కోర్టు తీర్పుతో డీఎంకే డీలా
అంతర్మథనంలో నేతలు
చెన్నై, సాక్షి ప్రతినిధి:‘ఏదో అవుతుందనుకుంటే ఇలా అయిందేమబ్బా.. అన్నాడీఎంకే భూస్థాపితం అవుతుందని ఆశపడితే మరింత బలం పుంజుకునే పరిస్థితి ఏర్పడింది.. ఈ దశలో కిం కర్తవ్యం’ ఏమిటి అనే మీమాంశలో డీఎంకే నేతలు పడిపోయారు. డీఎంకే, అన్నాడీఎంకే రాష్ట్రంలో నువ్వానేనా అనే రీతిలో బలమైన పార్టీలుగా ఎదిగాయి. రెండు పార్టీల రథసారథులు వ్యవస్థాపకులు మరణం తర్వాత పగ్గాలు చేపట్టినవారే. డీఎంకేను స్థాపించిన అన్నాదురై మరణంతో కరుణానిధి అధినేతగా మారారు. అన్నాదురై మరణం తర్వాత డీఎంకేలో ఇమడలేక ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన సతీమణి జానకీరామచంద్రన్ కొద్ది రోజులు పగ్గాలు చేపట్టినా, జయలలిత హయాంలోనే పార్టీ రాణించింది. ఈ రకంగా రెండు పార్టీల అధినేతలూ రెండోతరం వారేకాగా రాజకీయంగా భీష్మాచార్యుడు వంటి కరుణానిధి, వయస్సు, అనుభవంలోనూ జూనియర్ అయిన జయలలిత మధ్య గట్టిపోటీనే నెలకొంది. ఎంజీఆర్ మరణంతో డీఎంకేకు తిరుగులేదని ఆశించిన కరుణానిధికి అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత అనేకసార్లు చుక్కలు చూపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంజీఆర్‌ను మించిన ఫలితాలు సాధించడమేగాక, డీఎంకే అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయేలా చేశారు.
అమ్మ ఓటమే ఊతంగా..
యూపీఏ మిత్రపక్షంగా ఆ ప్రభుత్వ తప్పిదాలు, సొంత పార్టీలోని అక్రమార్కులతో డీఎంకే భారీ స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకుంది. దీనికితోడు రాష్ట్రంలో అమ్మజోరును ఆపేదెలా అని డీలాపడిపోయిన డీఎంకేలో కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు ఆశలు చిగురింపజేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతో పాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను సైతం జయ కోల్పోవడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయమనే ధీమా డీఎంకే నేతల్లో పెరిగిపోయింది. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఎదిగేందుకు అమ్మ అప్రతిష్టపైనే డీఎంకే ఆధారపడింది. కేసు నుంచి జయ బయటపడడంతో డీఎంకే అధినేత కరుణానిధి ఆత్మరక్షణలో పడిపోయారు. రాబోయే ఎన్నికల్లో అమ్మను విమర్శించడం మినహా మరే అస్త్రం లేని డీఎంకేకు తీరని వ్యథ మిగిలింది.
షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు వస్తే సరిగ్గా 12 నెలల్లో డీఎంకే ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను అవినీతిపరురాలని విమర్శించలేని స్థితి ఏర్పడింది. దీనికితోడు డీఎంకేలోని మాజీ మంత్రులు దయానిధి మారన్, ఏ.రాజా, కరుణ భార్య దయాళు అమ్మాళ్, కుమార్తె కనిమొళి సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. పక్కలో బళ్లెంలా తయారైన కరుణ పెద్ద కుమారుడు అళగిరి డీఎంకే ఓటమిని ఆశిస్తూ పావులు కదపడం మరో విఘాతం. జయ కేసులో కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో కేసుల చిక్కులు విదుల్చుకుని అన్నాడీఎంకే మరింత ఉజ్వలంగా వెలిగిపోతుండగా, డీఎంకే కేసుల ఊబిలో కూరుకుపోయి ఉంది. జయ నిర్దోషిగా బయటపడడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి అన్నాడీఎంకేకు కలిసొచ్చే అంశంగా మారింది. డీఎంకే ఊహలు, అంచనాలు తల్లకిందులైపోయాయి. కిం కర్తవ్యంపై కరుణ ఆలోచనలో పడ్డారు.
కిం కర్తవ్యం?!
Published Tue, May 12 2015 3:39 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM
Advertisement
Advertisement