వేలుపిళ్లై ప్రభాకరన్. తమిళులకు ఆరాధ్యుడు. శ్రీలంక ప్రభుత్వం దృష్టిలో రక్తపుటేర్లు పారించిన ఉగ్రవాది. భారత్ దృష్టిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టన పెట్టుకున్న హంతకుడు. 2009లో శ్రీలంక సైన్యం దాడిలో హతమైనట్టు ప్రపంచమంతా నమ్ముతుండగా, ఆయన బతికే ఉన్నారంటూ తమిళ నేత నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది...
పెద్దపులిగా పేరుబడ్డ ప్రభాకరన్‌ది ఆద్యంతం ఆసక్తికర ప్రస్థానం. శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న ఆశయ సాధనకు మూడు దశాబ్దాలకు పైగా లంక సైన్యంపై సాయుధ పోరాటం సాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఆరాధ్య నాయకుడిగా కీర్తి పొందిన ప్రభాకరన్ 1954 నవంబర్ 26న శ్రీలంకలోని ఉత్తర తీర ప్రాంత పట్టణం వల్వెత్తితురైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. స్థానిక సింహళీయులు, లంక సైనికుల అరాచకాలను కళ్లారా చూసిన ప్రభాకరన్ తట్టుకోలేకపోయారు. బడి మానేసి విప్లవోద్యమం వైపు అడుగులేశారు.
ఎల్టీటీఈ... ‘త్రివిధ’ ఉగ్ర సంస్థ!
ప్రభాకరన్ తొలుత తమిళుల ఆందోళన కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొన్నారు. నెమ్మదిగా తమిళ యువకులను చేరదీసి 1972లో ‘తమిళ్ న్యూ టైగర్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. 1975లో దాని పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)గా మార్చారు. అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. టైగర్స్, సీ టైగర్స్ (నావికాదళం), ఎయిర్ టైగర్స్ (వైమానిక దళం) పేరిట త్రివిధ దళాలున్న ఏకైక ఉగ్రవాద సంస్థగా ఎల్టీటీఈ చరిత్ర సృష్టించింది! అంతేగాక ఎల్టీటీఈలో ఆత్మాహుతి దళాలను, ‘సైనేడ్ మరణాల’ను ప్రవేశపెట్టి ప్రభాకరన్ సంచలనం సృష్టించారు.
తమిళులకు ప్రత్యేక దేశం కోసం లంక సైన్యంతో ఎల్టీటీఈ దళాలు ఏళ్ల తరబడి హోరాహోరీ తలపడ్డాయి. ఈ యుద్ధంలో లక్ష మందికి పైగా బలయ్యారు. బాధితుల్లో సింహళ జాతీయులతో పాటు తమిళులు కూడా ఉన్నారు. తమిళులు ముద్దుగా ‘తంబి’ అని పిలుచుకొనే ప్రభాకరన్ ఆయుధాలతో పాటు కొన్నిసార్లు దౌత్య మార్గాన్ని కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. 1985లో భారత చొరవతో, 2002లో నార్వే మధ్యవర్తిగా శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇంటర్‌పోల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దర్యాప్తు సంస్థలు ప్రభాకరన్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించాయి.
రాజీవ్ హత్య
ప్రముఖ నేతలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న తీరు ఎల్టీటీఈ రక్తచరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. భారత ప్రధాని రాజీవ్‌గాంధీ శాంతి పరిరక్షణ పేరిట లంకకు భారత సైన్యాన్ని పంపడంతో ప్రభాకరన్ తీవ్రంగా మండిపడ్డారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మానవ బాంబు దాడితో ఆయనను బలి తీసుకున్నారు. అనంతరం 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కూడా ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడికి బలయ్యారు. అంతేగాక చంద్రికా కుమారతుంగ, మైత్రిపాల సిరిసేన సహా పలువురు లంక అధ్యక్షులను, ప్రధానులను హతమార్చేందుకు ఎల్టీటీఈ విఫలయత్నం చేసింది. ఇక దాని దాడుల్లో బలైన శ్రీలంక మంత్రులు, రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారుల జాబితాకైతే అంతు లేదు!
వెంటాడి, వేటాడి...
దశాబ్దాలపాటు నెత్తుటేర్లు పారించిన ఎల్టీటీఈపై మహింద రాజపక్సె హయాంలో లంక సైన్యం ఉక్కుపాదం మోపింది. ముప్పేట దాడితో సంస్థను నిర్వీర్యం చేసింది. మిగిలిన కొద్దిమందీ చెల్లాచెదురయ్యారు. ప్రభాకరన్ కూడా మారుమూల ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది! ఆయన కోసం సైన్యం కనీవినీ ఎరగని రీతిలో వేటకు దిగింది. చివరికి 2009 మే 18న శ్రీలంకలోని ముల్లైతీవులో హోరాహోరీ పోరాటంలో ప్రభాకరన్‌ను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. దాడిలో అతని కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయినట్టు పేర్కొంది.
కొడుకు, కూతురు సజీవమే?
ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1984 అక్టోబర్ 1న చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లో మదివదనిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె ద్వారక, కుమారులు చార్లెస్ ఆంథోనీ, బాలచంద్రన్ ఉన్నా రు. బాలచంద్రన్ లంక సైనికుల చేతిలో మరణించగా మిగతా వారి ఆచూకీ తెలియదు. వారు లంకలో లేరని, విదేశాల్లో తలదాచుకుంటున్నారని తమిళులు నమ్ముతుంటారు.
ప్రభాకరన్ బతికే ఉన్నారు
త్వరలోనే జనం ముందుకొస్తారు
తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్
సాక్షి, చెన్నై/తంజావూర్: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ప్రభాకరన్ గురించి కొందరు పథకం ప్రకారం రేకెత్తించిన అనుమానాలకు నేను తెరదించుతున్నా. భార్యా కూతురితో సహా ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారు. ఆయన జనం ముందుకు రావడానికి ఇప్పుడు పూర్తి అనుకూల వాతావరణముంది’’ అని నెడుమారన్ సోమవారం తమిళనాడులో మీడియాకు వెల్లడించారు.
‘‘శ్రీలంకలో ఈళం తమిళుల పునఃప్రవేశంపై ప్రభాకరన్ త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. నేను చెప్పిందంతా వంద శాతం నిజమే’’ అని ఉద్ఘాటించారు. ప్రభాకరన్ ఇప్పుడెక్కడ ఉన్నదీ మాత్రం ఇప్పుడే చెప్పనన్నారు. శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభాకరన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్టీటీఈ ఏనాడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ప్రభాకరన్ బతికుంటే అంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని డీఎండీకే అధినేత వైగో, పలు పార్టీల నేతలన్నారు.
పెద్ద జోక్: శ్రీలంక
కొలంబో: ప్రభాకరన్ బతికే ఉన్నాడనడాన్ని పెద్ద జోక్‌గా శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి నళిన్ హెరాత్ అభివర్ణించారు. ‘‘ప్రభాకరన్ 2009 మే 18న హతమయ్యాడు. ఇది డీఎన్‌ఏ పరీక్షలోనూ నిర్ధారణ అయింది’’ అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment