ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేతో పనిచేయలేకపోయినందుకు చాలా బాధగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎ వెన్స్‌డే, సర్ఫ్‌రోష్, మాన్సూన్ వెడ్డింగ్, ఇక్బాల్ తదితర సినిమాల ద్వారా నజీరుద్దీన్ మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కేతన్ మెహతా సినిమా ‘మిర్చి మసాలా’లో తన నటనను చూసి రేసాబ్ మెచ్చుకున్నారని నసీరుద్దీన్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘కాశీ కథ’ అనే బెంగాలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినిమాలో ఏదైనా పాత్ర ఇప్పించాలని చాలాసార్లు రే సాబ్‌కు ఉత్తరం రాద్దామని అనుకుని ఎందుకనో రాయలేకపోయానన్నారు.
కాని అటువంటి అద్భుతమైన దర్శకుడితో పనిచేయలేకపోయినందుకు ఇప్పుడు దానికి పశ్ఛాత్తాపం పడుతున్నానన్నారు. తాను మొదటిసారి సత్యజిత్ రేను కలిసిన ఘటనను షా గుర్తుచేసుకున్నాడు. తనకు 22 యేళ్ల వయసులో మ్యాక్స్ ముల్లర్ భవన్‌లో బెర్గ్‌మెన్ సినిమా ‘సెలైన్స్’ను చూశానని, ఆ సమయంలో మానిక్దా (సత్యజిత్ రే) కూడా తన తో పాటు సినిమా చూశారని చెప్పాడు. ఆ సమయంలో ఆయన పోలీస్ అధికారి స్టైల్‌లో నెత్తిపై టోపీ పెట్టుకుని తన ముందు సీటులో కూర్చుని ఉండటంతో తనకు సినిమా సరిగ కనిపించలేదని చెప్పాడు. కాగా, రెండేళ్ల కిందట రిభూ దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన మైఖేల్‌లో నసీరుద్దీన్ నటించినా అది ఇప్పటివరకు విడుదల కాలేదు.
జుధాజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాశీ కథ’ సినిమాలో నసీరుద్దీన్ షా ఒక కసాయి పాత్రలో కనిపించనున్నాడు. తాను ఇంతవరకు ఆ సినిమా చూడలేదని, అయితే సినిమా చాలా బాగుంటుందని చెప్పగలనన్నారు. ఈ సినిమాలో కాశీ పాత్ర సామాన్య ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. కాగా ఈ సినిమాలో కాశీ పాత్రధారి ఒక మేకతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ యానిమేటెడ్ మేక పాత్రకు ప్రముఖ బెంగాలీ కమెడియన్, క్యారెక్టర్ నటుడు కాంచన్ మల్లిక్ డబ్బింగ్ చెప్పడం విశేషం.
రే సాబ్‌తో చేయలేకపోయా..
Published Sun, May 4 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM
Advertisement
Advertisement