Oru Kuppai Kathai
-
సత్యజిత్రేలా ఉంది!
తమిళసినిమా: సత్యజిత్‌రే చిత్రం చూస్తున్నట్లు అనిపించిందని ఎండీఎంకే నేత వైగో ఒరు కుప్పై కథైపై ప్రశంసల వర్షం కురిపించారు. నవ దర్శకుడు కాళీ రంగస్వామి దర్శకత్వంలో అస్లామ్ నిర్మించిన చిత్రం ఒరు కుప్పై కథై. నృత్య దర్శకుడు దినేశ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి మనీషా యాదవ్ కథానాయకిగా నటించింది. గత వారం తెరపైకి వచ్చిన ఒరు కుప్పై కథై చిత్రాన్ని ఎండీఎంకే నేత వైగో ఇటీవల తిలకించారు. అనంతరం ఆయన చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఒరు కుప్పై కథై చిత్రాన్ని అందరూ, ముఖ్యంగా మహిళలు చూడాలన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడడం, వివాహేతర సంబంధం కారణంగా భార్య హత్య, ఈ కాలంలో భర్తను కొట్టి చంపిన భార్య లాంటి వార్తలు చదువుతుంటే వేదన కలుగుతోందన్నారు. 50 ఏళ్ల క్రితం ఇలా ఉండేది కాదన్నారు. సాయం చేయడమే ఎరిగిన దేశం మనదన్నారు. ఈ సమాజంలో బయట పడని అంతరంగ ఆపదలు ఎలా జరుగుతున్నాయన్నది ఎక్కడా అసహనానికి గురి కాకుండా ఒరు కుప్పై కథై చిత్రంలో దర్శకుడు కాళీ రంగస్వామి అద్భుతంగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రం ద్వారా ఆయన చాలా మంచి సందేశాన్ని చెప్పారన్నారు. మనం సమాజంలో సంసార జీవితాన్ని ఎలా సాగించాలి, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు? అన్న విషయాలను చక్కగా చెప్పారన్నారు. భర్త ధనవంతుడైనా సమాజంలోని పరిస్థితుల గురించి అవగాహన లేకుంటే ఎంత కష్టం అన్ని విషయాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శకుడు కాళీ రంగస్వామి ఇంత మంచి చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం అన్నారు. చిత్రంలో నటీనటులు నటించలేదని, పాత్రకు ప్రాణం పోశారని అన్నారు. ఈ చిత్రంలో చూపించిన ప్రాంతాలను చూసి ఏంటి ఇలా ఉంది అని తొలుత అనిపించినా నిజానికి అదే జీవితం. అయితే మరో జీవితం కూడా చిత్రంలో చూపించారు. నక్షత్ర హోటళ్లు, ఆడంబర జీవితాలు ఉంటాయన్నారు. అయితే మురికి వాడలు, అక్కడి ప్రజల జీవితాలు ఉన్నయే అవే వాస్తవం అన్నారు. దర్శకుడు సత్యజిత్‌రే తన చిత్రాల్లో ఇలాంటి విషయాలను తెరపై ఆవిష్కరించే పలు అవార్డులను అందుకున్నారన్నారు. ఈ ఒరు కుప్పైకథైకి అవార్డులు రాకపోయినా ప్రజలు చూసి ఆదరించాలన్నారు. -
రెడ్ జెయిన్ మూవీస్ ఖాతాలో ఒరు కుప్పై కథై
తమిళసినిమా: ఒరు కుప్పై కథై చిత్రాన్ని రెడ్జెయిన్ మూవీస్ సంస్థ ద్వారా నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ విడుదల చేయనున్నారు. కోలీవుడ్‌లోని ప్రముఖ నృత్యదర్శకుల్లో ఒకరైన దినేశ్ ప్రముఖ కథానాయకులందరి చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆయనిప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఒరుకుప్పై కథై. ఆయనకు జంటగా మనీషాయాదవ్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అస్లామ్ ఫిలింమ్ బాక్స్ పతాకంపై నిర్మించారు. తన శిష్యుడు కాళీ రంగస్వామిని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం విశేషం. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఒరు కుప్పై కథై బడుగు వర్గాల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్ చూసి ఇదో చిత్రమా అనుకునే వారు థియేటర్లో చిత్రం చూస్తున్నప్పుడు రెండవ భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారన్నారు. చిత్రం రెడీగా ఉంది చూస్తారా అన్న మైనా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలా చేసిన ఉదయనిధిస్టాలిన్ ఈ ఒరుకుప్పై కథై చిత్రాన్ని చూస్తారా? అన్న సందేహంతోనే అడిగామన్నారు. చిత్రం చూపిన ఆయన ఇలాంటి చిత్రాల రాక చాలా అవసరం అని వెంటనే తన సంస్థ ద్వారా విడుదల చేయడానికి అంగీకరించారన్నారు. కథానాయకుడు దినేశ్ నటన బాగుందంటూ ప్రశంసించారని అన్నారు. ఇటీవల తాను నటించిన చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఉదయనిధిస్టాలిన్ తమ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
తమిళ్ స్లమ్ డాగ్ ఒరు కుప్పై క థై
స్లమ్ డాగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డులను అందించిన చిత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి తమిళ స్లమ్ డాగ్ చిత్రంగా ఒరు కుప్పై కథై ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి. దర్శకులు ఎళిల్, అస్లామ్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఈయనకిది తొలి చిత్రం తన గురువుల్లో ఒకరైన అస్లామ్ నిర్మాతగా మారి తన ఫిలిం బాక్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ నృత్య దర్శకుడు దినేష్ కథా నాయకుడిగా పరిచయం అవుతున్నారు. వళక్కు ఎన్ 18/9, ఆదలాల్ కాదల్ చెయ్ వీరే చిత్రాల ఫేమ్ మనీషా యాదవ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ నృత్య దర్శకుడు దినేష్ నటించిన హీరో పాత్రను దర్శకుడు అమీర్, సముద్రకణి, మిష్కిన్ నటించాలని కోరుకున్నారన్నారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే ఒక చిన్న అంశాన్ని ఇంకా చెప్పాలంటే ఒక చెత్త లాంటి విషయాన్ని పద్ధతిగా చేస్తే అది ఎంత దూరం పోతుంది? పరిణామాలు ఎంత తీవ్రంగా మారుతాయి అని చెప్పే కథ ఒరు కుప్పై కథ చిత్రం అన్నారు. నవ దంపతుల మధ్య తలెత్తిన చిన్న సమస్య ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? అన్న అంశాన్ని సహజసిద్ధంగా తెరపై ఆవిష్కరించినట్లు చెప్పారు. ఇది యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అని చెప్పారు. కాదల్, కల్లూరి చిత్రాల ఫేమ్ జోష్యా శ్రీధర్ సంగీతాన్ని అంజాదే చిత్రం ఫేమ్ మహేష్ ముత్తుస్వామి చాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు వెల్లడించారు. -
మనీషాకు మరో అవకాశం
వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి మనీషా యాదవ్. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వరించాయి. జన్నల్ ఓరం, ఆదరాల్ కాదల్ సెయ్‌వీర్ వంటి విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మనీషా, దర్శకుడు శ్రీనురామస్వామి చిత్రం ఇవళ్ ఇదం పొరుళ్ చిత్రంలో ఎంపికయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె నటన సంతృప్తి కలిగించలేదంటూ దర్శకుడు చిత్రం నుంచి తొలగించారు. కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన మనీషా కెరీర్‌కు కొంచెం నష్టం కలిగించిందనే చెప్పాలి. ఆ తర్వాత అవకాశాలు కూడా ఆమెకు దూరం అయ్యాయి. తాజాగా మనీషాకు మరో అవకాశం వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత దినేష్ హీరోగా అవతారమెత్తనున్నారు. ఆయనతో మనీషా రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ జంట నటించే చిత్రానికి ‘ఒరు కుప్పై కథై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాళి రంగస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మరో యువ దర్శకుడు అస్లామ్ నిర్మించనుండడం విశేషం. మరో ముఖ్య అంశం ఏమిటంటే కాదల్ చిత్రం ఫేమ్ జాష్వా శ్రీధర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడం. ఈయన కొంత కాలంగా తమిళ చిత్రాలకు పని చేయడం లేదు. ఒరు కుప్పై కైథైవైవిద్య భరిత కుటుంబ కథ చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి తెలిపారు. దినేష్ చిత్రంలో చెన్నైకు చెందిన ఒక నిస్సహాయకుడైన యువకుడిగా నటిస్తున్నారని, మనీషా పల్లెటూరి పడుచుగా నటిస్తున్నారని చెప్పారు.