వైగో ఒంటరేనా?
వైగో ఒంటరేనా?
Published Wed, Dec 21 2016 3:44 PM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM
మిత్రుడ్ని దూరం పెట్టారు
వైగోకు ఆహ్వానం కరువు
28న పుదుచ్చేరిలో వీసీకే మహానాడు
చెన్నై : నలుగురు మిత్రుల మధ్య పాత నోట్ల రద్దు చిచ్చును రగిల్చింది. మోదీకి జై అని మద్దతు పలికిన మిత్రుడ్ని దూరం పెట్టేందుకు మిగిలిన వారు సిద్ధమయ్యారు. ఇందులో ఓ మిత్రుడు మరో అడుగు ముందుకు వేసి, తమ మహానాడుకు రావద్దన్నట్టుగా ఆహ్వానం పంపించే ప్రసక్తే లేదని బహిరంగంగానే తేల్చారు. ఇది మక్కల్ ఇయక్కంలోని సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేల నేతల మధ్య కలిగిన మనస్పర్థల ఎపిసోడ్. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని మక్కల్ ఇయక్కం(ప్రజా సంక్షేమ కూటమి) వర్గాలు జబ్బలు చరిచిన విషయం తెలిసిందే. తాము ఆరుగురం అంటూ అధికార పగ్గాలు చేపట్టేసినట్టుగా సీఎం పదవిలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను కూర్చోబెట్టినట్టుగా, తాము మంత్రులు శాఖల్ని పంచుకున్నట్టుగా ఎన్నికల ప్రచారం సమయంలో వీరి వాగ్ధాటికి హద్దే లేదు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు ఆ కూటమి అడ్రస్సును గల్లంతు చేశారు.
సీఎం పదవికి ఆశపడి చివరకు డిపాజిట్ కూడా దక్కని దృష్ట్యా, డీఎండీకే అధినేత విజయకాంత్, ఉనికి చాటుకునే ప్రయత్నంలో రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారడంతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తీవ్రంగానే పశ్చాత్తాపం పడక తప్పలేదు. ఈ ఇద్దరు కూటమికో దండం అంటూ బయటకు వచ్చేయడంతో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేలతో కూడిన నలుగురు మిత్రులు స్నేహ మంటే మాదేరా...అని డ్యూయెట్లు పాడుకుంటూ వచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించేది తామేనని రోడ్డెక్కి గళాన్ని వినిపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత నోట్ల రద్దు నిర్ణయం మిత్రుల్లో తొలుత ఆగ్రహాన్ని తెప్పించాయి. ముక్త కంఠంతో ఖండించారు. రోజులు గడిచే కొద్దీ ఏమి జరిగిందో ఏమోగానీ, మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎండీఎంకే నేత వైగో ఒక్కసారిగా మద్దతు పలకడమే కాదు, శభాష్ అని భుజం తట్టేంతగా ప్రశంసల్లో ముంచేయడం సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌లకు మింగుడు పడలేదు. ఇక, ఇయక్కం కనుమరుగైనట్టే అన్నంతంగా వ్యాఖ్యలు తూటాలు పేలాయి. అయితే, తమ మిత్ర బంధం మాత్రం పథిలం అని ఆయా నేతలు స్పందించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తాజాగా, వైగో ఇక ఒంటరి అన్నట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి.
మిత్రుడ్ని దూరం పెట్టారు : నోట్ల రద్దు వ్యవహారంలో అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏ కార్యక్రమం జరిపినా, జరిగినా, మిత్రులకు ఆయా పార్టీల నుంచి తప్పకుండా ఆహ్వానాలు పలకడం జరుగుతూ వచ్చాయి. అధినేతలు హాజరు కాకున్నా, ఎవరో ఒకరు తప్పకుండా హాజరయ్యే వారు. అయితే, ఈ సారి ఏకంగా మిత్రుడ్ని దూరం పెట్టేందుకు మిగిలిన ముగ్గురు సిద్ధమైనట్టున్నారు.
ఇందుకు ఇటీవల కాలంగా వైగో వ్యవహరిస్తున్న తీరు కారణంగా పరిగణించినట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఈనెల 28వ తేదీన పుదుచ్చేరి వేదికగా వీసీకే మహానాడు జరగనుంది. ఇందులో నోట్లరద్దు, కొత్త నోట్ల కోసం జనం పడుతున్న పాట్లపై కేంద్రం మీద దుమ్మెత్తి పోసే విధంగా నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. తమ మహానాడుకు హాజరు కావాలని స్వయంగా వీసీకే నేత తిరుమావళవన్ రాజకీయ పక్షాలకు ఆహ్వానం పలికే పనిలో పడ్డారు. తమ మిత్రులు సీపీఎం, సీపీఐలకు ఆహ్వానం ఉందని, అయితే, ఎండీఎంకే నేత వైగోను ఈ మహానాడుకు ఆహ్వానంచడం లేదని ప్రకటించడం చర్చకు దారి తీసింది. వైగోను ఆహ్వానంచడం ఇష్టం లేదన్నట్టుగా తిరుమా స్పందించడం, ఇందుకు మిగిలిన మిత్రులు మౌనం వహించడం బట్టి చూస్తే, ఇక మిత్రుడ్ని దూరం పెట్టినట్టేనా..? అన్నది స్పష్టం కాక తప్పదేమో..!
Advertisement
Advertisement