
మాజీ సీఎం జయలలిత (ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై : అసెంబ్లీలో జయలలిత ఫోటో నెలకొల్పటంపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సోమవారం అసెంబ్లీలో అమ్మ ఫోటోను అన్నాడీఎంకే నెలకొల్పింది. అయితే అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తికి అంత సముచిత గౌరవం ఇవ్వడమేంటని? డీఎంకే ప్రశ్నలు గుప్పిస్తోంది.
‘ఒకవేళ జయలలిత ఇప్పుడు బతికి ఉంటే శశికళతోపాటు జైల్లో కూర్చుని ఊచలు లెక్కించేది. తమిళ గౌరవాన్ని చాటిన గొప్ప సీఎంల ఫోటోలు అసెంబ్లీలో ఉన్నాయి. అలాంటి వారి మధ్య నేరస్థురాలైన జయలలిత ఫోటోను ఉంచటం ఏంటి?. ఇది ముమ్మాటికీ అసెంబ్లీకి అవమానమే. తక్షణమే ఆ ఫోటోను తొలగించాలి’ అని డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టులో డీఎంకే పార్టీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇక ఈ కార్యక్రమాన్ని డీఎంకేతోపాటు, కాంగ్రెస్, ఐయూఎంఎల్ కూడా బహిష్కరించాయి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.
అయితే ప్రభుత్వం మాత్రం అవేం పట్టన్నట్లు స్పీకర్ ధన్‌పాల్ చేతుల మీదుగా ఫోటోను ఆవిష్కరించేసింది. ఏడు ఫీట్ల ఎత్తున్న జయలలిత ఫోటోను సరిగ్గా ప్రతిపక్షాల బెంచ్ వైపు చూసే విధంగా అమర్చారు. ఈ కార్యక్రమంలో సీఎం పళని సామి, పన్నీర్ సెల్వం, మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గతంలో మెరీనా బీచ్‌లో ఆమె స్మారక స్థూపం నెలకొల్పే సమయంలో కూడా సరిగ్గా ఇలాంటి విమర్శలే వినిపించాయి.
అసెంబ్లీలో నెలకొల్పిన జయలలిత ఫోటో
Comments
Please login to add a commentAdd a comment