జయమ్మ పార్టీకి ఝలక్ ఇచ్చిన తమిళ స్టార్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జయలలిత పార్టీకి తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ షాక్ ఇచ్చారు. 'అమ్మ' జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి ఆయన గుడ్ బై చెప్పారు. సమథువా మక్కల్ కచ్చి పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల వేళ తన దారి తాను చూసుకున్నారు.
'నేను కూటమిలో కొనసాగుతానని గతంలో హామీ ఇచ్చాను. ఆ మేరకు ఐదేళ్లు కూటమిలో కొనసాగాను. నా మాట నెరవేరింది. నేను అన్నాడీఎంకేను ఏమీ నిందించను. కానీ ఈ ఐదేళ్ల గురించి సింహావలోకనం చేసుకుంటే మేం చేసిందాని కన్నా చాలా ఎక్కువ చేయాల్సి ఉండేది' అని శరత్ కుమార్ విలేకరులతో పేర్కొన్నారు.
శరత్ కుమార్ పార్టీకి తనతోపాటు మరో ఎమ్మెల్యే ఉన్నారు. అయితే అన్నాడీఎంకేతో పొత్తు కటీఫ్ చేసుకోవడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఎన్నావుర్ నారాయణ్ అమ్మ పార్టీకి అండగా నిలిచారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తానొక్కడే అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగారు శరత్ కుమార్. దక్షిణ తమిళ జిల్లాల్లో బలంగా ఉన్న నాడర్ వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న శరత్ కుమార్ త్వరలోనే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని ప్రకటించనున్నారు. తమిళ సినీ అసోసియేషన్ నడిగర్ ఎన్నికల వివాదంలో శరత్ కుమార్ కు అన్నాడీఎంకే మద్దతు ఇవ్వకపోవడంతోనే ఆ పార్టీ కూటమికి ఆయన గుడ్ బై చెప్పినట్టు భావిస్తున్నారు. అయితే నడిగర్ తో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని శరత్ కుమార్ కొట్టిపారేస్తున్నారు.