అభ్యర్థుల ఎంపికపై స్టాలిన్‌తో కాంగ్రెస్ సమావేశం
నేడు కొలిక్కి మేనిఫెస్టోకు తుదిమెరుగులు
పొత్తు, సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక, నియోజకవర్గాల ఎంపిక కసరత్తుల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది. డీఎంకేతో కాంగ్రెస్ కమిటీ మంగళవారం సమావేశమైంది. నియోజకవర్గ ఎంపిక కసరత్తు బుధవారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక, మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో డీఎంకే కమిటీ నిమగ్నమైంది.
సాక్షి, చెన్నై: డీఎంకేతో కలసి కాంగ్రెస్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. సీట్ల పందేరం కొలిక్కి రావడంలో జాప్యం నెలకొనడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ బయలు దేరింది. ఎట్టకేలకు సోమవారం సీట్ల పందేరం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 41 సీట్లను డీఎంకే కేటాయించడంతో, ఇక, దానిని పంచుకునేందుకు కాంగ్రెస్‌లోని గ్రూపులు నిమగ్నం అయ్యాయి. ఆయా గ్రూపు నేతలు తొలుత సత్యమూర్తి భవన్‌లో గసమాలోచించి అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకున్నారు.
తమ తమ మద్దతు దారులకు సీట్లను ఇప్పించుకునేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ సీట్ల పందేరం కమిటీలోని గ్రూపు నేతలు తమ పంపకాలు కొలిక్కి రావడంతో, ఇక డీఎంకే నుంచి ఏఏ నియోజకవర్గాలను రాబట్టుకోవాలో అన్న అంశంపై దృష్టి పెట్టారు. దీంతో కాంగ్రెస్ సీట్ల పందేరం కమిటీలోని ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, కృష్ణస్వామి, యశోధ, తిరునావుక్కరసు తదితరులు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కమిటీతో బుధవారం సమాలోచించారు.
అన్నా అరివాలయంలో ఈ సమాలోచన సాగింది. తమకు కావాల్సిన నియోజకవర్గాల జాబితాను డిఎంకేకు కాంగ్రెస్ కమిటీ అప్పగించింది. దీనిని పరిశీలించిన స్టాలిన్, ఇందులో కొన్ని మార్పులు, చేర్పుల దిశగా సూచనలు సలహాలతో సమాలోచన ముగిసింది. ఈ మార్పులు, చేర్పులతో బుధవారం నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తెచ్చి, కాంగ్రెస్‌కు అప్పగించే నియోజకవర్గాల వివరాల్ని ప్రకటించేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధం అవుతున్నారు.
మేనిఫెస్టోకు మెరుగులు : డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో ప్రత్యేక కమిటీ నిమగ్నం అయింది. సీనియర్ నేత టీ ఆర్‌బాలు, కరుణ గారాల పట్టి, ఎంపీ కనిమొళి, నేతలు సుబ్బలక్ష్మి జగదీశన్, దురై స్వామి, టీకేఎస్ ఇళంగోవన్, తంగం తెన్నరసు తదితరులుతో కూడిన ఈ కమిటీ ఉదయం నుంచి రాత్రి వరకు అన్నా అరివాలయంలో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నం అయింది. మేనిఫెస్టో తయారీ పూర్తికాగానే, అధినేత కరుణానిధికి ఒకటి రెండు రోజుల్లో సమర్పించి, ఆయన ఆమోదంతో తది మేనిఫెస్టోను సిద్ధం చేసి విడుదల కసరత్తుల్లో ఈ కమిటీ నిమగ్నమైంది.
కసరత్తు!
Published Wed, Apr 6 2016 2:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement