జయలలితకు కరుణానిధి హామీ
చెన్నై: తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే చీఫ్లు బద్ధశత్రువుల్లా ఉంటారు. ఒకరు అధికారంలోకి వస్తే మరొకరిని వేధించడం, జైలుకు పంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే డీఎంకే చీఫ్ కరుణానిధి మాత్రం తమ పార్టీ అధికారంలోకి వస్తే జయలలిత సహా ఎవరిపైనా ప్రతీకార చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చారు.
ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితపై ప్రతీకార చర్యలు చేపట్టబోమని కరుణానిధి చెప్పారు. తాను ప్రతీకారం తీర్చుకుంటానని జయలలిత భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. అన్నా తనకు ద్వేష రాజకీయాలు నేర్పలేదని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన శనివారం ఆయన చింటాడ్రిపేట్లో బహిరంగసభలో పాల్గొన్నారు. డీఎంకేకు అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు. 2001లో అర్ధరాత్రి తనను అరెస్ట్ చేయడాన్ని గుర్తుచేస్తూ.. ప్రతీకారం తీర్చుకోవడం అన్నాడీఎంకే స్వభావమని విమర్శించారు. డీఎంకే ఎవరికీ శత్రువు కాదని స్పష్టం చేశారు. తమిళనాడులో సోమవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.