ఆశీర్వదించండి!
ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకోండి
రెండాకుల చిహ్నంపై ఓటేయండి
అఖండ మెజరిటీతో మళ్లీ గెలిపించండి
ఓటర్లకు జయ వేడుకోలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అఖండ మెజార్టీతో మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడేలా ఆశీర్వదించాలని పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 16వ తేదీన పోలింగ్ సందర్భంగా ప్రజలకు బహిరంగలేఖ రాశారు. ఆ లేఖ లోని అంశాలు ఆమె మాటల్లోనే యథాతథంగా. ‘గత నెల 9వ తేదీన చెన్నైలో ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఈనెల 12వ తేదీన తిరునెల్వేలిలో జరిగిన సభతో ముగించాను. తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో నిర్వహించిన సభలు, నడిరోడ్లపై ప్రచార కార్యక్రమాలో ్లసైతం పెద్ద ఎత్తున నన్ను ఆదరించారు.
అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాల్సిందిగా తాను చేసిన విజ్ఞప్తిని లక్షలాదిగా తరలివచ్చి ఆలకించడంతోపాటు మన స్పూర్తిగా స్వీకరించారు. అన్ని ప్రచార సభల్లోనూ మీరు చూపిన ఆదరణను గమనిస్తే అఖండ మెజార్టీతో అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోంది. మీ అభిమానం, ఆదరణకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంజీ రామచంద్రన్ రూపకల్పన రెండాకుల గెలుపు చిహ్నంపై ఓటు వేసి తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకేను గెలిపించండి. అలాగే పుదుచ్చేరీలోని 30 నియోజకవర్గాల్లో , కేరళలోని ఏడు నియోజకవర్గాల్లో అపూర్వమైన మెజార్టీని కట్టబెట్టాలని కోరుకుంటున్నాను.
అన్ని నియోజకవర్గాల్లోనూ మీ అభిమాన సహోదరి (జయలలిత) పోటీ చేస్తున్నట్లుగా భావించి ఓటువేస్తారనడంలో సందేహం లేదు. 2006 నుండి 2011 వరకు రాష్ట్రాన్ని, కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండిన ఆ పార్టీ 2జీ కుంభకోణం, కట్టపంచాయతీలతో శాంతి భద్రతల సమస్యను సృష్టించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగిన భూకబ్జా రౌడీరాజ్యాన్ని తలపించడాన్ని ప్రజలు అంత సులభంగా మరిచిపోలేరు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్న తమ పలుకుబడిని ఉపయోగించి కరుణానిధి ఆయన కుటుంబ సభ్యులు అన్ని శాఖలను తమ వశం చేసుకుని యువతకు దక్కాల్సిన అవకాశాలను తన్నుకుపోయిన సంగతి మీరు మరిచిపోలేదని భావిస్తున్నాను.
2011లో మీ చలువ వల్ల అధికారం చేపట్టిన నేను డీఎంకే ప్రభుత్వం హయాంలో సాగిన చట్టవిరోధ చర్యలను సమూలంగా నిర్మూలించాను. రాష్ట్రంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరించాను. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భరోసా కల్పించాను. విద్యుత్ కోతలతో చీకట్లో మగ్గిపోతున్న రాష్ట్రానికి మిగులు విద్యుత్‌తో వెలుగు తెచ్చాను. అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనతో తమిళనాడు ప్రజలందరికీ జీవితంపై ఒక కొత్త నమ్మకాన్ని కలిగించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు ప్రజల హక్కులను కాపాడటంలో వెనుకాడలేదు.
ుళనాడుకు జీవాధారమైన కావేరీ, ముల్లైపెరియార్ నదీజలాల కోసం అలుపెరుగని పోరాటం చేసి సుప్రీం కోర్టు ద్వారా సాధించగలిగాను. మహిళలు అన్నిరంగాల్లో తల ఎత్తుకుని సగర్వంగా నిలిచేలా అనేక పథకాలను ప్రారంభించాను. అంతేగాక స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నాను. పోలీస్‌తోపాటూ అన్ని ఇతర శాఖల్లో పరుల జోక్యానికి తావులేకుండా పూర్తి స్వాతంత్య్రం కల్పించాను. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల ప్రజలు భద్రతతో కూడిన సుఖవంతమైన జీవనం సాగించేలా చేశాను. 2011 లో అధికారం చేపట్టిన తరువాత ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్దిపొందింది. గత ఐదేళ్లుగా సాధించిన ప్రగతి కొనసాగేలా మేనిఫోస్టో రూపొందించాను.
అన్నాడీఎంకే ప్రభుత్వ విజయాలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 16వ తేదీన జరుగనున్న పోలింగ్‌లో రెండాకుల చిహ్నంపై ఓటు వేయాల్సిందిగా అభ్యర్దిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రచారం కోసం అహర్నిశలు శ్రమపడిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటింగ్ రోజున అప్రమత్తంగా మెలిగి పార్టీ విజయానికి దోహదపడాలని కోరుతున్నాను. అలాగే పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు రెండాకుల చిహ్నంపైనా, కేరళలో పోటీచేస్తున్న ఏడు మంది అన్నాడీఎంకే అభ్యర్థులకు టోపీ చిహ్నంపైనా ఓటువేసి గెలిపించాలని ఆయా రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.’