అదీ ఒక గెలుపేనా?
- జయపై కరుణ ధ్వజం
టీనగర్:ఆర్‌కే నగర్ గెలుపు అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు విజయానికి చిహ్నంగా జయలలిత పేర్కొంటూ ప్రజల నుంచి ఓదార్పును, భద్రతను కోరుకుంటున్నారని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విమర్శించారు. చెన్నై, ఆర్‌కే నగర్ నియోజవర్గంలో అత్యంత నిజాయితీ(?)తోను, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల(?)తోను, ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత(?)తోను, ఎటువంటి మంత్రుల హంగు, ఆర్భాటాలు లేకుండా (?) ప్రతిపక్షాల ప్రశ్నలకు జయలలిత సవ్యంగా బదులిస్తూ(?) ఎన్నికల కమిషన్-పోలీసు శాఖ-అనడీఎంకే అనే ముక్కోణపు కూటమి ఏర్పాటు చేసి జయలలిత గెలుపు సాధించారట అని విమర్శలు గుప్పించారు. అన్ని అధికారాలను చేతిలో ఉంచుకుని, మంత్రులందరిని రాత్రింబవళ్లూ వీధుల వెంట తిప్పారని, ప్రతిపక్షాలు దుష్టుడికి దూరంగా వుండాలనే రీతిలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సహకారంతో గెలుపొందడం నిజంగా గెలుపేనా? అని ప్రశ్నించారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు పోలయ్యాయనేందుకు 181వ పోలింగ్ బూత్ ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య కంటే ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయన్నారు.