జయమ్మపై కనిమొళి ఫైర్!
చెన్నై: డీఎంకే ఎంపీ, కరుణానిధి తనయురాలు కనిమొళి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో తన పేరు ఉన్నంతమాత్రాన అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపుపై ప్రభావం చూపెట్టబోదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
'అవినీతి గురించి జయలలిత మాట్లాడకూడదు. 2జీ స్పెక్ట్రమ్ విషయంలో మమ్మల్ని విమర్శించడానికి ఆమె ఎవరు? ఆమె చాలా కేసుల్లో దోషిగా తేలారు. తాన్ని కేసులో శిక్ష ఎదుర్కొన్నారు' అని కనిమొళి అన్నారు. ఆమె శుక్రవారం చెన్నైలో డీఎంకే తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా ప్రతి ఇంటికి వంద యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని జయలలిత ప్రభుత్వం నెరవేర్చబోదని కనిమొళి విమర్శించారు.
'ఉచిత విద్యుత్ హామీని ఆమె ఎలా నెరవేరుస్తారు. ఆమె ప్రభుత్వమే గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచారు. డీఎంకే మ్యానిఫెస్టోను యథాతథంగా కాపీ చేసి.. దానిపై అన్నాడీఎంకే తమ ముఖ్యమంత్రి స్టిక్కర్ ను అతికించింది. అంతుకుమించి అందులో కొత్తదనమేమీ లేదు' అని కనిమొళి మండిపడ్డారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై కనిమొళి కనీసం ఆరు నెలలు జైలులో గడిపిన సంగతి తెలిసిందే.