వైగోకి కోపం.. ఇంటర్వ్యూ నుంచి అవుట్
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూఎఫ్) సమన్వయకర్త, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కోపం వచ్చింది. న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కోపం రావడంతో మైక్ తీసేసి బయటకు వెళ్లిపోయారు.
పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి వైగోతో ఇంటర్వ్యూ చేస్తూ... ప్రజా సంక్షేమ కూటమిని అన్నాడీఎంకే బీ టీమ్ గా పిలవొచ్చా? అధికార పార్టీ నుంచి ఈ కూటమికి రూ.1500 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆయన 'నేను ఈ ఇంటర్వ్యూ రద్దు చేసుకుంటున్నాన'ని కాలర్ మైకును తీసేసి వెళ్లిపోయారు. మైకు తొలగించేముందు తన ప్రశ్న పూర్తిగా వినాలని పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి కోరినా ఆయన వినిపించుకోలేదు.
కాగా, తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వైగోకు డీఎంకే అధినేత కరుణానిధి శనివారం నోటీసులు పంపారు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కొట్టిపారేశారు.