సినీ నటుడు, రాజకీయ ప్రముఖుడు ఎస్వీ శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు విచారణలో తేలింది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణ చెప్పుకున్నా, కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది.
ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారించారు. విచారణను ముగించిన ప్రత్యేక కోర్టు గత ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించింది. ఎస్వీశేఖర్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమాన విధించారు. అదే సమయంలో అప్పీల్‌కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో సమయం కేటాయించారు.
అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. ఈ పిటిషన్ విచారణ ప్రస్తుతం ముగిసింది. తీర్పును న్యాయమూర్తి వేల్ మురుగన్ వెలువరించారు. ప్రత్యేక కోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. అప్పీల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఎస్వీ శేఖర్ తెలుగు వారికి కూడా పరిచయమే.. ఆకలి రాజ్యం,అందమైన అనుభవం,వల్లభ,ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో ఆయన నటించారు. 100కు పైగా తమిళ సినిమాలలో మెప్పించారు. 2006లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.
మహిళా జర్నలిస్ట్‌పై నీచమైన కామెంట్
తమిళనాడులో చదువుకోని, ఇంగితజ్ఞానం లేని అమ్మాయిలే ఎక్కువగా మీడియాలో పనిచేస్తున్నారని ఒక మహిళా జర్నలిస్ట్‌ను ఉద్దేశిస్తూ.. 2018లో ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. 'విశ్వవిద్యాలయాల కంటే, మీడియాలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. వారు తమ బాస్‌లతో సన్నిహితంగా ఉంటూ అందుకు ఫలితంగా రిపోర్టర్‌లు, న్యూస్ యాంకర్‌లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. సాధారణంగా, తమిళనాడులోని మీడియా మొత్తం నేరస్థులు, కిరాతకులు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుంది.' అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment