క్రిమినల్‌గా ట్రీట్‌ చేయలేదు కానీ... | I was deported because Malaysia considered me a security threat: Vaiko | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌గా ట్రీట్‌ చేయలేదు కానీ...

Published Sat, Jun 10 2017 9:54 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

క్రిమినల్‌గా ట్రీట్‌ చేయలేదు కానీ...

క్రిమినల్‌గా ట్రీట్‌ చేయలేదు కానీ...

చెన్నై : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదుర్కొన్న  తమిళ నేత, ఎండీఎంకే అధినేత వైగో శనివారం వేకువ జామున చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను ఓ క్రిమినల్‌గా ట్రీట్‌ చేయకపోయినప్పటికీ... సాధారణ మర్యాదలు ఏమీ లేవని, ఇతర దేశాల్లా వ్యవహరించలేదని అన్నారు. తనను భద్రతా ముప్పుగా భావించడం వల్లే మలేషియా ఈ చర్యకు పాల్పడి ఉంటుందని వైగో అన్నారు. కాగా వైగోను శుక్రవారం కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఎల్‌టీటీఈతో సంబంధాలపై అక్కడే  చాలాసేపు ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను దేశంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ‘మలేసియాకు ప్రమాదకారుల’ జాబితాలో వైగో పేరు ఉండడమే అందుకు కారణమన్నారు. ఎల్‌టీటీఈలకు మద్దతుదారుగా ఉన్న వైగో మీద శ్రీలంకలో అనేక కేసులు ఉన్నాయని, తమిళనాడులో రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చినట్టుగా అక్కడి అధికారులు పేర్కొనడంతో ఆయనకు చేదు అనుభవం తప్పలేదు. రోజంతా ఒంటరిగా ఉంచడమే కాకుండా, శుక్రవారం రాత్రి   వైగోను మలేసియా ఎయిర్‌లైన్స్‌ విమానంలో తిరిగి చెన్నైకి పంపించారు.
 
కాగా మలేసియాలోని పెనాంగ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రామస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవడానికి వైగో మలేసియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో దిగగానే ఆయనను విమానాశ్రయానికే అధికారులు పరిమితం చేశారు. ఇమ్మిగ్రేషన్‌ వర్గాల పరిశీలనలో వైగో పాస్‌పోర్టు, వీసా పరిశీలన అనంతరం సీజ్‌ చేశారు. వైగోను అనుమతించకుండా ఇమ్మిగ్రేషన్‌ వర్గాలు అడ్డుకున్న సమాచారంతో పినాంగ్‌ సీఎం లింకు యాంగ్‌ మంగ్, డిప్యూటీ సీఎం రామస్వామి ఇమిగ్రేషన్, దౌత్య కార్యాలయ వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే,  ఏ ఒక్క అధికారి స్పందించలేదు.

మలేషియా ఉప ప్రధాని ఆదేశాలు తమకు ఉన్నాయని, వైగోను వెనక్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సూచించడంతో రామస్వామి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రోజంతా వైగోను ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయంలో ఓ గదిలో ఉంచారు. ఆయన్ను బయటకు ఎక్కడ పంపించలేదు. ఆయన కార్యదర్శి అరుణగిరికి మాత్రం అనుమతించారు. వైగో అక్కడే ఉండడంతో ఆయన కూడా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా వైగో మౌనం అనుసరించడంతో రామస్వామి అతికష్టం మీద ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఏమైనా వేధింపులకు గురి చేశారా అని ఆయన ప్రశ్నించగా, అందుకు వైగో, ఒంటరిగా ఉన్నానంటూ ఫోన్‌ కట్‌ చేయడం గమనార్హం. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement