
కరుణను చూసేందుకు వెళ్తే.. రాళ్లు, చెప్పులతో దాడి
చెన్నై: చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధిని పరామర్శించేందుకు వెళ్లిన ఎండీఎంకే నేత వైకోకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కావేరి ఆస్పత్రి దగ్గరకు వైకో కారు వెళ్లగానే అక్కడున్న డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరారు. డీఎంకే కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కారును ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు.
వైకో ఆస్పత్రిలో వెళ్లేందుకు వీలుగా డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టాలని పోలీసులు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దీంతో ఆయన ఆస్పత్రిలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. అనంతరం ఎండీఎంకే కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరుణానిధి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నట్టు చెప్పారు. కరుణ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె కనిమొళిని వాకబు చేసినట్టు తెలిపారు.
ఇటీవల అస్వస్థతకు గురైన కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. కరుణానిధిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై వచ్చి కరుణానిధిని పరామర్శించారు.