అధికారం ఇస్తే..
* రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తా
* తమిళనాట మూడో శక్తిగా కమలం
* తమిళ అభివృద్ధే లక్ష్యం
* అవినీతి పరులకు శిక్ష తప్పదు
* హొసూరు, చెన్నైలలో మోదీ ఎన్నికల ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాట బీజేపీ చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే, కేంద్ర పథకాలు ఒక దాని తర్వాత మరొకటి క్షణాల్లో ఇక్కడ అమలు అవుతాయని, గడపగడపకు చేరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ఇన్నాళ్లు ఇక్కడ ప్రత్యామ్నాయం లేదని, అయితే, ఆ శక్తిగా ఇప్పుడు తాము అవతరించామని వ్యాఖ్యానించారు. అవినీతి శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నామని, హెలికాప్టర్ల కొనుగోళ్లలో అవినీతి పరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఇక, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం హొసూరు, చెన్నైలలో నరేంద్ర మోదీ బహిరంగ సభల వేదికగా ప్రచారం సాగించారు. చిన్న పార్టీలతో కలిసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తమ కూటమి మాత్రమే అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కమలనాథులు ఓట్ల వేట సాగిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టడం లేదా, ప్రతినిధుల్ని సభలో అడుగు పెట్టించడం లక్ష్యంగా దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో తాను సైతం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పయనం చేపట్టారు. తొలి విడతగా హొసూరు, చెన్నైలలో జరిగిన ప్రచార సభల ద్వారా ప్రజల్ని ఆకర్షించే ప్రసంగాన్ని సాగించారు. యూపీఏ హయాంలో సాగిన అవినీతి చిట్టాను వివరిస్తూ తీవ్రంగా విరుచుకు పడ్డారు.
శిక్ష తప్పదు
ముందుగా హొసూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ, నేల బొగ్గులో అవినీతి, యూరియాలో అవినీతి, 2జీలో అవినీతి, హెలికాప్టర్ల కొనుగోలులో అవినీతి.. అబ్బో.. అన్నీ అవినీతి అన్నట్టుగా యూపీఏ పాలన సాగిందని ధ్వజమెత్తారు. తాను అధికార పగ్గాలు చేపట్టాక, అవినీతి శక్తుల్ని ఉక్కపాదంతో అణచి వేస్తూ, అవినీతి రహిత పాలనతో ముందుకు సాగుతున్నామన్నారు.
అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతిని కాంక్షిస్తూ, నిధుల కేటాయింపులు సాగుతున్నాయని వివరించారు. ఇక, 2జీ, 3జీ...అన్ని జీల అవినీతి కిలాడీలు తమిళనాట నుంచి వచ్చిన వాళ్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. హెలికాఫ్టర్ కుంభకోణంలో అవినీతి పరులకు శిక్ష తప్పదని ఈసందర్భంగా హెచ్చరించారు. కేంద్రం లో అధికార పగ్గాలు చేపట్టాక స్టార్టప్, స్టాండప్ , మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో ముందుకు సాగుతూ, ముద్రా యోజన పథకంతో అన్ని వర్గాల వారికి రుణాల్ని దారి చేరుస్తున్నామన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తన ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్న విషయాన్ని ప్రజలు పరిగణించాలని సూచించారు. ఇది వరకు బ్యాంకులు కొందరికే అని, ఇప్పుడు అందరికీ అని వ్యాఖ్యానించారు. బ్యాంక్‌ల వద్దకు వెళ్లేందుకు వెనక్కు తగ్గిన వాళ్లు కూడా ఇప్పుడు దర్జాగా అడుగు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే, బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరియాను వారి దరి చేరుస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేశామని చెప్పారు. భూమినో, తల్లి నగల్లో అమ్మి దళారుల చేతిలో, అవినీతి పరుల చేతిలో పెట్టి ఏ నిరుద్యోగి మోసపోకుండా ఉండాలన్న కాంక్షతో, ఇక, ప్రతిభకు పట్టం అన్నట్టుగా మార్కుల ఆధారంగా ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టామని వివరించారు.
మూడో శక్తిగా:
మామిడి పండు చేతికి ఇచ్చి కడుపు నింపుకోండి.. అని చేతులు దులుపుకోవడం కాదు అని, మామిడి చెట్టు ఇవ్వడమే కాకుండా, దానికి కావాల్సిన వన్నీ సమకూర్చినప్పుడు లభించే ఫలాలే ప్రజలకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయన్నారు. అయితే, ఇది తమిళనాట జరగడం లేదు అని, ఇక్కడ ఎలాంటి ఫలాలు లభించక ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం డీఎంకే, అన్నాడీఎంకేలకు మార్చి మార్చి అధికార పగ్గాలు చేపట్టడమే అని పేర్కొన్నారు. అందుకే అవినీతి ఇక్కడ రాజ్యం మేలుతున్నదన్నారు.
ఇన్నాళ్లు ఇక్కడ ప్రత్యామ్నాయం అన్నది లేదని, ఇప్పుడు, ఇక్కడ, మూడో శక్తిగా బీజేపీ అవతరించి ఉన్నదని వ్యాఖ్యానించారు. డిఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిన బీజేపీని ఆదరించాలని, ఆశీర్వదించాలని పిలుపు నిచ్చారు. తమకు అధికార పగ్గాలు అప్పగిస్తే, క్షణాల్లో ఢిల్లీలోని పథకాలన్నీ, ఇక్కడకు వాలుతాయని, ఒక దాని తర్వాత అన్నీ అమలు చేసి తీరుతామని, గడప గడపకు దరి చేరుస్తామని హామీ ఇచ్చారు. కాగా, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో వర్షం పడటంతో, వరుణుడే ఆహ్వానిస్తున్నాడని స్పందించారు. ఈ సమయంలో ఈ హోసూరు మీద నుంచి చెబుతున్నా అంటూ, కమలం చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే తమిళనాడు రూపు రేఖల్ని మార్చేస్తామని ప్రకటించారు.
తమిళ అభివృద్ధే లక్ష్యం:
శ్రీలంకలోని ఈలం తమిళుల సంక్షేమం కోసం, తమిళ జాలర్ల భ ద్రతను కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెన్నై వైఎంసీఏ మైదానంలో ప్రసంగించే క్రమంలో మోదీ వ్యాఖ్యానించారు. శ్రీలంకలో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న తమిళ జాలర్లను సురక్షితంగా ఇక్కడకు తీసుకు వచ్చింది, తాలిబన్ల చెరలో బందీగా ఉన్న ఫాదర్ ప్రేమను ఇక్కడికి రప్పించి తమ ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక్కడ అధికారం కోసం ఎన్నికలు జరగడం లేదని, తమిళనాడు భవిష్యత్తును, భావి తమిళనాడు నిర్మాణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని పరిగణించాలన్నారు.
అందుకే ఇది మంచి తరుణం అని, ప్రజలు ఆలోచించి మంచి ఫలితాల్ని ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వం కావా లా...? లేదా, కష్టాల కడలిలో ముంచే ప్రభుత్వం కావాలో..? ఆలోచించుకుని ఓట్లు వేయాలని సూచించారు. ఇక్కడ మోస పూరిత ప్రభుత్వాల్ని చూశారని, ఇక నైనా మంచి నిర్ణయంతో ముందుకు సాగాలని, కేంద్రం పథకాలన్నీ గడప గడపకు వెళ్లాలంటే తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తమిళంలో వనక్కం అంటూ ప్రసంగాాన్ని మొదలెట్టిన మోదీ, చివరగా తమిళ కవి తిరువళ్లూవర్ సూక్తులతో ముంగించడం విశేషం.