప్రమాణం పాక్షికమే! కాలమే సిసలైన నిర్ణేత. రాళ్లు వేయించుకోవడానికి ‘సిద్ధపడ్డవాడి’కే కాలం పూలు జల్లుతుంది, తన పరీక్ష తాను పెట్టి!
 
 ‘పరిశ్రమకు కొత్తగా వచ్చినవాళ్లకు ఆయన మంచి దర్శకుడు. కొత్తవాళ్ల పరిమితుల్ని అర్థంచేసుకుని, వాటిని పరిష్కరించేవారు,’ అంటారు దత్ ఆస్థాన నటి వహీదా రెహమాన్. అంత జీవితాన్ని చూశాక కూడా, ఆయన తన సమస్యల్ని  పరిష్కరించుకోలేకపోవడం విధి వైచిత్రి!
 జానీ వాకర్‌తో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడు. వి.కె.మూర్తితో దోశ, భేల్‌పూరి తినడానికి పోయేవాడు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు. మితం లేకుండా మద్యం తాగేవాడు. అటు భార్య గీతాదత్‌తో సర్దుబాటు కాలేక, ఇటు వహీదాతో కొత్త జీవితంలోకి అడుగిడలేక నలిగిపోయాడు.
 (భర్తను భరించలేక) భార్య పిల్లల్తో సహా దూరమైపోవడం, వహీదా వేరే దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించుకోవడం, కొత్తగా జతచేరిన ఆర్థిక ఇబ్బందులు... అప్పటికే సొంతిల్లు అమ్మాడు. అద్దింట్లోకి మారాడు. ‘నేను అనాథను అయ్యాను. ఇంట్లోవాళ్లు లేరు. నువ్వు(వి.కె.మూర్తి) బెంగుళూరు వెళ్లిపోతున్నావు, అబ్రార్ (అల్వీ-గురుదత్ ఆస్థాన రచయిత) ఇంకో సినిమా రాయడానికి మద్రాసు వెళ్తున్నాడు, నేను ఏం చేయను?’ అన్నాడట, చివరిసారి తనను కలిసిన మిత్రులతో.
 
 ‘చూడు, నేను దర్శకుడిని కావాలనుకున్నాను, దర్శకుడిని అయ్యాను; నటుణ్ని కావాలనుకున్నాను, నటుణ్నయ్యాను; మంచి పిక్చర్లు తీయాలనుకున్నాను, మంచివి తీశాను. పైసలున్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా నా దగ్గర ఏమీలేదు,’ అనుకునేంత నిరాశలోకి కూరుకుపోయాడు. 39వ ఏట తనను తానే హత్య చేసుకున్నాడు.
 
 ‘యార్, జీవితంలో ఉన్నవేమిటి? రెండే రెండు విషయాలు... విజయం, పరాజయం. వీటికి మధ్యన ఏదీలేదు,’ అన్నాడో సందర్భంలో గురుదత్. ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాడుగానీ జీవితంలో ఫెయిల్ అయ్యాడంటారు. కానీ ఆయనకు జీవితమే సినిమా అయినప్పుడు, జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని అనగలమా!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement