
వైగోకు అస్వస్థత
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగో అస్వస్థతకు లోనయ్యారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన మళ్లీ తన పర్యటనను కొనసాగించే పనిలో పడ్డారు. మంగళవారం వళ్లువర్ కోట్టం వేదికగా భారీ నిరసన కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన ఎండీఎంకే నేత వైగో ప్రజా మద్దతు సేకరణలో మునిగారు. డెల్టా జిల్లాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను అస్త్రంగా చేసుకున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో డ్యాంల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఖండిస్తూ, కావేరి నది తీరాల్లో మిథైన్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే పనిలో నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదంతో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. పది రోజులకు పైగా ఆయన తంజావూరు, తిరువారూరు, నాగపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి నాగపట్నంలో జరిగిన సభలో ఏక ధాటిగా రెండు గంటల సేపు ప్రసంగించారు. తనకు సీఎం పదవి మీద ఆశ, వ్యామోహం లేదని, తాను సేవకుడిని మాత్రమేనని, ప్రజల కోసం తాను శ్రమిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ సభను ముగించుకుని తిరువారూర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో బస చేశారు.
అస్వస్థత :
అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. కడుపు నొప్పి తీవ్రం గా ఉండడంతో అందుకు తగ్గ మాత్రలు వేసుకుని విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం వేకువజామున కడుపు నొప్పి తీవ్రత మరింత పెరగడం, మనిషి నీరసించిపోయూరు. ఆస్పత్రికి వెళ్లేదిలేదని ఆయన మారం చేయడంతో అక్కడికే వైద్యుల్ని రప్పించారు. ప్రథమ చికిత్స చేశారు. కాసేపటికి వైగో కోలుకున్నప్పటికీ, విశ్రాంతి తప్పదని వైద్యులు హెచ్చరించారు. అందుకు నిరాకరించిన వైగో తన ప్రచారాన్ని మళ్లీ మొదలెట్టారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూ ల్ మేరకు ఆయా గ్రామాల్లో ప్రజలు తన కోసం ఎదురు చూస్తుంటారని, తాను వెళ్లాల్సిందేని ముందుకు కదిలా రు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా సాయంగా ఒకరిద్దరు వైద్యులు వెంట వెళ్లారు. రాత్రి పర్యటన ముగిం చుకుని మంగళవారం ఉదయం చెన్నైకు వైగో చేరుకోవాల్సి ఉంది. వళ్లువర్‌కోట్టం వేదికగా జరిగే నిరసన సభకు ఆయన నేతృత్వం వహించనున్నారు.